SAVITHRIBAI PHULE : భారత విప్లవ వేగుచుక్క ఆస్నాల శ్రీనివాస్

  • జనవరి 3 సావిత్రి జయంతి సంధర్భంగా
  • వ్యాసకర్త :: ప్రిన్సిపాల్ (సమ్మక్క సారక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల – తాడ్వాయి – ములుగు, కార్యదర్శి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం)

BIKKI NEWS : ‘ఈ పిల్లలే ఈ దేశానికి అస్తి, ఈ దేశ ఆస్తులే నా అస్తి’ అని నూట యాభై సంవత్సరాల క్రితమే ప్రకటించి భారత ప్రజాతంత్ర విద్య విప్లవ ఆరంభకులుగా, చరిత్ర నిర్మాతగా, దార్శనికురాలిగా సావిత్రిభాయి పూలే నిలిచిపోయారు. డిసెంబర్ 10, 1948 ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన ‘బాల బాలికలే నిజమైన జాతి సంపద, వారికి వివక్ష లేకుండా అందరికి ఉచిత గుణాత్మక విద్య అందించాలని చెప్పింది. 1949 చైనా విప్లవంలో మావో ‘సంపూర్ణ శక్తి సామర్ధ్యాలతో ఉదయ భాస్కరుని వలే వికసించే బాల బాలికల పైన ఆయా దేశాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ప్రకటించాడు.

‘ఈ పిల్లలే ఈ దేశానికి అస్తి, ఈ దేశ ఆస్తులే నా అస్తి’ అని నూట యాభై సంవత్సరాల క్రితమే ప్రకటించి భారత ప్రజాతంత్ర విద్య విప్లవ ఆరంభకులుగా, చరిత్ర నిర్మాతగా, దార్శనికురాలిగా సావిత్రిభాయి పూలే నిలిచిపోయారు. – అస్నాల శ్రీనివాస్

ఈ తాత్విక భావనను వారి కంటే వంద సంవత్సరాల క్రితమే ప్రకటించి కార్యాచరణతో భారత రాజకీయ సాంఘిక విప్లవానికి బలమైన పునాదులను తన జీవన సహచరుడు జోతిబా పూలె కలిసి ఏర్పాటు చేశారు. “సామాజిక మార్పు పోరాటాల ద్వారా పోరాటాలు విజ్ఞానం ద్వారా విజ్ఞానం విద్య ద్వారా కలుగుతాయని అనే సార్వజనీన సామాజిక సిద్దాంతం రూపొందించారు. విద్య లేక వివేకం తగ్గింది, వివేకం లేక నీతి తగ్గింది, నీతి లేక పురోగతి తగ్గింది, పురోగతి లేక సంపద తగ్గింది, సంపద లేక స్త్రీలు అణగారిన వర్గాలు వెనుకబడిపోయాయి అని తమ శ్రేయో మార్గపు జన జీవితంలో తెలుసుకున్నారు. విద్య యొక్క లక్ష్యాలను సంపూర్ణంగా తమ అద్యయనంతొ సూత్రీకరించారు .”

జ్యోతి బా సహకారంతో చదువు నేర్చుకున్న సావిత్రి 1848లో బుధవారపేటలో తొలి బాలికా విద్యాలయాన్ని స్థాపించారు. సనాతనవాదులు సృష్టించిన అనేక అవరోధాలు, ఆంక్షలు, అవహేళనలు దాడులను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని యాభై కి పైగా బడులను నెలకొల్పారు. – అస్నాల శ్రీనివాస్

“న స్త్రీ స్వాతంత్రమర్హతి, స్త్రీ శూద్ర నాదియేతం” అనగా స్త్రీలు స్వతంత్రంగా ఉండరాదని, స్త్రీలు శూద్రులు చదవరాదని, పరిచారకత్వం శూద్రజ స్వభావం అనే ధోరణులు స్మృతుల పురాణాల తాత్విక సమర్దనతో భారతావనిపై వేలాది సంవత్సరాలు కొనసాగాయి. మానవ ప్రగతి కి అవరోధంగా ఉన్న సనాతన సాంప్రదాయాల ఉక్కు కౌగిలి నుండి భారత సామాజిక విప్లవాన్ని ‘గొప్ప ముందడుగు వేయించిడానికి కాలం కడుపుతో ఉండి కన్నా అపురూప దంపతులు సావిత్రి పూలే దంపతులు . ఆధునిక చరిత్రలో ప్రజలను చీలికలు పేలికలుగా విభజించి దారుణ వివక్షతను పాటించిన పీష్వాలు పాలించిన మరాఠా ప్రాంతంలో ప్రభవించిన సావిత్రి నిజమైన అనందం నైతికత మానవ విముక్తి ఉద్యమాలలో ఉన్నదని గ్రహించి తన శక్తినంతా ధారపోసి మహిళా సాధికారత ఉద్యమాన్ని నిర్వహించారు. జ్యోతి బా సహకారంతో చదువు నేర్చుకున్న సావిత్రి 1848లో బుధవారపేటలో తొలి బాలికా విద్యాలయాన్ని స్థాపించారు. సనాతనవాదులు సృష్టించిన అనేక అవరోధాలు, ఆంక్షలు, అవహేళనలు దాడులను మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని యాభై కి పైగా బడులను నెలకొల్పారు. తానూ స్వయంగా తోలి మహిళా టీచర్ గా పని చేస్తూ పిల్లలందరికీ మాతృత్వపు ప్రేమను అందిస్తూ ఆటలతో పాటలతో చదువును భోదిస్తూ పాఠశాలలను సంతోష చంద్రశాలలుగా మార్చివేసింది. ఇదే క్రమంలో ప్రభుత్వ విద్య ప్రజల హక్కు నినాదంతో ఉద్యమాన్ని నిర్వహించింది. బ్రిటిష్ యువరాజు భారత పర్యటనకు వచ్చినప్పుడు ‘TELL THE GRAND MAA, WE ARE HAPPY NATION, BUT 19 CRORES PEOPLE WITHOUT EDUCATION’ అని రాసిన ప్లకార్డు లను ప్రదర్శించింది. వీరి కృషితో బ్రిటిష్ పాలకులు కొంతమేరకైనా ప్రభుత్వ రంగంలో అనేక బడులను నెలకొల్పారు. అన్ని వర్గాల పిల్లలకు విద్య అందించే కృషితో పాటు ఒక వర్గానికి పరిమితమైన ఉపాధ్యా వృత్తిని ఇతర వర్గాల వారు చేరడానికి ప్రభుత్వాన్ని ఒప్పించారు. బాల్య వివాహాల నిరోధం కోసం, వైధవ్యం పొందిన మహిళల కోసం, ప్రశ్నించే శక్తి లేకుండా జిజ్ఞాసా అన్వేషణ సామర్ధ్యాలను నష్టం కలుగ చేసే మూఢనమ్మకాల నిర్మూలన కోసం సావిత్రి పూలే జీవితాంతం కృషి చేసి భారత మహిళా సాధికారత పోరాటాలకు దిక్సూచి అయ్యారు.

బ్రిటిష్ యువరాజు భారత పర్యటనకు వచ్చినప్పుడు ‘TELL THE GRAND MAA, WE ARE HAPPY NATION, BUT 19 CRORES PEOPLE WITHOUT EDUCATION’ అని రాసిన ప్లకార్డు లను ప్రదర్శించింది. – అస్నాల శ్రీనివాస్

సమకాలిన ప్రపంచంలో మానవాభివృద్హి సూచికలో అగ్రగామిగా ఉన్న అనేక దేశాలలో కంటే ముందుగా మన దేశంలో వివక్షత నశించాలని, అభివృద్ధి ఫలాలు అందరికి అందాలని సంఘ సంస్కరోణోద్యమాలు ప్రారంభమయ్యాయి. విషాదం ఏమిటంటే అనేక సామాజిక అభివృద్ధి సూచికలలో మనం అట్టడుగు స్థానాలలో ఉన్నాము. రాజకీయ విప్లవం సాధించినా సామాజిక ఆర్ధిక విప్లవాలు నత్తనడకను కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకించి ‘స్త్రీల ప్రగతి సమాజ ప్రగతికి నిజమైన కొలమానం అనే సార్వత్రిక సత్యం వెలుగులో పరిశీలిస్తే స్త్రీల సామాజిక సూచికలు దయనీయంగా ఉన్నాయి. ఆక్స్ ఫామ్ అనే హక్కుల సంస్థ సర్వే ప్రకారం బడి ఈడు పిల్లల్లో 85 లక్షల బాలికలు బడిలో నమోదు కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లేమితో ఉన్న 37 మిలియన్ ల బాలల్లో 25 మిలియన్లు భారత్ లో ఉన్నారని ప్రపంచ పోషకాహార నివేదిక 2021 తెలియచేసింది. విద్య, వైద్యం, పరిపాలనలొ స్త్రీల భాగస్వామ్యం ఆధారంగా రూపోందించే లింగ వ్యత్యాస సూచికలో నూట ఏడవ స్థానం పొందింది. స్త్రీల రక్షణకు సంబందించి అప్గనిస్తాన్, కాంగో, పాకిస్తాన్ ల తర్వాత నాలుగవ స్థానం పొందినది. స్త్రీలు ఆర్ధిక కార్ర్యకలాపాల్లో పాల్గొనక పోవడం వల్లనే భారత స్థూల జాతీయోత్పత్తి మందగమనములో కొనసాగుతుందని మెకిన్సీ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. స్త్రీలు ఉత్పాదక రంగాలలో పాల్గొంటే జి డి పి 2025 వరకు 60% పెరుగుతుందని తెలియచేసింది. భారత జి డి పి లో స్త్రీల వాటా కేవలం 7%ఉంది. కానీ ప్రపంచ సగటు 37%ఉంది. భారత శ్రామిక శక్తి లో 42% ఉన్న స్త్రీల వాటా ప్రస్తుతం 24%కి పడిపోయింది. పాఠశాల, కళాశాల విద్యలో స్త్రీలు గణనీయ స్థాయిలో నమోదు అవుతున్నా అదే స్థాయిలో ఉత్పాదక రంగాలలో వారి భాగస్వామ్యం ఉండడంలేదు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం నివేదిక ప్రకారం భారత గ్రామీణ ప్రాంతాలలొ 67%, నగర స్త్రీలలో 69% పట్టభద్ర స్త్రీలు ఉత్పత్తి ఉద్యోగిత రంగంలో ఉండడం లేదని ప్రస్తావించింది. స్త్రీలు ఇంకా గృహా కార్యాలకే పరిమితమవ్వాలనే పితృస్వామిక విలువలు ఇంకా ప్రబలంగా ఉండడం పనిచేసే చోట సౌకర్యాలు లేకపోవడం, రక్షణ లేకపొవడం, పనిలోకి తీసుకుంటే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాల్సిరావడం, పని గంటలు అనుకూలంగా లేకపోవడం వంటి అనేక కారాణాల వల్ల మహిళా శ్రామిక శక్తి తగ్గుతున్నది. అత్యంత దుర్భర దారిద్ర్యం ఉన్నప్పుడు మాత్రమే మహిళలను పనిచేయడానికి అనుమతిస్తున్నారని అధ్యయనం తెలియచేస్తుంది. గత నాలుగేండ్ల మోడి పాలనలొ స్త్రీ శిశు సంక్షేమరంగానికి అతి తక్కువ నిధులను కేటాయిస్తున్నారు. “బేటి పడావో భేటి బచావో” నినాదం ఒక డొల్లగా నిరూపితమవుతున్నది. సావిత్రి పూలే నడిచిన దారిలో అనేక సంఘ సంస్కర్తల కృషితో స్త్రీలు సాధించుకున్న హక్కులను ఉల్లంఘించే, తొలగించే ప్రతిఘాతక మూక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. స్త్రీలను కట్టడి చేసే మధ్యయుగ ధోరణులను విధానాలను మోడి హయాంలొ పాలకులు బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ పోషకాహార నివేదిక 2021 విద్య, వైద్యం, పరిపాలనలొ స్త్రీల భాగస్వామ్యం ఆధారంగా రూపోందించే లింగ వ్యత్యాస సూచికలో భారత్ 107వ స్థానం పొందింది. స్త్రీల రక్షణకు సంబందించి అప్గనిస్తాన్, కాంగో, పాకిస్తాన్ ల తర్వాత నాలుగవ స్థానం పొందినది. – అస్నాల శ్రీనివాస్

ఈ నేపధ్యంలో సావిత్రి పూలే ప్రారంబించిన సాంఘీక విప్లవ ఫలితాలను అందుకున్న పౌరసమాజం వారి ఆశయాలను కొనసాగింపుకు, తిరిగి సమాజానికి చెల్లించే దృక్పథంతో తీవ్రంగా శ్రమించాల్సిన చారిత్రక సంధర్భం ఆసన్నమైంది. ఆకాశంలో సగం అనంతకోటి నక్షత్రాల్లొ సగం సమాజంలొ సగభాగమైన స్త్రీల అభ్యున్నతి కోసం పాలకులు ధృడ సంకల్పంతో వ్యవహరించడానికి ప్రజాఉద్యమాన్ని నిర్మించాలి. అడగందే, అందోళన చేయందే అధికారం దేనికి చోటివ్వదు. ఈ వెలుగులో ఏ రకమైనా ఆధిపత్యాలు లేని స్త్రీ పురుషులు సమానంగా ఉండే శాంతియుత సంతోష సహజీవన జ్ఞాన సమాజాన్ని నిర్మించడమే మనం సావిత్రి పూలేకు ఇచ్చే నిజమైన ఘన నివాళి.

అడగందే, అందోళన చేయందే అధికారం దేనికి చోటివ్వదు. ఈ వెలుగులో ఏ రకమైనా ఆధిపత్యాలు లేని స్త్రీ పురుషులు సమానంగా ఉండే శాంతియుత సంతోష సహజీవన జ్ఞాన సమాజాన్ని నిర్మించడమే మనం సావిత్రి పూలేకు ఇచ్చే నిజమైన ఘన నివాళి. – అస్నాల శ్రీనివాస్

వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్