జనాభాను అరికడితేనే ఆర్థికాభివృద్ధి – జనాభా దినోత్సవ వ్యాసం – అడ్డగూడి ఉమాదేవి

BIKKI NEWS (world Population Day) : నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. ఈ జనాభాను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైయక్తిక ఆవరణ శాస్త్రం లేదా జనాభా జీవావరణ శాస్త్రం అంటారు.

ఒక దేశ భూభాగం కన్నా జనాభా ఎక్కువగా ఉంటే దానిని అధిక జనాభాగా పేర్కొంటారు. జనాభా సిద్ధాంతాలలో మాల్థస్ _ జనాభా సిద్ధాంతం చాలా ముఖ్యమైనది.1805 లో మాల్థస్ తన వ్యాసంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగత, అనారోగ్యం వంటి సమస్యలకు జనాభా పెరుగుదలే కారణమని జనసంఖ్య సిద్ధాంతాన్ని తీసుకువచ్చాడు, ఈ సిద్ధాంతం ద్వారా జనన,మరణాల రేటుకు ఆర్థికాభివృద్ధిలో గల మార్పులకు మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవచ్చు.

“ఇంతింతై వటుడింతై” అన్న చందముగా రోజు రోజుకూ ప్రపంచ జనాభా పెరిగిపోతున్నది.దీనివలన రాబోయే దుష్పరిణామాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడానికీ , ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతీ సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాము.. ఈ కార్యక్రమం 1989లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క పాలకమండలిచే స్థాపించబడింది. 1987 లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరగా ప్రజలలో లింగ సమానత్వం, పేదరికం వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (world Population Day) జరుపుతున్నారు.

1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్నరోజు జూలై 11 కాబట్టి ఆరోజును “ప్రపంచ జనాభా దినోత్సవం” గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అప్పటినుండి క్రమము తప్పకుండా ప్రతీ ఏడాది జూలై 11 వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.ఆరోజు నుండి 20 సంవత్సరాల తర్వాత 2007లో ప్రపంచ జనాభా 6,602,226,172 కు చేరినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.ఆ తర్వాత 2008 నాటికి ప్రపంచ జనాభా 6.7 బిలియన్లు ఉండగా మరో యాభై ఏళ్ళలో ప్రపంచ జనాభా 9 బిలియన్లను మించవచ్చునని సమితి అంచనా వేసింది .మరియు ప్రపంచ వ్యాప్తముగా మహిళల సంతానోత్పత్తి శాతం 2.5 నుండి 2.1కి పడిపోతుందని సమితి తెలియజేసింది.

ఇటీవల “యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ” విడుదల చేసిన “స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ “నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశముగా భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారతదేశం జనాభా 142.86 కోట్లు కాగా చైనా జనాభా 142.57 కోట్లు, ఇదే విధముగా భారతదేశం జనాభా పెరిగితే 2050 నాటికి166.8 కోట్లకు చేరుతుందని అంచనా . 1950 నుండి ప్రతి ఏడాది దేశాల వారీగా జనాభా గణాంకాలను యూనియన్ విడుదల చేయగా ఇందులో చైనాను మించి భారతదేశం మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి.

ఐక్యరాజ్యసమితి డేటా యొక్క వరల్డ్ మీటర్ విశదీకరణ ఆధారంగా జూన్ 28,2023 నాటికి భారతదేశ ప్రస్తుత జనాభా 1,420,422,518 ఉండగా ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరింది. జనాభా వృద్ధిరేటు మందగిస్తున్న కారణముగా 2037నాటికి దాదాపు 9 బిలియన్లను చేరవచ్చునని అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న జనాభాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. భారత్, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, తదితర తొమ్మిది దేశాలు 2050 నాటికి ప్రపంచ జనాభా లో సగం శాతాన్ని ఆక్రమిస్తాయని పేర్కొంది.

నిరక్షరాస్యత మూఢాచారాలు,కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడం వలన జనాభా ఇలాగే పెరుగుతుంటే పౌష్టికాహార లోపం మరియు సరియైన సమయంలో వైద్య సహాయం అందకపోవడం వంటి సమస్యలతో మరణాల రేటు కూడా అధికమౌతుంది. నానాటికీ ప్రకృతి వనరులు తరిగిపోతున్నాయి,సహజ వనరుల్ని పొదుపుగా వాడేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు అలాగే జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత,అవసరాలు తీరకపోవడం వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలు తమంతట తామే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహాంచాలి. అందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల కృషి కూడా అవసరం.అప్పుడే దేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించగలం.తద్వారా భూభారం కూడా తగ్గుతుంది .

అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
9908057980