లెక్చరర్ ల బదిలీలపై విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి.!

  • కృతజ్ఞతలు తెలియజేసిన అధ్యాపక సంఘాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల బదిలీల విషయమై తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ ఆధ్యాపకుల అసోసియేషన్ మరియు తెలంగాణ పాలిటెక్నిక్ అధ్యాపకుల అసోసియేషన్ సోమవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రిని కలిసి కూలంకషంగా చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా బదిలీలు లేక గత ఐదు సంవత్సరాల నుండి అధ్యాపకులు పడుతున్న ఇబ్బందుల్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా బదిలీలకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని లేనట్లయితే ఎన్నికల కోడ్ వచ్చినట్లయితే అధ్యాపకులకి బదిలీలు లేకపోవడం చేత చాలా నిరాశ నిస్పృహలకు లోన్ అవుతారని విద్యావ్యవస్థ అసంతృప్తితో పనిచేస్తుందని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరణతో ఫోన్లో మాట్లాడి బదిలీల కొరకై షెడ్యూలు నమూనా తయారు చేసి పంపించాల్సిందిగా ఆదేశించడం జరిగిందని సమాచారం.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే సురేందర్ రెడ్డి పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రవర్తి విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.