సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటేనే ఇళ్ళకు అనుమతి.!

BIKKI NEWS (APRIL 20) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇకపై ఇళ్ళ నిర్మాణానికి కచ్చితంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటూనే అనుమతి ఇవ్వాలని (SOLAR PANELS MUST FOR HOUSE CONSTRUCTION IN GHMC) సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ళదీనిపై లోక్సభ ఎన్నికల తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.

దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తాజాగా ఉన్నతాధికారులతో చర్చించి రోడ్డు మ్యాపు రూపొందించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అమలుకు ప్రభుత్వం నియమనిబంధనలు విడుదల చేయనుంది.

సౌర విద్యుత్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని కచ్చితంమైన నిబంధన తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

అదేవిధంగా గ్రామాల్లోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, స్థానికంగా ఉండే సబ్ స్టేషన్లకు వీటిని అనుసంధానం చేస్తారు. తద్వారా గ్రామాలకు ఉండే విద్యుత్ సమస్యలను కూడా తీర్చవచ్చు అని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు సోలార్ ఎనర్జీయో పరిష్కార మార్గమని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్ తో పాటు సౌర, పవన విద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ ను బయట నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది.

థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణ ప్రభుత్వం పైనే కాకుండా వినియోగదారుల పైన కూడా మోయలేని భారంగా మారుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. దీని ద్వారా కాలుష్య ప్రభావాన్ని కూడా కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.