BIKKI NEWS (మే – 01) : MAY DAY – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (world labour day) ను మే – 01 న మే డే పేరుతో నిర్వహిస్తారు. మే డే కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను సూచిస్తుంది.
May day – World Labour day
చికాగోలో వున్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు.
మొదటగా ఈ ఉద్యమం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని కార్మికులు ఉదృతం చేసి పరిశ్రమలను స్తంభింపచేసి కార్మిక ప్రభంజనాన్ని అదుపు చేయలేక 1837 లో రోజుకు 10 గంటల పనిదినాన్ని అమెరికా ప్రభుత్వం శాసనబద్దం చేసింది.
యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే, కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా, అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.
ముఖ్యంగా, ఐ.టి.రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో వున్న కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలు కానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది.
పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటితరంగంలో అయితే సరేసరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్ – సోర్సింగ్‌లోను కార్మిక చట్టాల నియమాలు అమలుకు నోచుకోవడం లేదు.
ప్రపంచీకరణ వలన వంద సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడంలేదు.1886లో ఆరంభమైన ఈ ఉద్యమం వందేళ్ళ పండగ జరుపుకుంది. ప్రపంచంలో ఎనిమిది గంటల పనికోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాయి. ఆనాటి కార్మికవర్గ చైతన్యం మరోసారి వెల్లివిరుస్తుందని, ఈ మే డే నాడు కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిద్దాం.
ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు, మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే.
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు