విపత్తులో విద్యా భారతం – అస్నాల శ్రీనివాస్

  • సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి – ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ – 05) సందర్భంగా
  • national-teachers-day-special-essay-by-asnala-srinivas

BIKKI NEWS (SEP – 05) : బోధన అత్యుత్తమ కళల్లో ఒకటి. ఈ కళ ద్వారా ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రాణి అయిన మానవుణ్ణి తీర్చిదిద్దుతారు. మనషులు మనసుల్ని మొదట అర్థపరచి, ప్రకృతి స్పర్శకు ,సామాజిక గమన సూత్రాలకు స్పందించేలా కృషి చేస్తాడు. మేధోపటిమతో పాఠ్యంశాల వల్ల ప్రేమతో ,జ్ఞాన తృష్ణతో తమ చేతుల్లో విద్యార్థులు ఉదయభానుని వలె వికసించాలనే తపనను ఉపాధ్యాయుడు కలిగి ఉంటారు. ఈ వెలుగులో అవిద్య, అజ్ఞానముల నుండి భారతీయ సమాజాన్ని విద్యావెలుగుల వైపు మళ్ళింపచేయడంలో దిక్సూచిగా పనిచేస్తారు. అలాంటి ఉపాధ్యాయులలో అగ్రగణ్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలో విద్వేష, హింస, మూఢత్వంతో బందీ అయిన నేపథ్యంలో నైతిక విలువల ప్రాతిపదికగా శాంతి స్థాపనకు విద్య చోదక శక్తిగా పనిచేస్తుందని నమ్మి ఆ మార్గంలో దారి దీపంగా పనిచేశారు. సమకాలీన ప్రపంచంలో గొప్ప తాత్వికునిగా, రచయితగా, స్ఫూర్తిదాయక బోధకుడిగా, అలుపెరుగని ఆచార్యునిగా బహుళ రంగాలలో మానవీయ విలువలు కోసం పని చేశారు.

75 యేండ్ల తరువాత కూడా యు.యన్.డి.పి. మానవాభివృద్ధి 2022 సూచికలో 131వ స్థానంలో (189 దేశాలలో), యూనెస్కో వారి విద్యా అభివృద్ధి సూచిక 2021లో 32వ స్థానంలో (78 దేశాలలో) ఉండడం బట్టి మన దేశపు విద్యారంగ సంక్షోభాన్ని తెలియజేస్తున్నాయి. – అస్నాల శ్రీనివాస్

తత్వశాస్త్రం పట్ల అపారతృష్ట కలిగిన సర్వేపల్లి ప్రాక్, పశ్చిమ దర్శనాలను విస్తృత అధ్యయనం చేసి వాటిని సమకాలిన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యానించారు. తన జీవితంలో అనేక ఉన్నత స్థాయి పదవులు నిర్వహించి భారత ప్రధమ పౌరునిగా ఉన్నా కూడా తనను తాను ఉపాధ్యాయుడిగా చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడ్డాడు .జీవితాంతం వసుదైక కుటుంబ భావనను నిర్విరామంగా ప్రచారం చేశారు. అనేక దర్శనాలను మతాలను విలువలను తులనాత్మకంగా అధ్యయనం చేసి, ప్రావీణ్యం సంపాదించారు. తన వసుదైక కుటుంబం స్థాపనకు సాధనాలుగా ఉపకరిస్తాయని భావించి వాటిని ప్రజలలో తీసుకెళ్ళటానికి అంకిత భావంతో పనిచేశారు. మద్రాస్, మైసూర్, కలకత్తా మరియు ఆక్సఫర్డ్ విద్యాలయాల్లో అధ్యాపకుడుగా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు. ఈ క్రమంలో భారతీయ విద్యావ్యవస్థ పటిష్టతకై తపించారు. అంతర్జాతీయ విద్యా ధోరణులకు అనుగుణంగా భారత్ విద్యారంగం లేదని గ్రహించాడు. విద్యను ప్రజాస్వామీకరించడంతో పాటు మరింత లోతుగా నాణ్యముగా అందించాలని భావించాడు. విద్య నైపుణ్యాలు లక్ష్య ,గమ్య రహితంగా ఉంటే మానవ జీవితం నిస్సారం అవుతుంది .ప్రేరణ, లక్ష్యాలు లేని విద్య సాంస్కృతిక విలువల్ని హరింపచేస్తుంది. సాంస్కృతిక సాగు స్వభావాన్ని విద్య సంతరించుకున్నపుడే విద్యార్థులు అంకిత భావంతో జాతి నిర్మాణంలో పాల్గొంటారని సూత్రీకరించారు. శారీరక శ్రమ నుండి మానసిక శ్రమను వేరు చేయడం సరికాదు ,విద్యను శ్రమతో జోడించాలని, విద్య వివేకాన్ని నుంచి చెడులను గుర్తించే విచక్షణ, సమత్యులతను ఇచ్చేదిగా ఉండాలని అన్నారు. సమాజంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాలలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకొని, తమ ఆసక్తులకు అనువైన కోర్సులను ఎంచుకోవాలని విద్యార్థులకు సలహా ఇచ్చేవారు. పరిశోధన ఫలితాల ప్రమాణాలు, ఆధారాలు, శకలాల ప్రవాహంతో జ్ఞానం నిర్మితం అవుతుందని ఖచ్చితంగా విజ్ఞతను విచక్షణను కల్గిస్తుందన్నారు. వీటి సాధనకు మానవ జాతి సమిష్టి సంపదకు నిక్షేపాలు, చైతన్యానికి అక్షరరూపాలు పుస్తకాలతో ఉపాధ్యాయులు సంభాషణ సహచర్యం అలవర్చుకోవాలని సూచించారు.

బోధన అత్యుత్తమ కళల్లో ఒకటి. ఈ కళ ద్వారా ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రాణి అయిన మానవుణ్ణి తీర్చిదిద్దుతారు. మనషులు మనసుల్ని మొదట అర్థపరచి, ప్రకృతి స్పర్శకు ,సామాజిక గమన సూత్రాలకు స్పందించేలా కృషి చేస్తాడు. – అస్నాల శ్రీనివాస్

భారత్ కు ఉన్న ఆధ్యాత్మిక వారసత్వం పట్ల మహాదానందం వ్యక్తం చేస్తూనే, అదే సమయంలో అంధ విశ్వాసాలకు, బలహీనతలకు బందీ కావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. గొప్ప సంప్రదాయాలు, పుష్కల ప్రకృతి వనరులు ఉన్నప్పటికీ మన దేశం జీవన ప్రమాణాలల్లో దారుణంగా వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేసేవారు. సర్వేపల్లి ఆవేదన నేటికీ ప్రాసంగికతను కలిగి ఉంది. 75 యేండ్ల తరువాత కూడా యు.యన్.డి.పి. మానవాభివృద్ధి 2022 సూచికలో 131వ స్థానంలో (189 దేశాలలో), యూనెస్కో వారి విద్యా అభివృద్ధి సూచిక 2021లో 32వ స్థానంలో (78 దేశాలలో) ఉండడం బట్టి మన దేశపు విద్యారంగ సంక్షోభాన్ని తెలియజేస్తున్నాయి.

నిత్య జీవిత అనుభవాలు, పరిశీలనలను వైజ్ఞానిక దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. ఇది మేధో సమర్థతను నైతిక నిబద్ధతను సానుకూల ఉద్వేగాలను కలిగిస్తూ పక్షపాత దృష్టిని త్యజించడానికి తోడ్పడి, లక్ష్యాల సాధనకు ఉపకరిస్తుందని తెలియచేశారు. సైన్సును మానవ సంక్షేమం కోసం, మతాన్ని మానవత్వం కోసం ఉపయోగించాలి. సర్వ శాస్త్ర ప్రయోజనం ఆత్మ దర్శనం అని భావించాడు . ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య సయోధ్యా., సామరస్యాలను నెలకొల్పాలని బోధించారు. ప్రజాస్వామ్యం అంటే భిన్నభిప్రాయాలు సహనం అని అసమ్మతిని స్వీకరించే గొప్ప గుణమని, వైరుధ్యాలను శాంతియుత పద్ధతుల ద్వారా పరిష్కరించి, సహజీవనం సమభావం ద్వారా సమాజాన్ని నడిపించాలని కోరారు.

విశ్వవిద్యాలయాలు జ్ఞాన నిలయాలుగా విలసిల్లాలని విద్యావ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని విద్యపై వ్యయాన్ని ప్రజల ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం పెట్టుబడిగా భావించాలని సర్వేపల్లి సూచించారు. – అస్నాల శ్రీనివాస్

1948 జనవరి 16న న్యూఢిల్లీలో జరిగిన భారత విద్యా సదస్సులో ఆధునిక భారత నిర్మాత ప్రధాని నెహ్రు మాట్లాడుతూ దేశం పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చెందడానికి అనువైన విద్యారంగాన్ని రూపొందించటానికి సూచనలు చేయవల్సిందిగా కోరుతూ సర్వేపల్లి అధ్యక్షతన మొదటి విశ్వవిద్యాలయ కమిషన్ ను ఏర్పాటు చేసారు. విశ్వవిద్యాలయాలు జ్ఞాన నిలయాలుగా విలసిల్లాలని విద్యావ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని విద్యపై వ్యయాన్ని ప్రజల ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం పెట్టుబడిగా భావించాలని సర్వేపల్లి సూచించారు. ఈ విధంగా ప్రజాతంత్ర విద్యా నిర్మాతగా నిలిచిపోయారు.

విద్యకు ఉంచాల్సిన నాలుగు మూలస్థంబాలను అంతర్జాతీయ విద్యా కమిషన్ “ది ట్రెజరర్ వితిన్ లెర్నింగ్” ప్రస్తావించింది. ‘తెలుసుకోవడం కోసం’, ‘పనులు చేయడం కోసం, కలిసిమెలసి జీవించడం కోసం’, ‘ఎందుకు జీవించాలో తెలుసుకోవడం కోసం’, విద్యా లక్ష్యాలుగా ఉండాలని పేర్కొంది. – అస్నాల శ్రీనివాస్

ప్రస్తుతం జాతీయోద్య ఆకాంక్షలకు, రాజ్యాంగ తాత్వికతకు భిన్నమైన అస్తవ్యస్థ ధోరణులు విద్యారంగంలో సామాజిక రంగంలో కొనసాగుతున్నాయి. “ఈ దేశంలో మైనార్టీలు, దళితులు, ఆదివాసులు అందరు మెజార్టీ మతానికి విధేయులై ఉండి నివసించాలని వారు ఏమి హక్కులు కోరరాదని, ప్రాధ్యానతను ఆశించరాదని, చివరకు విద్యాహక్కులకు కూడా” అని సంఘ చాలక్ గోల్వాల్కర్ ప్రవచించిన ఆలోచన గుచ్ఛమును ఆదరిస్తున్న శక్తులు తరాలుగా దేశాన్ని పాలిస్తున్నాయి. 2014 నుండి 2022వరకు విద్యారంగానికి జిడిపిలో 6 శాతం కేటాయించాల్సి ఉండగా సగటున 0.51%మాత్రమే కేటాయించారు. హిందుత్వ పాతిపదికగా చరిత్రను వక్రీకరిస్తూ వైషమ్యాలు పెంచే విధంగా తిరుగరాస్తున్నారు. దీని ప్రచారం కోసం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ను వేదికగా, అలాగే విజ్ఞానం సాంకేతికతలు వెల్లివిరిసే సైన్స్ కాంగ్రెసులను సూడో సైన్స్ ప్రచారాలకు ఉపయోగించుకుంటున్నాయి. నిధుల కోరతతో, మౌళిక సౌకర్యాల లేమితో ఉపాధ్యాయు నియమాకాలు లేకపోవడంతో గత 6 సంవత్సరాలలో రెండు లక్షల ప్రభుత్వ బదులు మూతబడ్డాయి. లక్షన్నర బడులు ఏకోపాధ్యాయున్ని కలిగి ఉన్నాయి. అనేక ఉన్నత విద్యాసంస్థలకు నిధులను తగ్గించింది .ప్రవేట్ సంస్థలను స్వయంప్రతిపత్తి సంస్థలుగా నడుపడానికి అనుమతినిచ్చాయి. వనరులు సమకూర్చడం కోసం భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫలితంగా బహుజన వర్గాలకు ఉన్నత విద్య భారంగా మారుతున్నది. హెచ్.సి.యు. జె.ఎన్.యు.. బి.హెచ్.య ఐ.ఇ.టి. మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రజాస్వామ్య సంస్కృతిని ధ్వసం చేస్తూ భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తున్నది. రాజ్యాంగ చట్రంలో సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న ప్రొఫెసర్ సుధాభరద్వాజ్ ,ఆనంద్ తేలుతుంబే వంటి వాళ్ళ పై కుట్ర కేసులను మోపుతున్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వం విడుదల చేసిన, కస్తూరి రంగన్ రూపొందించిన జాతీయ విద్యా విధానం ముసాయిదా ఒక డొల్లగా నిరూపితమైనది. ప్రజాతంత్ర విద్యావ్యవస్థ మనుగడకు కావల్సిన ఉద్దీపనలు లేవు. ఉమ్మడి విద్యావ్యవస్థ అమలుపై కనీస ప్రస్తావనే లేదు. విద్యను వ్యాపారం చేయడం, ప్రైవేటీకరణ, కాషాయికరణ చేయడం కోసం సంఘపరివార్ అజెండాను రాకెట్ వేగంతో అమలు చేస్తున్నది. విద్యా వ్యవస్థ వైఫల్యంతో సామాజిక విలువలు పతనమవ్వడం, పారిశ్రామిక వ్యవసాయ రంగాలు కుదేలు అవుతున్న స్థితి కనిపిస్తుంది. స్వతంత్ర భారత చరిత్రలో గరిష్ట నిరుద్యోగ రేటు 6 శాతం కనిష్ఠ జీడిపి 5 శాతం నమోదు అయ్యి సంక్షోభం తీవ్రతరం అవుతున్నది. శాస్త్ర విజ్ఞానానికి సాంకేతిక నైపుణ్యతకు ప్రాధ్యానతను ఇవ్వకుండా అభివృద్ధి తిరోగమన పునరుద్ధరణ వాదానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ స్థితి దాపురిస్తున్నది.

ఈ దేశంలో మైనార్టీలు, దళితులు, ఆదివాసులు అందరు మెజార్టీ మతానికి విధేయులై ఉండి నివసించాలని వారు ఏమి హక్కులు కోరరాదని, ప్రాధ్యానతను ఆశించరాదని, చివరకు విద్యాహక్కులకు కూడా” అని సంఘ చాలక్ గోల్వాల్కర్ ప్రవచించాడు . – అస్నాల శ్రీనివాస్

సర్వవ్యాప్త సంక్షోభం నెలకొన్న విపత్కర పరిస్థితులలో జాతి నిర్మాత, తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణ భావనల అమలుకు మరింత సమకాలీనత, ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ప్రజలందరికి జ్ఞానార్జన ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయా సమాజాలు సంక్షేమ బాటను పడుతాయి అని చెప్పిన సర్వేపల్లి తాత్విక వెలుగులో ప్రజా ఉద్యమాన్ని నడుపాల్సిన అవసరం ఉన్నది. 21వ శతాబ్దంలో ప్రపంచ విద్యపై యునిస్కో 1996లో జాక్వస్ టేలర్ ఛైర్మన్ గా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా కమిషన్ “ది ట్రెజరర్ వితిన్ లెర్నింగ్” శీర్షికతో నివేదికను రూపొందించింది. దీనిని ఆమోదించిన దేశాలలో భారత్ కూడా ఉంది. ఇది విద్యకు ఉంచాల్సిన నాలుగు మూలస్థంబాలను ప్రస్తావించింది. తెలుసుకోవడం కోసం, పనులు చేయడం కోసం, కలిసిమెలసి జీవించడం కోసం, ఎందుకు జీవించాలో తెలుసుకోవడం కోసం విద్యా లక్ష్యాలుగా ఉండాలని పేర్కొంది. ఇంకా ఆర్థిక విధాన భావాజాలాల పలు స్థానిక, ప్రపంచ విషయాలపట్ల వైయుక్తిక, సార్వత్రిక విషయాలపట్ల సంప్రదాయ ఆధునిక విషయాలపట్ల ఆధాత్మక, భౌతిక విషయాల మధ్య అగాధాలను, ఉద్రిక్తలను‌, ఒత్తిడిని తగ్గించడానికి విద్య సాధనంగా పనిచేయాలని ఈ వెలుగులో ప్రపంచ దేశాలు తగిన కార్యాచరణ చేపట్టాలని యునెస్కో పిలుపునిచ్చింది. గత 8 సంవత్సరాలుగా నరేంద్రమోడీ విద్యావిధానాలు యునెస్కో స్పూర్తికి భిన్నంగా విద్యా ప్రతీఘాతుక విప్లవాన్ని అమలు చేస్తున్నాయి. మేధావులుగా సమాజంపై ప్రభావం కలిగించే ఉపాధ్యాయ లోకం పౌరసమాజంతో కలిసి యుద్ధప్రాతిపదికగా విపత్తులో ఉన్న విద్యా భారతాన్ని జ్ఞాన స్వర్ణ మేధినిగా మార్చే చారిత్రక కర్తవ్యాన్ని చేపట్టాలి.

వ్యాసకర్త :
అస్నాల శ్రీనివాస్,
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ , సామాజిక కార్యశీలి పురస్కార గ్రహీత,
ఉపాధ్యక్షుడు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్