- ఈ రోజు ఫిబ్రవరి 13 సరోజిని దేవి నాయుడు జన్మదినం.
- జాతీయ మహిళా దినోత్సవము గా దేశం నిర్వహించుకుంటున్నది.
BIKKI NEWS : విద్యార్థి దశ నుండి నన్ను బాగా ప్రభావితం చేసిన చారిత్రక మహిళ.. తన జయంతి గుర్తు రాగానే తన కుటుంబం చేసిన సేవలను జ్ఞాపకం చేసుకోవడం ఒక విధిగా బాధ్యతగా అనిపించి ఈ కొన్ని మాటలు…
సరోజినిదేవి నాయుడు జాతికి పూచిన గులాబీ రెమ్మ. 1925 కాన్పూర్ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం, ఉద్యమ తీవ్రతను పెంచడం, సమరయోధురాలిగా, కవయిత్రిగా, గవర్నర్ గా మొదలగు చరిత్ర మనకు తెలుసు.. సరోజిని దేవి కొడుకు జయసూర్య, కూతురు పద్మజషా లు నా స్వగ్రామం వీరభూమి కడవెండి ని జనగామ తాలుకా లోని అనేక గ్రామాలు సందర్శించారు.. ఈ నేపధ్యం తర్వాత చెప్తాను..
సరోజిని తండ్రి అఘోరనాధ చతోపాధ్యాయ నిజాం రాజు ఆహ్వానం మేరకు నిజాం కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు.
ఈ క్రమంలో సరోజిని హైదరాబాద్ కి చెందిన గోపాలనాయుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి సోదరులు వీరేంద్రనాథ్, హరీంద్రనాధ్ లో తమ యవ్వనపు రోజులను తెలంగాణలో గడిపారు.. వీరి తల్లి వరదాదేవి హైదరాబాద్ లో తొలి బాలికల బడిని నాంపల్లిలో స్థాపించారు.
సరోజిని దేవి జాతీయోద్యమంలో గాంధీ, నెహ్రు ల మితవాద పోరాటాలలో నిమగ్నం అయ్యారు. సోదరుడు వీరేంద్రనాధ్ లజపతి రాయ్ అతివాద పంథా ను ఎంచుకుని రహస్య జీవితాన్ని గడుపుతూ అమెరికా కేంద్రంగా సాయుధ పోరాటానికి రూపకల్పనలో ఉండేవారు. అమెరికన్ మెక్సికన్ మహిళ ఆగ్నేస్ స్మెడ్లి ని జీవన సహచరిగా ఎంచుకుని భారత విప్లవకారులకు సహాయం చేసాడు. అమెరికాలో పలుమార్లు జైలు జీవితం అనుభవించాడు. (ఆగ్నేస్ స్మెడ్లి భూమిపుత్రిక పుస్తకంలో అనేక వివరాలు ఉన్నాయి)
మరొక తమ్ముడు హరీంద్రనాధ్ కవిగా, రచయితగా అనేక పుస్తకాలను రాస్తూ తన కాలంలో జరిగిన అన్ని పోరాటాలను అక్షరీకరించాడు. టెల్స్ ఆఫ్ తెలంగాణ అనే దీర్ఘ కవితను రాసాడు. దీనిని ఆరుద్ర తెలుగులో అనువాదం చేసాడు..
“హే సాధారణ గ్రామమూర్తి ఇతిహాసం సంపుటంలో
జ్వలించుము, ప్రసారింపుము”… అనే కవిత దొడ్డి కొమురయ్య ఆమరత్వం పై రాసాడు.
1985 నుండి 1994 కాలములో పదవ తరగతి ఆంగ్లంలో
సరోజిని Bangle sellers అనే కవిత ఉండేది. ఇది హైదరాబాడ్ చుడిబజార్ కి, నగర సంస్కృతికి అద్దం పట్టే కవిత… ఇది ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే పోయెమ్..
ఇక అత్యంత కీలకమైన మహత్తరమైన సరోజిని సేవ ఏమిటంటే తన తనయ, తనయుడ్ని ..డా జయసూర్య, పద్మజ లను హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు జరుపుతున్న దోపిడీ పీడన పోరాటాలకు అండగా ఉండడం కోసం, హక్కుల పరిరక్షణ కోసం కేటాయించింది..
వీరిద్దరూ ప్రజా వైద్యులుగా పని చేస్తూ, అమ్మ , మేనమామ ల కంటే మరింత చైతన్యంతో ఇక్కడి రైతాంగ పోరాటాలకు అండగా నిలిచారు. పౌరహక్కుల ఉద్యమానికి చుక్కాణిగా నిలిచారు. సాయుధ పోరాటకాలంలో ఆకునూరు, మాచిరెడ్డి పల్లెల పై పోలీసుల దమనకాండ పై నిజ నిర్ధారణ జరిపి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించారు. పోరాటకారులకు న్యాయ సహాయాన్ని అందిస్తూ అనేక మందిని విడుదలకు దోహదం చేశారు. యూనియన్ సైన్యాలను ముప్పు తిప్పలు పెట్టిన దొరల గడీలను చావు దెబ్బ తీసిన కడవెండి అగ్నిశిఖ నల్లా నర్సింలు కు పడిన ఉరి శిక్ష రద్దు కావడం కోసం, విడుదల కోసం కృషి చేసారు. ఇంగ్లండ్ నుండి ప్రిట్ ను, బొంబాయి నుండి డేనియల్ లతీఫ్ ను నల్లా నరసిములు మరియు ఇతర కార్యకర్తల కోసం పిలిపించి వాదింప చేసి విజయం సాధించారు..
పోలీస్ చర్యలో రజాకార్లను అణచివేత పేరుతో నలభై వేల అమాయక ముస్లిమ్లను, వేలాది రైతాంగ గెరిల్లాలను ఊచకోత కోసారని అనేక సాక్ష్యాలతో నివేదికలను వెలువరించారు.
1952 హైదరాబాద్ సార్బత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడంతో. వీరి తరపున జయసూర్య పీపుల్స్ డెమోక్రటిక్ ప్రంట్ ను ఏర్పాటు చేసి 98 సీట్లలో 48 సీట్లు గెలుచుకునారు.. కుట్రలు లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి కమ్యూనిస్టు రాష్ట్రంగా హైదరాబాద్ ఉండేది..
అబిడ్స్ లోని సరోజిని నివాసం golden threshold ని సాహిత్య సంస్కృతుల సంగమ వేదికగా నిలిచింది. కేంద్రీయ విశ్వ విద్యాలయం తొలి రోజులలో ఇక్కడే ఏర్పాటు ఐయింది. ఇప్పటికి ఇక్కడ పీ.జీ. సెంటర్ నడుస్తున్నది.
తెలంగాణ జీవన వికాసం కొరకు సంస్కృతికి సరోజినిదేవి కుటుంబం చేసిన సేవలను తలచుకుందాం. గుండెల నిండా వారి పట్ల ప్రేమను ప్రకటిద్దాము.
బెంగాల్ లో పుట్టిన అమ్మా సరోజినిదేవి తెలంగాణ మాగాణం గులాబీ రెమ్మగా, యావత్ స్త్రీ జాతి శిరోమణి వెలుగొందింది.. అమ్మకు జయంతి శుభాకాంక్షలు. వారి బిడ్డలు జయసూర్య, పద్మజలకు మనసారా శిరస్సు వంచి పాదాభివందనాలు, జోహార్లు…
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం