Home > TELANGANA > తెలంగాణ వరద నష్టం 10 వేల కోట్లు – సీఎం రేవంత్

తెలంగాణ వరద నష్టం 10 వేల కోట్లు – సీఎం రేవంత్

BIKKI NEWS (SEP. 13) : Telangana flood lost 10 thousand crores. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు.

Telangana flood lost 10 thousand crores

కఠిన నిబంధనల వల్ల అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని, నిబంధనలు సడలించాలని కోరారు. వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర అధికారుల బృందంతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందు కోసం కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని, రాష్ట్రం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నపోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని సీఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు.

మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన అరుదైనది కావడంతో కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు.

ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి గారు, సీఎం సలహదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఇతర ఉన్నతాధికారులతో పాటు ఎన్​డీఎంఏ సలహాదారు కల్నల్​ కేపీ సింగ్ గారి​ సారధ్యంలో శాంతినాథ్​ శివప్ప గారు, మహేష్​ కుమార్ గారు​, నాయల్​ కాన్సన్​ గారు, రాకేష్​ మీనా గారు, శశివర్ధన్​ రెడ్డి గారితో కూడిన కేంద్ర బృందం పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు