జాతీయ చిహ్నాల విలువలను జీవింప చేయాలి : అస్నాల శ్రీనివాస్

BIKKI NEWS :దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్రోద్యమ వజ్రోత్సవ సంబరాల్లో నడయాడుతున్నారు. తమకు స్వేచ్ఛను, ఆత్మగౌరవ బాటలు చూపిన వారిని, తమ జీవితం సుసంపన్నం కావడానికి త్యాగాల పునాదులు వేసిన వారిని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి నినాదాల్లో అమరులను బ్రతికించుకుంటున్నారు. వారి గొంతులలో పాటలుగా నిలుపుకుంటున్నారు. వెల్లువలా ఉప్పెనల కొనసాగుతున్న తిరంగా ఊరేగింపులలో తమ మన శరీరాలతో వారి హృదయాల్లో వారి ప్రతిమలను ప్రతిష్టించుకుంటున్నారు.

90% నిరక్షరాస్యత నెలకొని ఉన్న దేశంలో కార్మికులకు, కర్షకులకు విద్యావంతులు పోరాట లక్ష్యాల్ని తెలియజేస్తూ ఉద్యమంలో మమేకం చేశారు. – అస్నాల శ్రీనివాస్

మానవ ఇతిహాసంలో మహోజ్వల ఘట్టం భారతదేశ స్వాతంత్ర్య సమరం. ఆంగ్లేయులు భారతదేశం మీద భౌతిక, రాజకీయ ఆధిపత్యాన్ని సాధించి వనరులను సంపదను ఆక్రమించుకోవడం అప్రతిహతంగా కొనసాగింది. పరాయి పాలనను వారి దాస్ఠిక దోపిడిని బెదిరించాలని దీక్షతో మూడు శతాబ్దాలుగా కొనసాగిన జాతీయ ఉద్యమ సమరంలో ప్రజలను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించిన ఘట్టాలు ఉన్నాయి. విద్య విముక్తికి సాధనం అని నమ్మిన కొద్దీ మంది విద్యావంతులు బ్రిటిష్ పాలనలో భాగస్వామ్యం చెందకుండా మాతృ దేశ విముక్తికై పోరాటములో పాల్గొన్నారు. పోరాటాన్ని నవ్య పదంలో కొనసాగించారు. 90% నిరక్షరాస్యత నెలకొని ఉన్న దేశంలో కార్మికులను, కర్షకులను కలిసి పోరాట లక్ష్యాల్ని తెలియజేస్తూ ఉద్యమంలో మమేకం చేశారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు… బానిసకు ఒక బానిసగా బతుకుతున్న మహిళల్ని చైతన్యవంతం చేసి ఉద్యమంలో మమేకం చేయడంలో మేధావులు విద్యావంతులు చోదకశక్తిగా పని చేశారు. పోరాట క్రమంలో కొన్ని విజయాలు మరికొన్ని వైఫల్యాలు, ఉద్యమాన్ని కుదించడం అదే క్రమంలో విస్తరించడం, అంతిమంగా ఆగస్టు – 15, 1947లో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత దేశం స్వయం పాలన పతాక వినీల ఆకాశంలో నాట్యమాడింది.

పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. త్రివర్ణ పతాకం భారతదేశ బహుళత్వ సంస్కృతికి సహజీవన విలువలకి ప్రత్యేకంగా రూపొందించారు. – అస్నాల శ్రీనివాస్

1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ సంస్థకు ప్రత్యేకమైన పతాక రూపకల్పన చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమైనవి. పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. త్రివర్ణ పతాకం భారతదేశ బహుళత్వ సంస్కృతికి, సహజీవన విలువలకి ప్రత్యేకంగా రూపొందించారు. రావి నది ఒడ్డున జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా ఎగురవేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్రివర్ణ పతాకంలోని..

