Telangana formation day 2023 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 10 సంవత్సరాలు … ఈ సందర్భంగా జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు  మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు.

జూన్ 2వ తేదీ- శుక్రవారం – ప్రారంభోత్సవం

 • గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు.
 • హైదరాబాద్ లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారిచే పతాకావిష్కరణ
 • ముఖ్యమంత్రి గారిచే దశాబ్ది ఉత్సవ సందేశం
 • జిల్లాల్లో మంత్రివర్యులఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశం.

జూన్ 3వ తేదీ – శనివారం – తెలంగాణ రైతు దినోత్సవం

 • రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం. సమావేశం జాతీయగీతాలపనతో ప్రారంభం కావాలి.
 • రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, సీరియల్ బల్బులతో అద్భుతంగా అలంకరించాలి.
 • రైతు వేదికల ప్రాంగణాల్లోనూ, హాలు లోపల కూడా రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ఫ్లెక్సీలు/పోస్టర్లు పెట్టాలి.
 • ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు ఉండాలి.
 • సభలో రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు,PACS చైర్మన్లు, వ్యవసాయ, హార్టికల్చర్, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు, నాయకులుఅందరూ పాల్గొనాలి.
 • పాంప్లెట్ లో వ్యవసాయరంగంలో జరిగిన సంపూర్ణ ప్రగతిని వివిధ పథకాల (ఉచిత విద్యుత్తు, రైతుబంధు మొదలైన వాటికింద) ఒక్కో రైతుకు కలిగిన లబ్దిని వివరించాలి. ఆ క్లస్టర్ లోని గ్రామాలకు వ్యవసాయశాఖ ద్వారా వచ్చిన నిధుల గురించి వివరించాలి. పాంప్లెట్లు సభలో ఆవిష్కరించాలి. పంచాలి. సభలో చదవాలి.
 • రాష్ట్ర వ్యవసాయ శాఖ కరపత్రం,బుక్ లెట్, పోస్టర్ల వంటి సమాచార సామగ్రిని తయారు చేసి, కలెక్టర్లకు పంపిస్తుంది. వీటిని ప్రతి రైతుకు అందేలా పంపిణీ చేయాలి.
 • రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి   కలిగిన మేలును గురించి సభలో మాట్లాడించాలి.
 • వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
 • రైతులందరితో సామూహిక భోజనం

జూన్ 4వ తేదీ – ఆదివారం – సురక్షా దినోత్సవం
(రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి కార్యక్రమాలు)

 • రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు.
 • పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలి.
 • పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయడంలో తెలంగాణ పోలీస్ గత 8 సంవత్సరాలుగా  దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన విషయాన్ని హైలైట్ చేయాలి.
 • ఈ విధంగా పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలి.

హైదరాబాద్ నగర కార్యక్రమం…

 • హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పై పెట్రోలింగ్ కార్స్, blue colts ర్యాలీ.
 • హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వారంతా పాల్గొంటారు.
 • సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు -అంబేద్కర్ విగ్రహం ముందు పోలీస్ బ్యాండ్లతో ప్రదర్శన
 • Know your Protectors థీమ్ తో ఎగ్జిబిషన్, పలు కార్యక్రమాలు. పోలీస్ జాగృతి కళాకారుల బృందాలతో ప్రదర్శనలు.
 • పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, బాడీ కెమెరాలు, బ్రీత్ అనలైజర్లు మొదలైన పరికరాల గురించి వివరిస్తారు.
 • పోలీస్ జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన
 • మహిళా భద్రత – మహిళలకు 33శాతం రిజర్వేషన్ – పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విశిష్ట సేవలు – సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాలో నెంబర్ 1గా తెలంగాణ తదితర విషయాలను షో కేస్ చేస్తారు.

జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు…

 • పెట్రోలింగ్ కార్స్, Blue colts, ఫైర్ వెహికిల్స్ తదితరాలతోర్యాలీ నిర్వహించాలి.
 • సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బందితో సభ నిర్వహించాలి. అనంతరం బడా ఖాన.

జూన్ 5వ తేదీ – సోమవారం – తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం

 • నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి (వెయ్యి మందితో), సమావేశంలో విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును వివరించాలి.
 • సాయంత్రం రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం. ఈ సమావేశంలో రాష్ట్రం గత 9 ఏండ్లలో సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ, ప్రసంగాలు.
 • ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి, సీఎండీ జెన్ కో, ట్రాన్స్ కో, స్పెషల్ సీఎస్ ఎనర్జీ, మొత్తం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర విద్యుత్ వినియోగదారులు పాల్గొంటారు.
 • రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ కార్యాలయాలను సీరియల్ బల్బులతో (21 రోజుల పాటు ఉండాలి), పూల తోరణాలతో అద్భుతంగా అలంకరించాలి.
 • ప్రతి గ్రామంలో విద్యుత్తు గురించిన ఆకర్షణీయమైన ఫ్లెక్సీ నాడు – నేడు పద్ధతిలో ఏర్పాటు చేయాలి.  
 • విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను గురించి బుక్ లెట్ తయారు చేసి, విస్తృతంగా పంపిణీ చేయాలి.
 • గతంలో కరంటు కోతల దుస్థితి – తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిన విషయంతోపాటు…
 • గ్రామంలో ఉన్న మొత్తం కనెక్షన్లు – తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త కనెక్షన్లు – ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల వివరాలు, రైతులకు జరుగుతున్న మేలు, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తున్న విషయం, దానివల్ల వివిధ వృత్తులు, వ్యాపార వ్యవహారాలు సజావుగా నడవడం, గ్రామీణ జీవితంలో వచ్చిన సౌకర్యం తదితర  అంశాలను పొందుపరచాలి.
 • సోలార్, హైడల్, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా పెరిగిన తీరును హైలేట్ చేయాలి.
 • విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసిన తీరును, దీనికోసం చేసిన ఖర్చు, తదితర వివరాలను వెల్లడించాలి.
 • ఇదేరోజు సింగరేణి సంబురాలు జరపాలి, సింగరేణి సీఎండి నేతృత్వం వహించాలి.
 • సింగరేణి గనికార్మికులతో సమావేశాలు – కంపెనీ ఉత్పత్తి, టర్నోవర్ పెరగడం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బోనస్ ఇవ్వడం, కారుణ్య నియామకాలు, సింగరేణి కార్మికుల కోసం చేపట్టిన ఇతర సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేయాలి.
 • సాంస్కృతిక కార్యక్రమాలు – కార్మికులతో సామూహిక భోజనాలు (సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో ఇవి నిర్వహించాలి)

జూన్ 6వ తేదీ – మంగళవారం – తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

 • పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించాలి.
 • ఈ సభలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటించాలి. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని ప్రస్తావించాలి.
 • రాష్ట్రానికి తరలి వచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలను, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలు ప్రకటించాలి. పాంప్లెట్లు ప్రచురించి, పంచాలి.
 • టి హబ్, వి హబ్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించాలి.
 • ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అదిగమించి దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తీరును ఆవిష్కరించాలి.

జూన్ 7వ తేదీ – బుధవారం –  సాగునీటి దినోత్సవం

 • కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించాలి. ఈ డాక్యుమెంటరీని జిల్లా కలెక్టర్లు అందరికీ పంపిస్తారు. (మంత్రి కేటీఆర్ గారు అమెరికా  సదస్సులో ప్రదర్శించినది)
 • సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో 1000 మందితో సభ.
 • ఈ సభలో రైతులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనాలి.
 • రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ఇరిగేషన్ రంగంలో జరిగిన ప్రగతిని వివరించాలి. అత్యధికశాతం నిధులు వెచ్చించి, బృహత్తరమైన ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించిన విషయం వెల్లడించాలి. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల, బహుళార్దకసాధక కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనతను ప్రముఖంగా తెలియజేయాలి.
 • అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి కావస్తున్న విషయాన్ని తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన విషయం తెలియజేయాలి. కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా జరుపుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ప్రభుత్వ కృషిని గొప్పగా తెలియజేయాలి.  

రాష్ట్రస్థాయి కార్యక్రమం…

 • రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశంజరుగుతుంది.  పుస్తకాల ఆవిష్కరణ, ప్రసంగాలు. తదితర కార్యక్రమాలు ఉంటాయి.
 • ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు.

జూన్ 8వ తేదీ –గురువారం – ఊరూరాచెరువుల పండుగ

 • గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలి.
 • గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి.
 • గ్రామంలోనిరైతులు, మత్స్య కారులు, మహిళలుఅన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలి.
 • చెరువు గట్టుపై పండుగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలి.
 • కట్ట మైసమ్మపూజ – చెరువు నీటికి పూజ చేయాలి.
 • తదనంతరం సభ, సాంస్కృతిక కార్యక్రమాలు – బతుకమ్మ, కోలాటాలు – పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలి.
 • ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్బ జలాల పెరుగుదల.. తదితర వివరాలను తెలియజేస్తూ, ఫ్లెక్సీలు పెట్టాలి – పాంప్లెట్లు పంచాలి – చదివి వినిపించాలి.
 • నాయకులు, ప్రజలు కలిసిచెరువు కట్టమీదసహపంక్తిభోజనాలు చేయాలి.
 • ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు, తదితరులు పాల్గొంటారు.

జూన్ 9,శుక్రవారం – తెలంగాణ సంక్షేమ సంబురాలు

 • నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పించన్లు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలి.
 • ఆ నియోజకవర్గంలో ఎంత మంది పించన్లు, కల్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాల లబ్ధి పొందారు, ఇందుకోసం ఎన్ని నిధులు వెచ్చించారు, దాని ఫలితాలు గురించి వివరించాలి.
 • తాము పొందిన లబ్ధి గురించి, లబ్ధిదారుల చేత మాట్లాడించాలి
 • తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో ఒక సభ నిర్వహించాలి.
 • మొత్తం రాష్ట్రంలో అమలైన అన్ని సంక్షేమ కార్యక్రమాల వివరాలు, లబ్ధిదారుల సంఖ్య, ఇందుకోసం వెచ్చిన నిధులు.. వంటి పూర్తి వివరాలు తమ తమ ప్రసంగాల ద్వారా సభలో ఆవిష్కరించాలి.
 • గౌరవ మంత్రి వర్యులు, ఆ శాఖ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు ఇందులో పాల్గొంటారు.
 • గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి.
 • గతంలో భూములు సేకరించిన చోట, అందుబాటులో ఉన్న చోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలి.
 • వివిధ గ్రామీణ వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణ కింద లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.

జూన్ 10వ తేదీ, శనివారం – తెలంగాణ సుపరిపాలన దినోత్సవం – పరిపాలన సంస్కరణలు, ఫలితాలు

 • అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలి.
 • ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలి.
 • ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవిన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలి. వీటివల్ల ప్రజలకు దూరభారం తగ్గడమే కాకుండా, పరిపాలన పరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలి.
 • వివిధ శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నవిషయాన్నివివరించాలి.
 • ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, హెల్త్, విద్యుత్తు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల పునర్ వ్యవస్థీకరించిన తీరుతెన్నులను, తద్వారా పరిపాలన సుగమమై ప్రజలకు చక్కని సేవలు అందుతున్న విధానాన్ని, వీటి ప్రభావంతో ప్రజాజీవితంలో వచ్చిన మెరుగుదలపై నివేదిక తయారు చేయాలి.
 • రాష్ట్రస్థాయిలోనూ సమావేశం నిర్వహించి, పై అంశాల గురించి వివరించాలి.
 • నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి.  

జూన్ 11వ తేదీ, ఆదివారం –  తెలంగాణ సాహిత్య దినోత్సవం
(రాష్ట్ర స్థాయిలో, జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు)

 • రవీంద్రభారతిలో తెలంగాణ గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం
 • ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
 • తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలి
 • రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన 5 పద్య కవితలను, 5 వచన కవితలను ఎంపిక చేసి వాటికి నగదు బహుమతులు ప్రకటించాలి.
 • జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కవితా సంకలనం ప్రచురించాలి.
 • రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కూడా ఒక కవితా సంకలనాన్ని ప్రచురించాలి.

జూన్ 12వ తేదీ – సోమవారం – తెలంగాణ రన్

 • తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి.
 • ఈ రన్ కార్యక్రమంపోలీసు శాఖ నేతృత్వంలో జరుగుతుంది.
 • క్రీడలు, యువజన సర్వీసులశాఖ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి.
 • ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి.

జూన్ 13 కార్యక్రమం..మంగళవారం – తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం

 • నియోజకవర్గం కేంద్రంలోమహిళా సదస్సు నిర్వహించాలి. ఈ సదస్సులో అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది, ఇతరులు మొత్తం 1000 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరించాలి.
 • బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్ఆర్, షీ టీమ్స్, వి హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగుణులకు ప్రసూతి సెలవులు పెంచిన విషయం తదితర విషయాలన్నింటిని ఘనంగా పేర్కొనాలి.
 • అంగన్ వాడీలకు, ఆశా వర్కర్లకు ఇతర మహిళా ఉద్యోగులకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి.
 • మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటుచేసిన విషయాన్ని ప్రస్తావించాలి.
 • మహిళలతో ఎక్కువగా మాట్లాడించాలి.
 • ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలి.
 • ఈ సమావేశంలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులందరూ పాల్గొనాలి.

జూన్ 14 కార్యక్రమం… బుధవారం – తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం

 • హైదరాబాద్ లోని నిమ్స్ లో నూతనంగా ప్రభుత్వం తలపెట్టిన 2000 పడకల ఆసుపత్రి నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారిచే శంఖుస్థాపన.
 • నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల విద్యార్థులు తదితరులను ఆహ్వానించి సభ నిర్వహించాలి.
 • ఇందులో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని పేర్కొనాలి. 33 మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు, న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, ఎంసీహెచ్ లు, మాతా శిశు సంరక్షణ సేవలు, పెరిగిన మౌలిక వసతులు వంటి పూర్తి వివరాల గురించి వివరించాలి.
 • వైద్యారోగ్య రంగంలో సాధించిన సంపూర్ణ ప్రగతిని తెలియజేస్తూ, ఆ శాఖ ఒక కరపత్రాన్ని రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలి.   
 • అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయాలి.
 • ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఏఎన్ఎం, ఉత్తమ స్టాఫ్ నర్స్, ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్లకు సన్మానం చేయాలి. అవార్డులు అందించాలి.

జూన్15గురువారం – తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

 • ప్రతి గ్రామ పంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి.
 • గ్రామ పారిశుద్ద్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి.
 • నాడు – నేడు ఫార్మాట్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో ఊరూరా ఫ్లెక్సీలు పెట్టాలి.
 • ఊరిలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్లెక్సీలు పెట్టాలి.
 • ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి.
 • రాష్ట్ర స్థాయిలో రవీంద్రభారతిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పల్లెప్రగతిపై సమావేశం. సంబంధిత మంత్రితో పాటు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
 • ఈ సమావేశంలో పల్లెప్రగతి విజయాలను, జాతీయ స్థాయిలో సాధించిన అవార్డులను పేర్కొనాలి. పారిశుద్ద్యం మెరుగు పడటం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గిపోయిన తీరును ప్రముఖంగా ప్రస్తావించాలి. గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును ప్రస్తావించాలి.
 • ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేయాలి.

జూన్ 16వ తేదీ  – శుక్రవారం- తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం

 • ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలోజాతీయ జెండా ఎగురవేయాలి. అనంతరం పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి. పట్టణ పారిశుద్ద్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి. జాతీయ స్థాయిలో పట్టణాభివృద్ధిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి.
 • వివిధ పట్టణాల్లో నిర్మించిన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి, వైకుంఠధామాల నిర్మాణం గురించి, డంప్ యార్డుల గురించి, అర్బన్ ఫారెస్ట్, పార్కుల నిర్మాణం, 10శాతం గ్రీన్ బడ్జెట్ గా కేటాయించడం తదితర అభివృద్ధి అంశాల గురించి ప్రస్తావించాలి.
 • నాడు – నేడు ఫార్మాట్ లో పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పురపాలక శాఖ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో పట్టణాల్లో ఫ్లెక్సీలు పెట్టాలి.
 • ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి.
 • విశ్వనగరంగా హైదరాబాద్ ను రూపుదిద్దేందుకు ప్రభుత్వం చేసిన యావత్ కృషిని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
 • హైదరాబాద్ లో నిర్మించిన స్కైవేలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, వివిధ బ్రిడ్జీల నిర్మాణం, చెరువుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, మెట్రో రైలు నిర్మాణం, విస్తరణ, రోడ్ల అభివృద్ది పనులు, నాలాల అభివృద్ధి పనులు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మొదలైన అన్ని విషయాల గురించి హైలేట్ చేస్తూ నగరంలోని రవీంద్ర భారతిలో పెద్ద సభ నిర్వహించాలి.
 • హైదరాబాద్ లో తాగునీటి ఎద్దడిని పరిష్కరించిన తీరు, భవిష్యత్ అవసరాల కోసం రింగ్ మెయిన్ నిర్మాణం, ఉచితంగా తాగునీటి సరఫరావిషయాలు వివరించాలి.
 • దేశానికే దిక్సూచిగా టీఎస్ బి పాస్ చట్టం తీసుకొచ్చిన సంగతి, తద్వారా సులువైన నిర్మాణ అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను హైలైట్ చేయాలి.
 • జీవో 58, 59 తదితర జీవోల ద్వారా పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు అందజేసిన విధానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి.
 • ఉత్తమ మున్సిపాలిటీల, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం చేయాలి.

జూన్ 17వ తేదీ – శనివారం – తెలంగాణ గిరిజనోత్సవం

 • ఆయా గిరిజన గ్రామాల్లోసభలు
 • గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలి.
 • గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి.
 • హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం చేసిన విషయం హైలైట్ చేయాలి. కుమ్రంభీం జయంతిని, సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ప్రకటించాలి.
 • సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర జాతరగా నిర్వహిస్తున్న తీరును, అందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న తీరును ప్రస్తావించాలి. వివిధ జాతరలకు ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తున్న తీరును, తదితర వివరాలను వెల్లడించాలి.  
 • రాష్ట్రస్థాయిలో నగరంలోని రవీంద్ర భారతిలో గిరిజనులతో పెద్ద ఎత్తున సమావేశం. ఇందులో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.

జూన్ 18వ తేదీ  – ఆదివారం – తెలంగాణ మంచి నీళ్ల పండుగ

 • ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహించాలి. నీళ్లను శుభ్రపర్చుతున్న తీరును వివరించాలి. ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా అవుతున్న తీరును వివరించాలి.
 • సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన తాగునీటి ఎద్దడి ఉన్న తీరును ప్రస్తావిస్తూ, మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన విధానాన్ని అద్భుతంగా తెలియజేయాలి.
 • గ్రామంలోని మహిళలతో సభ నిర్వహించాలి. గతంలో మంచినీటి కోసం పడ్డ కష్టాలను, బిందెడు నీళ్ల  కోసం వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిన దుస్థితిని ప్రస్తావించాలి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఉచితంగా నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించాలి..
 • తాగునీటి కష్టాలు సంపూర్ణంగా తీరిపోయి, మహిళలు సంతోషిస్తున్న విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేయాలి.
 • రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో సభ నిర్వహించాలి. ఇందులో సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొనాలి.మిషన్ భగీరథ విజయాలను విశేషంగా తెలియజేయాలి.

జూన్ 19వ తేదీ  – సోమవారం – తెలంగాణ హరితోత్సవం

 • రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి. నర్సరీలను సందర్శించాలి.
 • మొక్కలు నాటే కార్యక్రమం (మాస్ ప్లాంటేషన్) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లోనూ విధిగా నిర్వహించాలి.
 • అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని వివరించాలి. అడవుల పునరుద్ధరణ కోసం తీసుకున్నచర్యలు, వచ్చిన ఫలితాల గురించి వివరించాలి.
 • గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని వెల్లడించాలి. హైదరాబాద్ కు గ్రీన్ సిటీ, ఇతర అవార్డులు వచ్చిన తీరును వివరించాలి.

జూన్ 19వ తేదీ  – సోమవారం – తెలంగాణ హరితోత్సవం

 • రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలి. నర్సరీలను సందర్శించాలి.
 • మొక్కలు నాటే కార్యక్రమం (మాస్ ప్లాంటేషన్) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లోనూ విధిగా నిర్వహించాలి.
 • అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని వివరించాలి. అడవుల పునరుద్ధరణ కోసం తీసుకున్నచర్యలు, వచ్చిన ఫలితాల గురించి వివరించాలి.
 • గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని వెల్లడించాలి. హైదరాబాద్ కు గ్రీన్ సిటీ, ఇతర అవార్డులు వచ్చిన తీరును వివరించాలి.

జూన్ 20వ తేదీ  – మంగళవారం – తెలంగాణ విద్యాదినోత్సవం

 • రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో ఉదయం పతాక వందనం చేయాలి. తదనంతరం సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను పేర్కొనాలి.
 • ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మనఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వహించాలి.సిద్ధంగా ఉన్న పది వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభించాలి.
 • పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలి.
 • ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించాలి.
 • విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమంతో పాటు, 1001 గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు (హార్టికల్చర్, ఫారెస్ట్, మహిళ, హెల్త్ యూనివర్సిటీ, తదితర) జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు., నూతనంగా నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు (రెసిడెన్షియల్ తో సహా), డిగ్రీ కాలేజీల (రెసిడెన్షియల్ తో సహా) ఏర్పాటు తదితర వివరాలను వెల్లడించాలి.

జూన్ 21వ తేదీ  – బుధవారం – తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

 • దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్ధనా మందిరాలకు అలంకరణ
 • దేవాలయాల్లో వేద పారాయణం, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు
 • ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు.
 • హరికథలు, పురాణ ప్రవచనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా పాల్గొనాలి.

జూన్ 22వ తేదీ  – గురువారం – అమరుల సంస్మరణ

 • ఊరూరా గ్రామ పంచాయతీలు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలి. అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలి. అమరులసంస్మరణ తీర్మానం చేయాలి.
 • ఇదే విధంగారాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలి. నిర్ణీత ఫార్మాట్ లో అమరుల సంస్మరణ తీర్మానాలు చేయాలి.
 • రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో ప్రార్థనా సమావేశంలో అమరుల స్మృతిలో 2 నిమిషాలు మౌనం పాటించాలి. వారి త్యాగాలను గురించి ప్రస్తుతించాలి.
 • హైదరాబాద్లో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ నుంచి 6 వేల మందికి తగ్గకుండా, కళాకారులతో భారీ ర్యాలీ -ముఖ్యమంత్రి గారిచే అమరవీరుల స్మారకం ప్రారంభించడం జరుగుతుంది.
 • మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొనాలి.
 • హైదరాబాద్ సభలో అమరులకు నివాళి సూచకంగా, సభలోని వారందరి చేతుల్లో ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి.
 • కళాకారుల ర్యాలీని సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంది.