తెలంగాణ తేజోమూర్తి – భారత భవ్య కీర్తి

  • (పి.వి. జయంతి వ్యాసం) – అస్నాల శ్రీనివాస్
  • pv-narasimha-rao-birth-anniversary-special-essay-by-asnala-srinivas

BIKKI NEWS – ఆధునిక భారతదేశ చరిత్రలో పరిపాలన రంగంలో సంస్కరణలకు ఆద్యుడిగా, మానవీయ ముఖ ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా, ప్రజాతంత్ర విద్యను విస్తరించడానికి కృషి చేసిన ప్రదాతగా, సంక్షేమ కార్యక్రమాలను, అంతర్గత భద్రతను,అణు కార్యక్రమాలతో దేశాన్ని నిలదొక్కుకునేలా చేసి భారత్ ను తన అరుదైన విదేశాంగ విధానాలతో ప్రాచ్య, పాశ్చ్య దేశాలతో అనుసంధానించి అంతర్జాతీయ యవనికపై విశిష్ట స్థానం కల్పించిన దార్శనికుడిగా, అలాగే అత్యధిక ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపి దేశానికి ఒక మార్గం చూపించి విప్లవ రక్తపాతం తగ్గించి భూసంస్కరణలను చేపట్టిన శాంతియుత విప్లవకారుడిగా, ప్రజా పాలకుడిగా చరిత్రలో చిరస్మరణీయమైన స్థానం పొందినవారు పి.వి. నరసింహారావు.

దేశ చరిత్ర నిర్మాతలో ఒకరిగా ఉండే విశిష్ట స్థాయి గౌరవం అర్హత అన్ని పివి కి ఉన్నాయి. నెహ్రూ, డెంగ్ జియాంగ్, రూజ్ వేల్ట్, మార్గేరేట్ తాచర్ లాంటి ప్రపంచ శ్రేణి నాయకుల సరసన ఉండే గౌరవం పివి కి ఉంది.అస్నాల శ్రీనివాస్

దేశ చరిత్ర నిర్మాతలో ఒకరిగా ఉండే విశిష్ట స్థాయి గౌరవం అర్హత అన్ని పివి కి ఉన్నాయి. నెహ్రూ, డెంగ్ జియాంగ్, రూజ్ వేల్ట్, మార్గేరేట్ తాచర్ లాంటి ప్రపంచ శ్రేణి నాయకుల సరసన ఉండే గౌరవం పివి కి ఉంది. అరవై సంవత్సరాలు అతడు సేవలను పొందిన అతని పార్టీ కానీ, అధికారం చేపడుతున్న ఇతర రాజకీయ కూటములు ఉద్దేశ్య పూర్వకంగా పివి అందించిన నిరూపమాన సేవలను స్మరించడం లేదు. పాఠ్య పుస్తకాలలో సరైన స్థానం ఇవ్వడం లేదు.. పైగా అతని కృషిని, ప్రతిష్టను తక్కువ చేసే వ్యాఖ్యానాలు, అతని ప్రమేయం లేని అంశాలకు పీవీ కి అపాదించడం, బాధ్యుడిని చేయడం వంటి అవాంఛనీయ ధోరణులు చోటు చేసుకుంటున్నాయి.

సమైక్య రాష్ట్ర వ్యవసాయక సమాజం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భూసంస్కరణలు అందించిన పీవీ నరసింహారావులకు ఖచ్చితంగా రుణపడి ఉండాలి. – అస్నాల శ్రీనివాస్

సమైక్య రాష్ట్ర వ్యవసాయక సమాజం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భూసంస్కరణలు అందించిన పీవీ నరసింహారావులకు ఖచ్చితంగా రుణపడి ఉండాలి. నిజాం రాచరిక పాలనకి‌, దొరల ఆగడాలకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదం పై పోరాడుతూ దున్నేవానికే భూమి అనే నినాదంతో కమ్యూనిస్టు గెరిల్లాలు చరిత్రను గొప్ప ముందడుగు వేయించారు. తెలంగాణ భారత్ లో విలీనం తర్వాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న పటేల్ సైనిక బలగాల అండతో అనేక ప్రాంతాలలో భూస్వాములు తిరిగి గ్రామాలకు చేరి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను తిరిగి పెత్తనం కొనసాగించారు. ఈ పరిణామాలను వరంగల్, హైదరాబాద్, పునా, నాగపూర్ కళాశాలల విద్యార్థిగా, జాయిన్ ఇండియా ఉద్యమ నేత సోషలిస్టు భావాలు గల స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా పివి గమనించేవాడు. నాగపూర్ లో ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పుడు గుజరాత్ హరిపుర భారత్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సోషలిస్టు దార్శనికత గల సుభాష్ చంద్రబోస్, నెహ్రూ ల ప్రసంగాలు విని ప్రేరణ పొందాడు. కులీన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన జన సామాన్యముతో కలగలిసి పోయే సహజాత ఔదార్య గుణాలను ప్రదర్శించాడు. సామాజిక, శాస్త్ర సాంకేతిక, సాహిత్య రంగాలలో నిత్య తృష్ణ తో వాటి లక్ష్యం ప్రజా సంక్షేమమే అనే తాత్విక స్పృహ కలిగిన వ్యక్తిగా రాజకీయ రంగంలో కొనసాగారు. ముఖ్యమంత్రిగా గ్రామీణ సమాజంలో తుమ్మ చెట్టులా పాతుకుపోయిన దాని నీడలో పేదలను ఎదగనివ్వని భూస్వామ్య పెత్తందారితనాన్ని బలహీన పరచడానికి నిశ్ఛయించుకున్నాడు. లేకపోతే సమాజంలో అణచివేతకు గురవుతున్న ప్రజలతో విప్లవకర హింసావాదం పెచ్చరిల్లి తీవ్రరక్తపాతం సంభవిస్తుందని భావించాడు.

అంబేద్కర్ ప్రవచించిన సామాజిక సమానత్వాన్ని తన కేబినెట్ కూర్పులో ఆచరించాడు. బిసి, ఎస్సి, ఎస్టీ లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి గా చరిత్రలో నిలిచి పోయాడు. – అస్నాల శ్రీనివాస్

1970 దశాబ్దం ఆరంభంలో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో భూసమస్య కేంద్రంగా నక్సలైట్ల పోరు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది.. పీడితుల పట్ల ప్రేమతో, మహానీయుల సహచర్యంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రిగా ఆగస్టు 30, 1972 లో భూసంస్కరణల చట్టం రూపొందించి జూన్ 1, 1973 అమలులోకి తెచ్చాడు. కమతాల వికేంద్రీకరణతో వ్యవసాయభివృద్ధి జరుగుతుందని నిరూపించాడు. వరి సాగును తక్కువ చేయమని కొనుగోలు శక్తిని పెంచే వ్యాపార పంటలైన పత్తి, మిర్చి ల సాగును ప్రోత్సహించారు. పత్తిలో దిగుబడిని పెంచే పరపరాగా సంపర్క పద్ధతులను స్వయంగా కనిపెట్టి రైతులకు బోధించాడు. అంబేద్కర్ ప్రవచించిన సామాజిక సమానత్వాన్ని తన కేబినెట్ కూర్పులో ఆచరించాడు. బిసి, ఎస్సి, ఎస్టీ లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి గా చరిత్రలో నిలిచి పోయాడు. విద్య విముక్తి సాధనమని అణగారిన అన్ని వర్గాలకు గురుకులాలను. ప్రత్యేక బోధనా సిబ్బంది ఉన్న ఇంటర్ వ్యవస్థను ప్రారంభించాడు. తెలంగాణ భూమి పుత్రుడిగా ముల్కి రూల్స్ ను అమలు చేయాలని అన్న సుప్రీం కోర్ట్ తీర్పును అమలు పరచాడు. తన రాజకీయ సహచరి ఖమ్మం పార్లమెంట్ సభ్యురాలిగా పని చేసిన లక్ష్మి కాంతమ్మ తో కలిసి ఉన్నత ఉద్యోగాలలో, సివిల్ సర్వీసెస్ లలో మహిళలకు అవకాశం ఇవ్వాలను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఫెబియన్ సోషలిస్టు గా తన పాలనను కొనసాగిస్తున్న పివి పై భూమి పై, రాజకీయాలపై ఆధిపత్యాన్ని కోల్పోయిన కోస్తాంధ్ర తెలంగాణ ఆధిపత్య వర్గాలకు చెందిన రాజకీయనేతలు కుట్రతో పివి ని గద్దె దించారు. బహుశా ముఖ్యమంత్రి గా పివి పాలన పూర్తి కాలం కొనసాగినట్లైతే పరిపూర్ణ స్థాయిలో భూసమస్యను పరిష్కరించేవారు.. నక్సలైట్ల ఉద్యమ తీవ్రత తగ్గి ఏంతో మంది మేధావి యువతరాన్ని ఎదురుకాల్పులు బారిన పడకుండా కాపాడుకునేవాళ్ళం. పివి తర్వాత వచ్చిన జలగం వెంగళ రావు ఎంత కౄరంగా అణచివేత దమంకాండను ప్రయోగించాడో తెలిసిందే.

జనవరి 1993 లో ఐఐటి అహ్మదాబాద్ లో మాట్లాడుతూ మతోన్మాద చర్యల వలన ఏర్పడిన అనిశ్చితితో దేశీయ ఆర్ధిక రంగం, పెట్టుబడుల ప్రవాహం పై ప్రతికూలత కలిగాయని అవి దేశీయ ప్రగతికి తీవ్ర ఆటంకం అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక గమనం తీరుకి పివి మాట తార్కాణంగా నిలుస్తున్నది.అస్నాల శ్రీనివాస్

పివి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేఖం. ఏనాడు కుడా విద్వేష వ్యాఖ్యలు కానీ, ఒక మతం పట్ల ప్రత్యేక ప్రేమనుగాని ప్రకటించలేదు. అక్కడక్కడ సంఘ్ శిబిరాలకు వెళ్లిన కాంగ్రెస్ వారు ఉన్నారు.. ఈ మధ్య పివి వ్యతిరేకి అయినా ప్రణబ్ ముఖర్జీ, యన్ డి తివారి కుడా సంఘ్ శిబిరాలకు హాజరయ్యారు.. కానీ పివి మత ఆధారిత రాజకీయాలకు పాల్పడలేదు. వాటికి ఏ రకంగా ఉతమవ్వలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంలో మౌనంగా ఉండి సహకరించారు అని నింద మోపుతున్నారు.. రాజీవ్ గాంధీ హయాంలోనే విడాకులు పొందిన ముస్లిం మహిళల కు మనోవర్తిని వ్యతిరేఖించి ముస్లిం పెద్దల మద్దతు కోసం ప్రయత్నం చేశాడు. బిజెపి ప్రాబల్యం తగ్గించడం కోసం బాబ్రీ మసీదు ప్రాంగణంలో 1986 లో పూజలకు అనుమతిని,1988 లో అదే ప్రదేశంలో రామాలయ నిర్మాణ పునాది కార్యక్రమానికి అనుమతిని ఇచ్చాడు. హిందుత్వ రాజకీయాల సంఘ పరివార్, ప్రతిగా రాజీవ్ చర్యలతో మతోన్మాద శక్తులు పెట్రేగిపోయిన స్థితిలో దేశం కూరుకుపోయింది. యూపీ లో బీజేపీ ప్రభుత్వం, తాను నడుపుతున్నది మైనారిటీ ప్రభుత్వం. రాష్ట్రపతి పాలన విధించాల వద్ద అనే సందిగ్ధత లో పివి లోనయ్యారు. సంఘ్ శక్తులు ఇచ్చిన మాటను తప్పి కూల్చివేతలో పాల్గొన్నాయి. ఇకనైనా బాబ్రీ ఘటనకు పివి ని భాద్యుడు చేసే ప్రచారాన్ని “మేధావులు”మానుకోవాలి. జనవరి 1993 లో ఐఐటి అహ్మదాబాద్ లో మాట్లాడుతూ మతోన్మాద చర్యల వలన ఏర్పడిన అనిశ్చితితో దేశీయ ఆర్ధిక రంగం, పెట్టుబడుల ప్రవాహం పై ప్రతికూలత కలిగాయని అవి దేశీయ ప్రగతికి తీవ్ర ఆటంకం అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక గమనం తీరుకి పివి మాట తార్కాణంగా నిలుస్తున్నది.

“పివి విల్లి బ్రాండిట్ అనే జర్మన్ ఆర్ధిక వేత్త ప్రతిపాదించిన సామాజిక ప్రజాస్వామిక దృక్కోణ ఆర్థిక సంస్కరణలకు పూనుకున్నారు”. పెట్టుబడుల అనుమతికి ఆంక్షలు ఎత్తివేయడం వలన వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. పెరిగిన సంపద బొట్లు బొట్లుగా పేదలకు అందుతుందని నాకు నమ్మకం లేదు. మార్కెట్ పెరగడం వలన పెరిగే పన్నుల రాబడిని సామాజిక సంక్షేమానికి కేటాయించడం తన ప్రధమ విధి అని స్పష్టం చేశారు. – అస్నాల శ్రీనివాస్

నెహ్రూ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత్ తూర్పు ఆసియా దేశాల విముక్తి పోరాటాలకు సహకారాన్ని అందించాడు.. ప్రతిగా మలేసియా, థాయిలాండ్, ఇండినేషియా లు వ్యాపార లావాదేవిలలో భాగస్వామ్యం కావాలని కోరాయి. స్వయం సమృద్ధ స్వాలంబన కోసం ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేసే ప్రయత్నంలోనే నెహ్రు ఉన్నారు. తదనంతరం ఈ ఆగ్నేయసియా దేశాలు అభివృద్ధి పథంలో దూసుకపోయాయి. ఇందిరా కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా సింగపూర్, థాయిలాండ్ దక్షిణ కొరియా ల పర్యటన తర్వాత లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా భారత్, తూర్పు ఆసియా దేశాల మధ్య వ్యాపార వాణిజ్య లావాదేవీలు పురోగతిని సాధించాయి. అదే సమయంలో చైనా లో మావో శకం తర్వాత డెంగ్ జియాంగ్ పాలనలో రాజ్య నియంత్రిత పరిశ్రమలతో పాటు ఇతర మార్కెట్ రంగాలలో స్వదేశీ విదేశీ పెట్టుబడులకు అనుమతిని ఇచ్చి సాధించిన పురోగతిపై ఆసక్తి ని పెంచుకున్నాడు. రాజీవ్ హయాం లొనే లైసన్స్ రాజ్, గుత్తాధిపత్య నిరోధ సడలింపులు, పన్ను రాయితీలు జరిగాయి. దిగుమతుల సరళీకరణ జరిగింది1985 లో 4.5% పారిశ్రామిక ప్రగతి రేటు 1989నాటికే 10.5% కు.పెరిగింది.1990,91 లో చెల్లింపుల సమతుల్యం తగ్గి బంగారాన్ని తాకట్టు పెట్టిన దుస్థితికి లోనయ్యింది. గల్ఫ్ యుద్ధం చమురు ధరలను పెంచింది. మనకు రాజకీయ వ్యాపార భాగస్వామిగా ఉన్న రష్యా సమాఖ్య విడిపోయింది. ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎన్నడూ లేనంతగా పడి పోయాయి. యన్ ఆర్ ఐ లు భారతీయ బ్యాంకులలో దాచుకున్న డిపాజిట్లను వితడ్రా చేసుకున్నారు. ఇంజనీరింగ్ పరిశ్రమలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్న కొన్ని దక్షణ భారత కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ కు వెళ్లాలని ఒత్తిడి పెంచాయి. ఈ కష్టకాలంలో ప్రధానిగా భాద్యతలు చేపట్టిన “పివి విల్లి బ్రాండిట్ అనే జర్మన్ ఆర్ధిక వేత్త ప్రతిపాదించిన సామాజిక ప్రజాస్వామిక దృక్కోణ ఆర్థిక సంస్కరణలకు పూనుకున్నారు”. పెట్టుబడుల అనుమతికి ఆంక్షలు ఎత్తివేయడం వలన వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. పెరిగిన సంపద బొట్లు బొట్లుగా పేదలకు అందుతుందని నాకు నమ్మకం లేదు. మార్కెట్ పెరగడం వలన పెరిగే పన్నుల రాబడిని సామాజిక సంక్షేమానికి కేటాయించడం తన ప్రధమ విధి అని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల లాగా ఏవో కొన్ని స్వదేశీ విదేశీ సంస్థలు లాభం చేకూర్చడానికి పివి సంస్కరణలకు పునుకోలేదు. వాటితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కూడా పివి కి లేవు. ఇది ఒక అరుదైన అంశం.1991-96 నాటికి తన సంస్కరణల వల్ల భారత్ సాఫ్ట్వేర్ అనూహ్యంగా పెరిగి డాలర్ల రూపంలో ఆదాయం పెరిగింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలలో సురక్షిత స్థాయికి చేరుకున్నాము. నూతన యువతరానికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. శాటిలైట్ చానల్ ఉధృతి పెరిగింది. అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెరిగాయి. అవస్థాపన సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఈ వెల్లువ నయా ధనిక మధ్యతరగతి వర్గం ఏర్పడింది. పివి హాయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకోలేదు.

ఆర్ధిక సంస్కరణలకు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేని, సంక్షోభాన్ని ఆదిగమించే విద్వత్తు ఉన్న మన్మోహన్ సింగ్, అహ్లువాలియా లను సహాయకులుగా ఎంచుకున్నారు.
సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనకు పేద ప్రజల, ఉదాత్త విలువలు గల ఐ ఏ యస్ అధికారులు యస్ ఆర్ శంకరన్, కె ఆర్ వేణుగోపాల్, యుగంధర్(సత్య నాదెళ్ల తండ్రి), బి పి ర్ విఠల్ ను ఎంచుకున్నారు. ఆహార భద్రతను కల్పించే ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రజలకు చేరువ చేశారు. దేశంలోని రెండు వేల బ్లాక్ లలో వందరోజుల ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశారు. సర్వ శిక్ష అభియాన్ తో పాఠశాలల మౌళిక సౌకర్యాల కల్పన ను పెంచి గ్రామీణ విద్యార్థులకు నవోదయ సంస్థలను అనేకం స్థాపించారు.

భారత రాజ్యాంగ ప్రవచించిన ” సర్వ సత్తాక ” విధానాల రూపకల్పనలో స్వదేశీ విదేశీ స్వార్ష పరుల శక్తులకు అనుకూలంగా ఉండకూడదు. అత్యధిక ప్రజల ప్రయోజనాలకు అనువు గా ఉండాలి. మన కాలంలోనే మన మధ్యలో పుట్టిన పివి ఈ వెలుగులో వివిధ హోదాల్లో పని చేశారు. సూక్ష్మబుద్ధిగల రాజకీయ చతురతతో వైవిధ్య, వైశిష్ట్య గుణ సంపద తో, నిరంతర అధ్యయన, పథికత్వంతో తన రాజకీయ ఆధికారాన్ని ఉపయోగించుకున్న నిఖార్సయిన తెలంగాణ మందారం, దక్షణ భారతీయ ఆత్మ గౌరవ కేతనం మన పివి.

వ్యాసకర్త :
అస్నాల శ్రీనివాస్
9652275560