హైదరాబాద్ (సెప్టెంబర్- 07) : పద్మ విభూషణ్ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే “కాళోజీ నారాయణ రావు అవార్డు” 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు శ్రీ జయరాజ్ కు (kaloji narayanarao award 2023 tosri jayaraj) దక్కింది.
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కవి శ్రీ జయరాజ్ ను ఎంపిక చేశారు.
ఈ నెల 9వ తేదీన శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి శ్రీ జయరాజ్ కు ‘కాళోజీ’ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు ద్వారా ₹1,01,116 నగదు రివార్డును, జ్జాపికను అందించి దుశ్శాలువాతో సత్కరించనున్నారు.
ఉమ్మడి వరంగల్, నేటి మహబూబాబాద్ జిల్లాకు చెందిన శ్రీ జయరాజ్ (60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుద్ధుని బోధనలకు ప్రభావితమై డా. బి.ఆర్. అంబేద్కర్ రచనలతో స్ఫుర్తి పొందారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ.. తన ఆట, పాట, గానం ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవిగా జయరాజు కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ వున్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.
◆ KALOJI AWARD WINNERS LIST
2023 – శ్రీ జయరాజ్. 2022 – రామోజు హరగోపాల్
2021- పెన్నా శివరామకృష్ణ
2020 – రమా చంద్రమౌళి
2019 – కోట్ల వెంకటేశ్వర రెడ్డి
2018 – అంపశయ్య నవీన్
2017 – రావులపాటి సీతారాం
2016 – గొరెటి వెంకన్న
2015 – అమ్మంగి వేణుగోపాల్