Home > ESSAYS > సెప్టెంబర్ 17 – విలీనమా, విమోచనమా… ప్రత్యేక వ్యాసం – అస్నాల శ్రీనివాస్

సెప్టెంబర్ 17 – విలీనమా, విమోచనమా… ప్రత్యేక వ్యాసం – అస్నాల శ్రీనివాస్

అస్నాల శ్రీనివాస్‌… ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయి., తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.

BIKKI NEWS (SEP.17) : Telangana liberation day september 17th. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా, నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి హైదరాబాద్‌ రాజ్య ప్రజలు సాగించిన మహత్తర ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. హైదరాబాద్‌ దక్కన్‌ రాజ్యాన్ని 1948 లో తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్ళతో పెకలించి తమ విముక్తిని ప్రకటించుకున్నారు.

Telangana liberation day september 17th

నిజాం ప్రభువుల పాలనకు మూలస్థంభాలుగా నిలిచిన భూస్వాములు, దేశముఖ్‌లు, ప్రభుత్వాధికారులు తెలంగాణ ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాల్జేశారు. ఈ నిరంకుశ నిర్బంధం నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడానికి ఆనాటి కమ్యూనిస్టు పార్టీ, -ఆంధ్ర మహాసభలు ఉమ్మడిగా ప్రజా ఉద్యమాన్ని నడిపాయి. నిజాం నమ్మిన బంటు విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి నిరంకుశ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామంలో ప్రజలు సాగించిన పోరాటం, దొడ్డి కొమురయ్య అమరత్వం చారిత్రాత్మకమైనవి. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయ్యింది.

నిజాం నమ్మిన బంటు విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి నిరంకుశ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామంలో ప్రజలు సాగించిన పోరాటం, దొడ్డి కొమురయ్య అమరత్వం చారిత్రాత్మకమైనవి. ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయ్యింది. – అస్నాల శ్రీనివాస్

హైద్రాబాద్‌ సంస్ధానంలో భాగమైన తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా ఫ్యూడల్‌ దోపిడిని, పరోక్షంగా విదేశి వలస దోపిడిని మోయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రజలు చరిత్రలోనే మున్నెన్నడు లేని విధంగా దుర్భర బానిసత్వాన్ని అనుభవించారు. నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా భాషాసంస్కృతుల్లో కూడా పరాయికరణకు, అవమానాలకు గురయ్యారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ తొలితరం విద్యావంతులైన మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమ్మరాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు మొదలైన వారు 1921 లో ఆంధ్ర జన సంఘం అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది 1923 లో ఆంధ్ర జన కేంద్ర సంఘంగా, 1930 లో నిజాం రాష్ట్రాంధ్ర మహాసభగా మారుతూ తన కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించింది. 1942 నుండి కమ్యూనిస్టులు చేరికతో ఆంధ్రమహాసభ భాషా సంస్కృతుల పరిధి దాటి వెట్టిచాకిరి వ్యతిరేక, ‘దున్నేవానికి భూమి’ వంటి పోరాటాలను నిర్వహించింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ నాటికి రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో విప్లవ సంస్థగా మారి దొరల, రజకార్ల, నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలను ప్రారంభించింది. 1940– -42 ల మధ్య బందగి సాహెబ్‌ సాహసమరణం, 1944-–1945 లో పాలకుర్తి అయిలమ్మ భూపోరాటం, 1946- దొడ్డి కొమురయ్య వీరమరణం, తదనంతరం భీంరెడ్డి, దేవులపల్లి, షోయబ్‌బుల్లాఖాన్‌, ముఖ్ధూం మోహియుద్దీన్‌, సర్వదేవభట్ల రామనాథం, ఆరుట్ల దంపతులు, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, నల్లా నర్సింహులు, సుద్దాల హన్మంతు, రాజబహుదూర్‌ గౌర్‌ల నాయకత్వంలో సాయుధ పోరాటం సాగింది.

1940– -42 ల మధ్య బందగి సాహెబ్‌ సాహసమరణం, 1944-–1945 లో పాలకుర్తి అయిలమ్మ భూపోరాటం, 1946- దొడ్డి కొమురయ్య వీరమరణాలతో సాయుధ పోరాటం ఊపిరి పోసుకుంది – అస్నాల శ్రీనివాస్

మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంతోగాని, జాతీయోద్యమ పోరాటంతో గాని, చరిత్రలో ప్రజల మౌళిక బాగు కోసం ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించని మతోన్మాద సంస్థల వారసులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం ముందుకు పోవటాన్ని చూసి యూనియన్‌లో చేరమని బ్రిటిష్‌ వారు నిజాంకు సలహా ఇచ్చారు. పోరాటకారులు హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న వేలాది గ్రామాలను విముక్త ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం కమ్యూనిస్టుల స్వాధీనమయ్యే అవకాశం ఉందని గ్రహించిన లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ నిజాంను యూనియన్‌లో చేరమని ఒత్తిడి చేశాడు. స్వతంత్ర దేశంగా ఉంటానన్న నిజాంకు దేశీయంగా, అంతర్జాతీయంగా మద్దతు కరువయింది. నిజాంకు సమాంతరంగా ఎదుగుతున్న మతోన్మాధ నాయకుడు ఖాసింరజ్వీ యూనియన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలపై తీవ్ర హింసాకాండను ప్రయోగించాడు. ఐక్యరాజ్య సమితిలో నిజాం కు మద్దతు తెలుపుతూ వస్తున్న పాకిస్ధాన్‌ గవర్నర్‌ జనరల్‌ మహ్మద్‌ అలీజిన్నా ఆకస్మికంగా మరణించారు.

ఈ పరిస్థితులలో నిజాంసైన్యాలు, రజ్వీ రజాకారులు, స్థైర్యాన్ని కోల్పోయి గందరగోళంలో పడి బలహీన స్థితికి చేరుకున్నారు. సెప్టెంబర్‌ 29, 1947న నిజాం, నెహ్రు సర్కార్‌లు ‘యథాతథ ఒడంబడిక’ ను చేసుకున్నాయి. సెప్టెంబర్‌ 13, 1948 వరకు అమలైన ఈ ఒడంబడిక కాలంలో వల్లభాభాయ్‌ పటేల్‌, రాజగోపాలాచారిలు సంస్థానంలోని ప్రజా విప్లవ వెల్లువను అణచి వేయడానికి నిజాంకు ఆయుధాలను సరఫరా చేశారు. మద్రాస్‌, హైదరాబాద్‌ రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీని నిషేదించారు. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజా గెరిల్లాలు నిజాం సైన్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీసి పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. కమ్యూనిస్టులపై తీవ్ర విద్వేషంతో ఉన్న హొంశాఖ మంత్రి పటేల్‌కు నిజాం తన లొంగుబాటును ప్రకటించి యూనియన్‌ సైన్యాలను పంపించమని కోరాడు.యూనియన్‌ సైన్యాలకు ఎలాంటి ప్రతిఘటన ఎదురవ్వలేదు. పైగా సైన్యాలకు సహకరించమని నిజాం రాజు ఆదేశాలు జారీ చేసి స్వాగతం పలికాడు. అధికారికంగా నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్‌ 17 న భారత్‌లో విలీనమైంది.

కమ్యూనిస్టులపై తీవ్ర విద్వేషంతో ఉన్న హొంశాఖ మంత్రి పటేల్‌కు నిజాం తన లొంగుబాటును ప్రకటించి యూనియన్‌ సైన్యాలను పంపించమని కోరాడు.యూనియన్‌ సైన్యాలకు ఎలాంటి ప్రతిఘటన ఎదురవ్వలేదు. పైగా సైన్యాలకు సహకరించమని నిజాం రాజు ఆదేశాలు జారీ చేసి స్వాగతం పలికాడు. అధికారికంగా నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్‌ 17 న భారత్‌లో విలీనమైంది.అస్నాల శ్రీనివాస్

విలీనం తరువాత బ్రిటిష్‌ సామ్రాజ్యావాదానికి, నిజాం రాచరికానికి వ్యతిరేకంగా అనుపమాన త్యాగాలు, పోరాటం చేసిన పోరాటకారులను గుర్తించి, గౌరవించాల్సింది పోయి వీరిపై కనివిని ఎరుగని పద్ధతులలో అమానుష దమనకాండను సైన్యాలు ప్రయోగించాయి. కమ్యూనిస్టులను వారి వెంట నడుస్తున్న లక్షలాది ప్రజలను నిర్బంధించారు. 1000కి పైగా గ్రామాలను తగులబెట్టారు. ఆదివాసీలు, మహిళలపై జరిగిన అత్యచారాలకు అంతేలేదు. చరిత్రలో ఇది ఒక చీకటి కోణంగానే మిగిలింది. ఖాసింరజ్వీని రక్షించి, నిజాంను రాజ ప్రముఖ్‌గా నియమించి రాజ భరణాలతో సత్కరించింది.

పోరాటానికి వేదికలైన వీరభూములు కడవెండి, బైరాన్‌పల్లిలో స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. – అస్నాల శ్రీనివాస్

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చర్రితను, అమర వీరుల వీరగాథలను స్మరించుకుందాం. పోరాటంలో అసువులు బాసిన అనాటి అమరవీరులను గుర్తించి వారి స్మారక చిహ్నాలు, పోరాట ఘట్టాలతో మ్యూజియంలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. స్వరాష్ట్రం సిద్ధించాక కెజి నుండి పిజి వరకు గల పాఠ్యాంశాలలో, పోటీ పరీక్షల సిలబస్‌లో సాయుధ పోరాట చరిత్రకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల చిట్యాల ఐలమ్మ జయంతి వర్ధంతి లను అధికారికంగా జరపాలని నిర్ణయించింది.ఈ కృషి కొనసాగింపులో ఆ పోరాటానికి వేదికలైన వీరభూములు కడవెండి, బైరాన్‌పల్లిలో స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వీరులకు జరిగిన అన్యాయాలను, అవమానాలను సమూలంగా తొలగించి అమరుల చిరస్మరణీయ త్యాగాలు ప్రజల హృదయాలలో పదిలంగా, భద్రంగా ఉండేట్లు కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందించాలి. ఇదే వారికిచ్చే నిజమైన నివాళి.

అస్నాల శ్రీనివాస్‌…

ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయి.,

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు