తెలుగు వికాసోద్యమం : అస్నాల శ్రీనివాస్ (తెలంగాణ భాషా దినోత్సవం సంధర్భంగా)

  • వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్ , తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
  • Telangana Language day september 9th

BIKKI NEWS (SEP – 09) : 2005లో కాంగ్రెస్‌ నేతృత్వములోని ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, కొన్ని భాషలకు ప్రాచీన హోదానిచ్చి వాటి అభివృద్ధి, వికాసాలకు తోడ్పడాలని భావించింది. ఈ ప్రాచీన హోదా పొందడానికి నియమావళిని నిర్దేశించింది. ఆ భాషకు వెయ్యి సంవత్సరాలకు పైగా లిఖితపూర్వ సాహిత్యం ఉండాలి. ఆ భాషకు పదిహేను వందల సంవత్సరాల పైగా భాషా చరిత్ర ఉండాలి. ఆ భాష పట్ల మాట్లాడే ప్రజలు తీవ్ర మమకారాన్ని, ఉద్వేగ వారసత్వ సంపదగా భావించాలి. ఆ భాషలో అన్య భాషా పదాలు ఎక్కువగా ఉండకూడదు. ప్రాచీన భాష వాడుక రూపానికి, ప్రసుత్త వాడుక రూపానికి ఎక్కువ సారూప్యం ఉండాలి.

ప్రతి భాష ఒక దేవాలయం, దానిని మాట్లాడే ప్రజల ఆత్మ అందులోఉంటుంది. – అలీవర్‌ వెండర్‌ హోమ్స్‌అస్నాల శ్రీనివాస్

ఈ నియమాల వెలుగులో ఇండోఆర్యన్‌ కుటుంబానికి చెందిన దేశంలో 0.03% ప్రజలు మాట్లాడుతున్న వేద పాఠశాలల్లో బోధనా భాషగా ఉన్న సంస్కృతమును ద్రావిడ సంస్కతికి మూల భాష తమిళమును ప్రాచీన భాషలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రాచీన హోదా నియమావళి పరిధిలోకి తమ భాషలు కూడా వస్తాయని, తెలుగు, కన్నడ, మళయాళం, ఒడియా భాషాభిమానులు తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఫలితంగా 2008లో తెలుగు, కన్నడలను 2013లో మళయాళంను, 2014లో ఒడియాను ప్రాచీన భాషలుగా గుర్తించింది.

2008లో తెలుగు, కన్నడలను 2013లో మళయాళంను, 2014లో ఒడియాను ప్రాచీన భాషలుగా గుర్తించింది. – అస్నాల శ్రీనివాస్

తమిళనాడుకు చెందిన గాంధీ అనే న్యాయవాది మద్రాస్‌ హైకోర్టులో సంస్కృతం, తమిళం తప్ప మిగతా భాషలకు ప్రాచీన హోదాకు అర్హత లేదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి మన తెలుగు భాషకు ప్రాచీన హోదాను ఆపుదల చేయించాడు. స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్‌ ప్రభుత్వము ప్రామాణిక సాక్ష్యాలతో, వాదనలతో న్యాయస్థానంలో తెలుగు ప్రాచీనతను వివరించింది. ఫలితంగా 2016లో న్యాయస్థానం తెలుగును ప్రాచీన హోదాకు అర్హత ఉన్న భాషగా ప్రకటించింది. ఈ సంఘటనలతో తెలుగును భాషాభిమానుల్లో తీవ్రమైన అంతర్మథనం ప్రారంభమైంది అనేక అంతర్జాతీయ అధ్యయనాలు తెలుగు మాట్లాడే ప్రజలు తమ మాతృభాషను ఉద్వేగ వారసత్వ సంపదగా భావించడం లేదని, ఫలితంగా తెలుగు భాష అంతరించే భాషల జాబితాలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించాయి.

అంతర్జాతీయ అధ్యయనాలు తెలుగు మాట్లాడే ప్రజలు తమ మాతృభాషను ఉద్వేగ వారసత్వ సంపదగా భావించడం లేదని, ఫలితంగా తెలుగు భాష అంతరించే భాషల జాబితాలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించాయి. – అస్నాల శ్రీనివాస్

ప్రతి ప్రాంతానికి, జాతికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. ఇది తమ ప్రాకృతిక సామాజిక సంబంధాలు, జీవన విధానాల నుండి ఏర్పడుతుంది. అది వాళ్ళ మాతృభాషగా మారి అస్తిత్వ సాంస్కృతిక చిహ్నంగా మారుతుంది. భాష ఒక జాతి ఉనికిని కాపాడే ఊపిరి వంటిది. వారి నాగరికత వికాసానికి దోహదము చేసే దారి దీపంలాంటిది. జాతికి జవము, జీవం భాష. భాష ద్వారా జాతి సాంస్కృతిక స్థాయిని నిర్ధారిస్తారు. కనుకనే తమ ఆస్తిత్వ ఆత్మ గౌరవ ప్రతీకలైన భాషా సంస్కృతుల పరిరక్షణ వికాసాల కోసం ప్రజలు తమ ఆరాటాలతో, పోరాటాలతో పాటుపడ్డారు.

ఐతరేయ బ్రాహ్మణంలో ‘ఆంధ్ర’, రామాయణంలో ‘లేపాక్షి’ పదాల ప్రస్తావన తెలుగు భాష అతి ప్రాచీనమైనదని తెలియజేస్తున్నాయి. – అస్నాల శ్రీనివాస్

ఐతరేయ బ్రాహ్మణంలో ‘ఆంధ్ర’, రామాయణంలో ‘లేపాక్షి’ పదాల ప్రస్తావన తెలుగు భాష అతి ప్రాచీనమైనదని తెలియజేస్తున్నాయి. క్రీస్తుపూర్వము 200 సంవత్సరాలలో మౌర్యుల శాతావాహనుల కాలంలో తెలంగాణలోని కోటిలింగాల, ధూలికట్ట స్థూపాలలో తెలుగు పదాల వాడకము ఉన్నది. అశోకుడు వేయించిన 13వ, 14వ స్థంభ, ధర్మలిపి శాసనాలలో ఆంధ్ర, గజతము అనే తెలుగు పదాలున్నవి. తెలుగు నేలను సుదీర్ఘంగా పాలించిన ఇక్ష్వాకుల కాలంలో నన్నయ్య సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఇది తెలుగు జనసామాన్య భాష అనడానికి నిదర్శనము. ఈ కాలంలోనే నన్నయ్య, తిక్కన్న, ఎర్రనలు మార్గ సంప్రదాయంతో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. క్రీ|శ| 13 వ శతాబ్దము నుండి 17వ శతాబ్దం వరకు తెలుగు ప్రాంతాలను పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయలు, కాకతీయ, రాచకొండ రాజుల కాలంలో తెలుగు, పాలకుల పాలితుల భాషగా ఆదరణ పొంది సాహిత్య సాంస్కృతిక రంగాలలో స్వర్ణయుగాన్ని అనుభవించింది. ఈ కాలంలోనే ధిక్కార సంప్రదాయ వేగుచుక్క మన పాల్కురికి సోమనాథుడు సంస్కృతాన్ని, గద్య పద్యోక్తులను వదిలి జాను తెనుగులో దేశీ చంధస్సులో బసవ పురాణము, పండితారాధ్య చరిత్రను రాసి పామర జనానికి వినిపించాడు. ఇది తెలుగు భాషా వికాసోద్యమంలో ఒక గొప్ప గెంతు. సోమన తర్వాత 300 సంవత్సరాలకు బమ్మెర పోతన వీరభద్ర విజయం, ఆంధ్రమహాభాగవతాన్ని తెలుగులో రాశాడు. రైతుకు, బుద్ధి జీవికుండే ఆత్మగౌరవాన్ని, స్వీయ విశ్వాసాన్ని ప్రకటించాడు.

బమ్మెర పోతన వీరభద్ర విజయం, ఆంధ్రమహాభాగవతాన్ని తెలుగులో రాశాడు. రైతుకు, బుద్ధి జీవికుండే ఆత్మగౌరవాన్ని, స్వీయ విశ్వాసాన్ని ప్రకటించాడు. – అస్నాల శ్రీనివాస్

గోల్కొండ రాజధానిగా తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహిల కాలంలో పారశీక భాష రాజభాష అయ్యింది. ఈ రాజులు కళలలను, సాహిత్యాన్ని, అమితంగా ప్రేమించి ప్రోత్సాహించారు కాని అవి ఎక్కువగా పారశీకంలోనే కొనసాగాయి. ఆ కాలం నుండి తెలుగు నిరాదరణకు గురవుతూ వచ్చింది. వీరి తర్వాత పాలించిన అసఫ్‌జాహిల కాలంలో ఉర్దూ అధికార భాషగా కొనసాగింది. నిజాం రాజు ‘గస్తీ నిషాన్‌ 53’ ఫర్మానా జారీ చేసి పాలనలో, న్యాయస్థానాలలో, విద్యా సంస్థలలో తెలుగును రద్దు చేసి, ఉర్దూ భాషను అమలుపరిచాడు. తెలుగు భాష తీవ్రమైన అణిచివేతకు గురైంది. ఈ కారణంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భాష వారధిగా వుండాల్సింది పోయి పెద్ద అగాధం ఏర్పడింది. ప్రజల మనోభావాలను ప్రభుత్వానికి తెలిపే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం చేపట్టే ప్రణాళికలు,చేసే చట్టాలు, పరిపాలన వ్యవహారాలు ప్రజలకు అర్థం కాకపోయ్యేది. ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయింది.

‘మాతృభాషను ప్రేమించే వారే మాతృభూమిని ప్రేమిస్తారు’. దీనికి నిలువెత్తు నిదర్శనం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వరాష్ట్రం సిద్ధించాక దాని ఫలితాలను కాపాడుకోవడానికి మహాత్తరమైన సాంస్కృతిక విప్లవాన్ని ప్రారంభించారు. – అస్నాల శ్రీనివాస్

ఈ దుస్థితిని అధిగమించి తెలుగు భాషా సంస్కృతులను ఉద్ధరించా లనే తపనతో తెలంగాణ తొలితరం విద్యావంతులు గ్రంథాలయాలు, ప్రచురణ సంస్థలు, పత్రికలు, పాఠశాలలను,సాహిత్య సంస్థలను ప్రారంభించారు. భాషాభివృద్ధిలో,జ్ఞాన ప్రసారాలలో గ్రంథాలయాల పాత్రను గుర్తించిన, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులు, మునగాల రాజ నాయని వెంకట రంగారావు సహాయంతో 1901లో తెలంగాణ సాంస్కృతిక వికాస ఆరంభకేంద్రంగా భావించే శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయంను హైదరాబాద్‌లో స్థాపించారు. ఇదే త్రయం 1904 లో హన్మకొండలో శ్రీ రాజ రాజ నరేంద్ర ఆంధ్రభాషానిలయంను స్థాపించారు. మరికొందరు భాషాభిమానులు 1913 లో వరంగల్‌లో శబ్ధానుశాసన ఆంధ్రభాషా నిలయమును, మడికొండలో ప్రతాపరుద్ర భాషా నిలయమును స్థాపించారు ఇవన్నీ తెలుగు భాషా సాహిత్యాలపై సభలను, కవి సమ్మేళనా లను నిర్వహిస్తూ భాషాభివృద్ధికి పాటు పడ్డాయి. అలాగే హక్కులపై, బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్గించాయి. గ్రంథాలయాలు విప్లవ కేంద్రాలుగా మారుతున్నాయని నిజాం వాటి నిర్వహణపై కఠినమైన ఆంక్షలను విధించాడు. ఇదే కాలంలో కొమర్రాజు, ‘విజ్ఞాన చంద్రికా మండలి’ మాడపాటి ‘ఆంధ్ర చంద్రికా గ్రంథమాల’ నరసింహశాస్త్రి ‘విజ్ఞాన వర్షిణి ఆంధ్రావళి’ మంత్రి ప్రగడ ‘వైదిక ధర్మ గ్రంథమండలి’ కె.సి.గుప్తా ‘అణా గ్రంథమాల’, వట్టి కోట, ‘దేశోద్ధారక గ్రంథమాల’ వంటి ప్రచురణ సంస్థలు భాషా సాహిత్యాలపై, విజ్ఞానశాస్త్రంపై అనేకమైన గ్రంథాలను వెలువరించారు.

తెలుగు భాషాభివృద్ధిలో పత్రికలు నిర్వహించిన పాత్ర మరువలేనిది. 1887 లో హైదరాబాద్‌ నుండి వెలువడిన ‘శేద్యచంద్రిక” 1913 లో పాలమూరు నుండి వెలువడిన బి.శ్రీనివాస్‌ హితబోధిని, 1917 లో దివ్యజ్ఞాన సమాజం పక్షాన వెలువడిన స్వామి వెంకటరంగారావు ‘ఆంధ్రమాత’, 1922లో నల్గొండ నుండి వెలువడిన వెంకట నరసింహరామ ‘నీలగిరి’, వరంగల్‌ ఇనుగుర్తి నుండి వెలువడిన ఒద్దిరాజు సోదరుల ‘తెనుగు’, 1923 లో హన్మకొండ కేంద్రంగా సీతారామశర్మ ‘ఆంధ్రాభ్యుదయం,

1926 లో హైదరాబాద్‌ నుండి వెలువడిన సురవరం ప్రతాపరెడ్డి ”గోల్కొండ”, 1927లో నృసింహశర్మ గారి ‘సుజాత, దేవులపల్లి రామానుజరావు ‘శోభ’, అడవి బాపిరాజు మీజాన్‌ పత్రికలు తెలుగు భాషా సాహిత్యాల సేవతో పాటు ప్రజా ఉద్యమాలకు అండగా నలిచాయి. – అస్నాల శ్రీనివాస్

1926 లో హైదరాబాద్‌ నుండి వెలువడిన సురవరం ప్రతాపరెడ్డి ”గోల్కొండ”, 1927లో నృసింహశర్మ గారి ‘సుజాత, దేవులపల్లి రామానుజరావు ‘శోభ’, అడవి బాపిరాజు మీజాన్‌ పత్రికలు తెలుగు భాషా సాహిత్యాల సేవతో పాటు ప్రజా ఉద్యమాలకు అండగా నలిచాయి. అలాగే మాడపాటి హైదారాబాద్‌లో చందా కాంతయ్య వరంగల్‌లో తెలుగు మాధ్యమములో అనేక పాఠశాలలను ప్రారంభించారు.

1921 నవంబర్‌ 11న హైదరాబాద్‌లో వివేక వర్ధిని థియేటర్‌లో జరిగిన నిజామాంధ్ర సంఘ సంస్కరణ సభలో తెలుగులో మాట్లాడి నందుకు అలంపెల్లి వెంకట రామారావుకు సభికుల నుండి అవమానం ఎదురైంది ఈ సంఘటనతో మాడపాటి హన్మంతరావు, ఆదిరాజు వీరభద్రరావుల నాయకత్వంలో ఏర్పడిన ఆంధ్రజన సంఘం ఆంధ్ర మహాసభగా మారి 1942 వరకు భాషాసాహిత్యాలకు, తెలుగు పాఠశా లల ఏర్పాటుకు, సంఘసంస్కరణలకు చేసిన సేవలు చిరస్మరణీయం.

పాలకులు చాలా ఆలస్యంగా అనగా 1966 లో తెలుగును అధికార భాషగా గుర్తించారు. 1968 లో తెలుగు అకాడమి, 1971 లో అధికారభాషా సంఘాన్ని ఏర్పాటు చేశారు. అస్నాల శ్రీనివాస్

1956 లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తర్వాత పరిపాలన భాష ఉర్దూ నుండి ఆంగ్లంలోకి మారింది. ప్రభుత్వ విద్యా సంస్థలు తెలుగు మాధ్యమంలో స్థాపించబడినాయి. అప్పటి పాలకులు చాలా ఆలస్యంగా అనగా 1966 లో తెలుగును అధికార భాషగా గుర్తించారు. 1968 లో తెలుగు అకాడమి, 1971 లో అధికారభాషా సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీటిని సమర్థవంతంగా నిర్వహించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. విద్యా సంస్థలలో తెలుగు ఐచ్చిక భాషగా ఉండడం వలన, అనుసంధాన భాషగా ఉండాల్సిన ఆంగ్లం పూర్తిగా ఆధిపత్యం వహించడం వలన నూతన తరాలకు తెలుగు భాషా సాహితి వైభవంపై అవగాహన లేకుండా పోయింది. చరిత్రలో ఎప్పుడు ప్రజల భాషగా లేని సంస్కృతం మార్కుల కోసం ఐచ్చిక భాషగా ప్రాచుర్యం పొందింది. ఈ పరిణామాలతో తెలుగు వెలుగులు అంధకారంలోకి నెట్టివేయబడి భాషాభిమానులు కృంగి పోవాల్సిన స్థితి ఎదురయ్యింది.

‘మాతృభాషను ప్రేమించే వారే మాతృభూమిని ప్రేమిస్తారు’. దీనికి నిలువెత్తు నిదర్శనం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వరాష్ట్రం సిద్ధించాక దాని ఫలితాలను కాపాడుకోవడానికి మహాత్తరమైన సాంస్కృతిక విప్లవాన్ని ప్రారంభించారు. ఈ నేలపై తెలుగు భాషా చైతన్యం కోసం కృషి చేసిన వికాసోద్యమ త్యాగధనుల ఆశయాలను పరిపూర్ణం చేస్తూ తెలుగును నిర్బంధ పఠనీయ భాషగా అమలు చేయాలని నిర్ణయం చేసి తెలంగాణ నవనిర్మాణంలో విప్లవాత్మక ముందడుగు వేశారు, చరిత్రలో తొలిసారిగా తెలుగు రాజభాషగా,పాలన భాషగా, బోధనభాషగా గౌరవాన్ని పొందుతున్నది. ఇప్పటికే కెజీ నుండి పిజీ వరకు పోటీ పరీక్షల సిలబస్‌లో తెలంగాణ ప్రజా పోరాటాల చరిత్రను, సాంస్కృతిక వికాసాన్ని,కళలను సమగ్రంగా పొందుపర్చారు స్వరాష్ట్ర ఉద్యమకాలంలో ప్రజలందరిని హృదయపూర్వంగా ఐక్యం చేయడానికి, పోరాటంలో ప్రజల ధైర్యాన్ని, విజయంలో విశ్వాసాన్ని పెంచిన భాషా, సంస్కృతి, కళలను స్వేచ్ఛగా వికసించడానికి మరింత బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హృదయపు రక్తంతో, మెదుడుసారంతో ఆచరణలో నిమగ్నమయిన ప్రజాహిత మేధావులను భాషా, సాంస్కృతిక,సాహిత్య కళల, ప్రచురణల అకాడమిలకు సారధులుగా నియమించారు కేసీఆర్‌. అత్యంత త్వరితంగాను, అత్యంత విస్తృతంగాను స్వరాష్ట్ర ఉద్యమ ఫలితాలను ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నది. ఈ తరుణంలో బుద్ధి జీవులంతా ఉద్యమ ఆకాంక్షల అమలు కోసం ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండి సజీవ సంస్కృతితో కళకళలాడే నవ తెలంగాణ నిర్మాణంలో పాల్గొందాము.

వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్‌
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.