హైదరాబాద్ (ఆగస్టు – 15) : సూర్యుడి గురించి పరిశోధన కోసం ISRO – ADITYA – L1 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుండి సెప్టెంబరు మొదటివారంలో PSLV – C57- రాకెట్ ద్వారా ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేసింది. తాజాగా ADITYA L1 ఉపగ్రహన్ని శ్రీవారికోటలోని అంతరిక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. దీనిని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు యందు తయారు చేయడం జరిగింది.
భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని లాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుంచి గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని విశ్లేషించవచ్చు.
సూర్యుడిలోని పొరలైన ఫొటో స్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేయడానికి ఆదిత్యలో ఏడు సైన్స్ పరికరాలు ఉన్నాయి. ఎల్-1 కక్ష్యకు ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని పరిశీలిస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.