న్యూఢిల్లీ (సెప్టెంబర్ – 29) : లోక్‌సభలో, రాజ్యసభ లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. (Women’s Reservation Bill signed by President Droupadi Murmu) దీంతో పార్లమెంట్ అమోదం పొందిన బిల్లు (128వ రాజ్యాంగ సవరణ బిల్లు) చట్టం రూపం దాల్చినట్టయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నూతన చట్టం ప్రకారం లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది.
అంతకుముందు గురువారం రోజే భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు. అనంతరం రాజ్యాంగంలోని 111వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఇవాళ రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.
మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం రెండు రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చింది. లోక్‌సభ, రాజ్యసభలో దాదాపు ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడటంతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కనుంది.
- సెప్టెంబర్ – 18 – 2023 – కేంద్ర మంత్రి మండలి అమోదం
- సెప్టెంబర్ – 20 – 2023- లోక్‌సభలో ఆమోదం
- సెప్టెంబర్ – 21 – 2023 – రాజ్యసభలో అమోదం
- సెప్టెంబర్ – 29 – 2023 – రాష్ర్రపతి అమోదం