  • కాషాయ వర్ణం శతాబ్దాలుగా వలసవాద దుర్మార్గ పాలనకు, దోపిడి పీడనకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటంలో అమరులైన అశేష ప్రజల త్యాగానికి ప్రతీకగా ఉంది అని చెప్పారు. కాషాయ వర్ణం ఆడంబరాలు లేని సాధారణ మానవతా మానవ జీవనానికి, సంక్షేమమే పరమావధిగా ఉంటూ నిస్వార్థం ఒక అలంకరణ గా ఉన్న గుణాలను సూచిస్తుందని చెప్పారు.
  • తెలుపు వర్ణం మాటల్లో‌, ఆలోచనల్లో స్వచ్ఛత హేతుబద్ధత, శాంతి, సంధి వంటి విశిష్ట గుణాలను తెలియజేస్తుందని అన్నారు.
  • ఆకుపచ్చ వర్ణం రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో స్వయం స్వాలంబన అభివృద్ధి వికాసాలకు ప్రతీక అని తెలియజేశారు.

జాతీయ ఉద్యమం కొనసాగుతున్న కాలంలో భారతీయ చేతివృత్తులలో ప్రతీక రాట్నంను వర్ణంలో అమర్చారు. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీకి, పారిశ్రామిక విప్లవానికి విలవిలలాడిన తీవ్రంగా నష్టపోయిన రంగం చేనేత వస్త్ర పరిశ్రమ. బట్టల మిల్లులు స్థాపించి యూరోపియన్ దేశాల నుండి బట్టలు దిగుమతి చేసుకోవడం వల్ల లక్షలాది చేనేత కార్మికుల జీవితం సంక్షోభంలోకి నెట్టబడింది. స్వయం సమృద్ధ పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ప్రారంభమైంది. విదేశీ వస్త్రాలు బహిష్కరించాలని స్వదేశీ చేనేత కార్మికుల నేసిన బట్టలనే ధరించాలనే గొప్ప ఉదాత్త విలువల ప్రచారానికి రాట్నం జాతీయ పతాకంలో ఒక చిహ్నంగా వాడారు.

బౌద్ధ ధర్మానికి ప్రతీకగా నిర్మించిన సారనాథ్ స్తూపంలో ఉన్న నాలుగు సింహాల కిరీట శిల్పంలోని ధర్మ చక్రాన్ని నెహ్రు, అంబేద్కర్ లు తెలుపు వర్ణంలో చేర్చారు. – అస్నాల శ్రీనివాస్

రాజ్యాంగ సభ నిర్మాణంలో జాతీయ పతాకం మార్పుల చేర్పులపై ఆసక్తికర చర్చ కొనసాగింది. అంబేద్కర్… నెహ్రు చొరవతో రాట్నం స్థానంలో ధర్మ చక్రాన్ని సూచించారు. దేశ చరిత్రలో మహా సామ్రాజ్యాన్ని అశోక మౌర్యవంశం తొలిసారిగా ఏర్పాటు చేసింది. బౌద్ధ తాత్వికతతో దేశాన్ని జనరంజకంగా పరిపాలించింది. ధనిక, పేద, కులము, మతము అనే తేడా లేకుండా ప్రతి మనిషికి ఒకే విలువను తన పాలన హృదయంగా మార్చుకుంది. బౌద్ధ ధర్మానికి ప్రతీకగా నిర్మించిన సారనాథ్ స్తూపంలో ఉన్న నాలుగు సింహాల కిరీట శిల్పంలోని ధర్మ చక్రాన్ని నెహ్రు, అంబేద్కర్ లు తెలుపు వర్ణంలో చేర్చారు. చలనానికి ప్రగతికి సహా సంబంధం ఉండే 24 గుణాల ప్రతీకగా ధర్మచక్రం నిలుస్తుంది. అలాగే జాతీయ చిహ్నంలోని ఎద్దు స్థిరత్వం శ్రమ శక్తికి, సింహాలు క్రమశిక్షణ గల బలానికి, హుందాతనానికి ప్రతీకగా నిలుస్తాయి. నెహ్రు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో అంబేద్కర్ బుద్ధ ధర్మంపై రాసిన పుస్తకాల్లో బౌద్ధ జీవన విధానం బోధనలు తమ కార్యాచరణకు దీప స్తంభంలాగా ప్రేరణ ఇచ్చాయని రాసుకున్నారు.

నెహ్రు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో అంబేద్కర్ బుద్ధ ధర్మంపై రాసిన పుస్తకాల్లో బౌద్ధ జీవన విధానం బోధనలు తమ కార్యాచరణకు దీప స్తంభంలాగా ప్రేరణ ఇచ్చాయని రాసుకున్నారు. – అస్నాల శ్రీనివాస్

అంబేద్కర్ స్వాతంత్ర్య యోధుల అకాంక్షల వెలుగులో రాజ్యాంగాన్ని రాసి ఒక సామాజిక విప్లవ ప్రకటనను చేశాడు. అందులో పౌరుడు జాతీయ పతాకం, జాతీయ చిహ్నాలను గౌరవించడమే తొలి విధిగా పేర్కొన్నాడు. జాతీయ చిహ్నాల తాత్వికత ప్రమాదంలో పడిపోతున్న సందర్భంలో మనం జీవిస్తున్నాం. ఆ విలువల పునరుద్ధరణకు మేధావులు, పౌర సమాజం పాలకులు క్రియాశీలకంగా పని చేయాలి. భిన్నమైన అభిప్రాయాలను, అసమ్మతిని ప్రజాస్వామిక మూల సూత్రంగా పరిగణించాలి. విశిష్టమైన రాజ్యాంగం వాద సంవాదాల చర్చల ద్వారా ఆధారంగా ఏర్పడిందని గుర్తుంచుకోవాలి. స్వరాజ్య సమరంలో గాంధీ, భగత్ సింగ్, నేతాజీ, బిర్సా ముండా మొదలగు వీరులు తమదైన రాజకీయ దృక్పథాలతో పోరాటాలలో పాల్గొన్నారు. వారిని గౌరవించినట్టే ప్రజాస్వామిక భారతంలో ప్రజా రాజకీయాల కోసం పోరాడే వారిని గౌరవించాలి కానీ అధికారం అండతో అసమ్మతిపై అణచివేతను, నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. దీనిని నిలుపుదల చేసే ప్రయత్నాలు చేయాలి. ఉన్నతమైన నైతిక విలువలు పరస్పర విశ్వాసం పెంపుదలకై నిరంతర కృషి జరగాలి. పాలకులు తమ బంధుప్రీతిని వదిలి వారు వారి సొంత ప్రతిభ కార్యాచరణతో ఎదగాలి. గాంధీజీ, వల్లభాయ్ పటేల్,లాల్ బహుదూర్ శాస్ర్తీ, నెహ్రులు తమ సంతానానికి, బంధుగణానికి తమ పేరును, స్థాయిని వాడకుండా కట్టడి చేశారు. ఈ ఒరవడి కొనసాగాలి. జాతీయ ఉద్యమంలో చంపారన్, ఖేడా రైతాంగ ఉద్యమాలు ముఖ్యపాత్ర పోషించాయి. ఇప్పుడు కూడా రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండే కృషిని కొనసాగించాలి. స్త్రీలు స్వరాజ్య సమరంలో అన్ని పోరాట రూపాలలో భారత జాతీయ సైన్యంలో సైనికులుగా కూడా పనిచేశారు. విషాదం ఏమిటంటే భారతదేశ చట్టసభలలో మహిళలు కేవలం 10 శాతం కంటే మించి లేరు. సంపద పంపిణీలో తీవ్ర అసమానతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అశాంతి పెరిగి మరో సమరానికి తావివ్వకుండా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య పాలన కొనసాగింపుకు వజ్రోత్సవ స్వాతంత్ర సంబరాలు పాలకులలో, పాలితుల్లో మహా పరివర్తన తీసుకురావాలి.

సంపద పంపిణీలో తీవ్ర అసమానతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అశాంతి పెరిగి మరో సమరానికి తావివ్వకుండా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య పాలన కొనసాగింపుకు వజ్రోత్సవ స్వాతంత్ర సంబరాలు పాలకులలో, పాలితుల్లో మహా పరివర్తన తీసుకురావాలి. – అస్నాల శ్రీనివాస్

వ్యాసకర్త :

అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం. 9652275560