UN – GLOBAL WARMING REPORT 2023 : భూతాపంపై ఐరాస నివేదిక

BIKKI NEWS : గ్లోబల్ వార్మింగ్ పై ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని పేర్కొంది. నవంబర్ 17 – 2023 న ఇది 2℃ పెరగడంతో భూగోళ చరిత్రలో గరిష్ట పెరుగుదల నమోదు అయిందని తెలిపింది.

నీరుగారుతోన్న COP27

పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అది 2.5 నుంచి 2.9 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే దిశగా పయనిస్తోందని వివరించింది. దీన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలన్నది ‘పారిస్ ఒప్పంద’ (COP27) లక్ష్యం. ఈ లక్ష్యం భూతాపానికి నీరుగారుతోన్న లెక్కలు ఐరాస సవివరంగా నివేదిక ద్వారా వెల్లడించింది.

పారిస్ ఒప్పందం’ (COP27) లక్ష్యాలకు అనుగుణంగా ఈ దశాబ్దం చివరి నాటికి తమ కర్బన ఉద్గారాలను 42 శాతం మేర కుదించుకోవడానికి సభ్య దేశాలు అంగీకరించాయి. అయితే బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగం వల్ల గత ఏడాది గ్రీన్ హౌస్ వాయువులు 1.2% మేర పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది.

2023 వెరీ హట్ గురూ

ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబరు చివరి నాటికి ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5℃ ను దాటేసిన సందర్భాలు 86 రోజుల్లో చోటు చేసుకున్నాయి. ఈ అక్టోబరు మొత్తం, నవంబరులో మొదటి రెండు వారాల్లో ప్రతి రోజూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ 40% రోజుల్లో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఆ స్థాయికి చేరింది. నవంబర్ 17 – 2023 న అది 2℃ కు పెరిగిందని పేర్కొంది.

1.5℃ కు పరిమితం చేస్తేనే మనుగడ

భూతాపాన్ని 1.5℃ కు పరిమితం చేయాలనే లక్ష్యాన్ని.. అనేక సంవత్సరాల లెక్కల ఆధారంగా నిర్దేశించారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఉద్గారాల్లో పెద్దగా పెరుగుదల లేకుండానే ఆ పరిమితిని 2029 లోనే చేరుకోవచ్చని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. దీన్ని నివారించడానికి మరింత కఠినంగా తమ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు.