సుస్థిర,సమ్మిళిత ఆకుపచ్చ బడ్జెట్ – అస్నాల శ్రీనివాస్

  • తెలంగాణ బడ్జెట్ పై విశ్లేషణ – అస్నాల శ్రీనివాస్

BIKKI NEWS : సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణ కల సాకారమైంది. సకల జనులను ఐక్యంచేసి అంతిమ విజయాన్ని సాధించారు ఉద్యమ నాయకుడు కేసీఆర్. వలస పాలకులు తెలంగాణ నేలపై చేసిన జీవన, సాంసృతిక విధ్వంసం తాలుకు చేదు జ్ఞాపకాలను కేసీఆర్ తన తొలి విడుత పాలనలోనే తుడిచి వేశారు. తక్కువకాలంలో విస్తృతంగా పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలు జరిపారు. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా సంక్షేమ రాజ్య భావనను తెలంగాణ మాగాణంలో అనుభవంలోకి తెచ్చారు. రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్యమనాటి ప్రజల ఆకాంక్షలు, ఐరాస మానవాభివృద్ధి ప్రాతిపదికల, సూచీల తాత్తిక వెలుగులో ప్రజల ఆరోగ్యకర, సుస్థిర ప్రగతి ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ సామాజిక వ్యవస్థ నిర్మాణం, భౌగోళిక వాతావరణ పరిస్థితులపై సామాజిక, వైజ్ఞానిక శాస్త్రవేత్తల పరిజ్ఞానం కలిగిన కేసీఆర్ దానికి అనుగుణమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారు. మరొక సారి తెలంగాణ జన ఆకాంక్షల వెలుగులో2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ జనాభాలో వెనుకబడిన తరగతులు, షెడూల్డ్ కులాలు, షెడ్యూ ల్డ్ జాతులు 85 %ఉన్నారు. ఈ వర్గాల ఉన్నతి కోసం సామాజిక సమతుల్యత కోసం బి సి లకు 5,522 కోట్లు,యస్సీ లకు 21,306 కోట్లను,యస్టీలకు 12,304 కోట్లను బడ్జెట్‌లో హేతుబద్ధమైన కేటాయింపులు జరిపారు. ఐరాస ప్రకటించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన ధ్యేయంగా ప్రాధాన్య రంగాలను ఎంచుకొని బలమైన రాజకీయ సంకల్పంతో సుపరిపాలన కొనసాగిస్తున్నారు.

2030 వరకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని ఐరాస నిర్దేశించింది. వీటిలో దారిద్య్ర, ఆకలి రహితం చక్కటి ఆరోగ్య జీవనం, నాణ్యమైన విద్యను, నాలుగు అగ్రశ్రేణి లక్ష్యాలుగా పేర్కొన్నది. వీటిలో మొదటి రెండు లక్ష్యాల సాధనకు వ్యవసాయరంగాభివృద్ధి చోదకశక్తిగా కీలక సాధనంగా పనిచేస్తుంది. కృష్ణా, గోదావరిలు మన తలాపున పారుతున్న మన నీటిని మనకు దక్కకుండా వర్షాధార శుష్క ప్రాంతం తెలంగాణగా వలస పాలకులు మార్చారు.

దారిద్య్ర, ఆకలి రహిత తెలంగాణను రూపొందించడానికి 2015 నుండి ప్రతి బడ్జెట్‌లో వ్యవసాయం, సాగు నీటి రంగాలకు బడ్జెట్‌లో సింహభాగం కేటాయించారు. ఆహార భద్రతను, ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ముడిసరుకు అందించ డంతో పాటు పేదరికాన్ని తగ్గించడంలో వ్యవసాయరంగం ప్రబలంగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా గ్రామీణ పేదరికం తగ్గుముఖం పట్టడానికి తోడ్పడుతుంది. దిగువ, మధ్యమ ఆదాయం ఉన్న తెలంగాణలో వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన ఉద్యోగాల కల్పనకు దారితీస్తుంది.

ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన కొనుగోలు శక్తి తుల్యత సూచి రోజుకు ఆమెరికా డాలర్ల కంటే 1.90 కంటే ఎక్కువ ఆదాయాన్ని రైతులు, శ్రామికులు పొందడానికి ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతున్నది. భూమి పుత్రుడిగా, రైతుబిడ్డగా సంపద, సంక్షేమ అర్ధశాస్త్ర తాత్త్వికతను ఆవాహన చేసుకొని కేసీఆర్ వ్యవసాయ విధానాల రూపకల్పన చేశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు రూ.25,000 కోట్లను ప్రతిపాదించారు. సాగునీటికి 16,931 కోట్లను కేటాయించారు.

భూమి పుత్రుడిగా, రైతుబిడ్డగా సంపద, సంక్షేమ అర్ధశాస్త్ర తాత్త్వికతను ఆవాహన చేసుకొని కేసీఆర్ వ్యవసాయ విధానాల రూపకల్పన చేశారు.

– అస్నాల శ్రీనివాస్

మూడో ప్రపంచ దేశాలకు అభివృద్ధికి దిక్సూచిగా, తమ ప్రేరణగా నిలిచే రైతుబంధు పథకం కింద ఇచ్చే సహాయాన్ని రూ.14,800 కోట్లకు పెంచారు. దీనికి బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు కేటాయించారు. అన్నదాతల కుటుంబాలను, ఆపదలో ఆదుకోవడానికి రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి రూ.12,00 కోట్లు,రైతు రుణమాఫీకి రూ.5,225 వేల కోట్లు కేటాయించారు.

జీవవైవిధ్యంతో కూడిన పంటల సాంద్రతతో తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. నూతన హరితవిప్లవాన్ని, పాడి పరిశ్రమల వృద్ధి కోసం శ్వేత విప్లవాన్ని, మత్య్స పరిశ్రమల వృద్ధి కోసం నీలి విప్లవాన్ని, మాంసాహార, పౌల్ట్రీ వృద్ధి కోసం పింక్, సిల్వర్ విప్లవాలను ఆరంభించారు. గొర్ల పెంపకం కోసం 3000కోట్లను కేటాయించారు.తెలంగాణ మాగాణంలో ఇంద్రధనస్సు విప్లవాన్ని సృష్టిస్తున్న పాలకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతున్నారు. గత ఏడేండ్లలో ఈ రంగాల్లో అసాధారణ పెరుగుదల చోటుచేసుకోవడమే దీనికి నిదర్శనం.

సంక్షేమ రాజ్యభావనను 100 శాతం ఆచరిస్తున్న ప్రభుత్వ సారథిగా కేసీఆర్ నిలుస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయం,సాగునీరు, సంక్షేమరంగాలు 50శాతం నిధులను పొందాయి. కరోనా కల్లోల కాలంలో దారిద్య్ర, ఆకలి రహిత ,భారత ధాన్యాగారంగా తెలంగాణ నిలబడటానికి దోహదపడింది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడోవది అన్ని వయసుల్లో అందరికీ ఆరోగ్యకరమైన జీవనం.


ఇందులో భాగంగానే ఈ రంగానికి కూడా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో అధి ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణలోని 4,797 హెల్త్ సెంటర్లను, 876 ప్రైమరీ హెల్త్ సెంటర్లను, 107 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను,వందలాది బస్తీ ధవఖానాలను భారత ప్రజారోగ్య ప్రమాణాల సంస్థ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా వర్తమాన సదుపాయాలను కల్పించింది. కేసీఆర్ కిట్స్, ఆరోగ్యలక్ష్మీ వంటి కార్యక్రమాలతో మాత శిశు ఆరోగ్యానికి ప్రభుత్వ దవాఖానలు చిరునామాగా మారాయి. రోజురోజుకు ప్రజారోగ్య కేంద్రాల్లో నమోదు చేసుకుంటున్న గర్భిణీ స్త్రీల సంఖ్య అనుహ్యంగా పెరిగిపోతున్నది.

ఇప్పటికే 3 లక్షల కేసీఆర్ కిట్లను అందించింది ప్రభుత్వం.

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతిల సంఖ్య 49 శాతం పెరిగింది. ఆయు ప్రమాణం, జనన రేటు, ప్రసూతి మరణాల్లో జాతీయ సగటు కంటే మెరుగైన సూచీలను సాధించింది. ఈ బడ్జెట్‌లో వైద్యారోగ్య రంగానికి రూ.6295 కోట్లను, కరోనా కట్టడి 1178 కోట్లను ,అలాగే ఆరోగ్య రక్షణలో పరోక్షంగా తోడ్పడే తెలంగాణకు హరితహారం, మిషన్ భగీరథ, స్వచ్ఛ తెలంగాణ, ఆసరా పింఛన్ల కు సముచితమైన రీతిలో నిధులు కేటాయించింది.స్థానిక సంస్థలకు కేటాయించిన 29,271 కోట్లలో 10% గ్రీన్ ఫండ్ గా ఉపయోగించాలని కోరింది. ఇప్పటికే స్వరాష్ట్రంలో 3% పెరిగిన హరిత విస్తరణకు మరింత ఉతమయ్యేలా ఉపకరిస్తుంది.


ఉత్కృష్ట ప్రమాణాలతో గురుకులాలను నిర్వహించడానికి, వాటి సంఖ్య పెంచడానికి సమృద్ధిగా నిధులను కేటాయించింది. జనరల్ పాఠాశాలలు,కళాశాల మౌలిక సౌకర్యాలను, డిజిటల్ హంగుల కల్పనకు ప్రత్యేక నిధులను ఇచ్చింది.అన్ని జనరల్ ప్రభుత్వ విద్యా సంస్థలను గురుకులాలుగా మార్చి సామాన్య విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర కేటాయింపులు లేని కారణంగా ఉన్నత విద్య కు ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోవడం లేదు.రాబోయే కాలములోప్రభుత్వ ఉన్నత ,సాంకేతిక విద్య సంస్థలను స్వయం స్వాలంబన కోసం ప్రభుత్వం కృషి చేయాలి.

రష్యన్ తత్తవేత్త మిహాయిల్ ఫోలోకోవ్ ప్రస్తావించినట్లు, ఒక పాలకుడు తన ప్రాంతపు జీవితాన్ని జీవించాలి.
తన ప్రజల బాధలను అనుభవించాలి. వారి ఆనందాలతో సంతోషం పొందాలి. వారి అవసరాలను పంచుకోవాలి. దీనికి నిలువెత్తు ప్రతీకగా సీఎం కేసీఆర్ నిలబడుతున్నారు.
– అస్నాల శ్రీనివాస్

ప్రజల ఎజెండానే తన ఆత్మగా భావిస్తూ, తనను శిఖరాయమానంగా నిలబెట్టిన తెలంగాణకు సుపరిపాల అందిస్తూ, సమగ్ర సామాజికాభివృద్ధి ని సాధించే దిశగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు కేసీఆర్. తన జీవితానికి, పాలనకు సార్థకత ఉండాలని తపిస్తున్నారు. రష్యన్ తత్తవేత్త మిహాయిల్ ఫోలోకోవ్ ప్రస్తావించినట్లు, ఒక పాలకుడు తన ప్రాంతపు జీవితాన్ని జీవించాలి. తన ప్రజల బాధలను అనుభవించాలి. వారి ఆనందాలతో సంతోషం పొందాలి. వారి అవసరాలను పంచుకోవాలి. దీనికి నిలువెత్తు ప్రతీకగా సీఎం కేసీఆర్ నిలబడుతున్నారు. కేసీఆర్ ప్రజాకర్షక నాయకత్వంలో ప్రజాదరణ కలిగిన పార్టీతో శక్తిమేరకు ఉద్యమనాటి ఉత్తేజంతో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల బృందంతో తెలంగాణ ప్రాధాన్యాల ను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అనుసంధానం చేస్తున్నారు. విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకొని, నిర్దేశించిన గడువు కంటే ముందుగానే మానవాభివృద్ధి సూచికల్లో అగ్రశేణ్రిలో చేరే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నది.

వ్యాసకర్త ::

అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం