సమర యోధుల త్యాగాలను పాఠ్యంశాలుగా తేవాలి

  • స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పోతరవేణి తిరుపతి ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS : ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ ప్రారంభోత్సవ వేడుకలల్లో ప్రసంగిస్తూ స్వాతంత్ర పోరాట స్ఫూర్తి కొత్త తరానికి తెలియాలి అని పేర్కొనడం అక్షర సత్యం. మనం అందరం ఆలోచన చేయాల్సిన విషయం. కెసిఆర్ గారు చెప్పినట్లు నేటి యువతలో, విద్యార్థులలో స్వాతంత్ర పోరాటం ఘట్టాల గురించి, సమర యోధుల జీవితాలు, వారి చేసిన త్యాగాల వంటి విషయాలు పట్ల కొత్తతరానికి సరైన అవగాహన లేదని తెలుస్తుంది. వీరికి స్వాతంత్ర పోరాటం గురించి సరైన అవగాహన కల్పించడం ఎలా అనే విషయంపై కొంత చర్చ చేయవల్సిన అవసరం ఉంది.

భారతదేశంలో వర్తక వ్యాపారం కోసం పోర్చుగీసు వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు వచ్చినారు. వీరిలో బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో భారత దేశంలోకి వచ్చి తొలుత వర్తక వ్యాపారం చేసి, కాలక్రమేణా స్వదేశీ రాజుల మధ్య వివాదాలు సృష్టించి, వ్యాపారం వదిలి సామ్రాజ్య కాంక్షతో రాజకీయాల్లో ప్రవేశించినారు. విభజించు పాలించు అనే విధానాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని, తక్కెడ వదిలివేసి తుపాకీ నీడన దాదాపు 200 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించినారు. బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా 1857 నుండి 1947 వరకు స్వాతంత్రోద్యమ పోరాటం జరిగింది.

సుదీర్ఘకాలం సాగిన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోకి తొంగిచూస్తే అనేక పోరాటాలు, అనేక మంది సమర యోధుల త్యాగాలు మనకు కనబడుతున్నాయి. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి భారత మాత విముక్తి కోసం పోరాడిన సమర యోధులలో కొందరు హింసాయుతంగా, మరికొందరు శాంతియుతంగా సమరం సాగించారు. వీరిలో కొందరు సమర యోధులు చరిత్రలో గుర్తించబడినారు. మరికొందరు సమర యోధులు గుర్తించబడలేదు. అయినప్పటికి స్వతంత్ర సమర యోధులు తమ తరువాతి తరాల వారైనా హాయిగా ఆనందంగా బతకాలని, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవించాలని నిరంతరం తపించి ఉద్యమించినారు. వీరు చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు అనన్యసామాన్యమైనవి. వీరు తమ తల్లి దండ్రులను, భార్యాబిడ్డలను, వదిలేసి ఏళ్ళకు ఏళ్ళు జైళ్లలో మగ్గినారు, జైలుగోడల మధ్య పాచిపట్టిన అన్నం తినలేక రోజుల తరబడి పస్తులున్నవారు, ఆకలికి తట్టుకోలేక పురుగులు పట్టిన అన్నం ఏరుకొని ఆబగా తిన్నారు. తెల్లవాడి నెదిరించి నవ్వుతూ ఉరికంబాలపై వేలాడినారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్ని ధారబోసినారు. ఇలా లక్షలాది మంది నాటి నిస్వార్ధ సమరయోధులు అర్పించిన ప్రాణత్యాగాల ఫలితమే నేడు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువులు మరియు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు. ఎంతో చరిత్రాత్మమైన స్వతంత్ర పోరాటం, సమర యోధుల త్యాగాలు నేటి తరం మస్తిష్కాలను స్పృశించకపోవడం దురదృష్టకరం.
నేటి తరంలో ముఖ్యంగా విద్యార్థులు, యువత ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా జరిగే ఉత్సవాల నిర్వహణ వలన, దేశభక్తికి సంబందించిన పాటల పోటీల వలన, ఉపన్యాస పోటీల వలన, వ్యాస రచన పోటీల వలన, సామూహిక గీతాలాపన వలన, సినిమా ప్రదర్శన వలన, జెండా వందనం వలన, జైహింద్ నినాదం వలన మహోజ్వల స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, సమర యోధుల త్యాగాలు నేటి తరానికి అర్ధం అయ్యే అవకాశం చాలా తక్కువ. ఈ తరం వారికి స్వాతంత్ర పోరాటం, సమరయోధుల త్యాగాలు సరైన రీతిలో తెలియాలంటే వాటి మూలాలు విద్యా బోధనలో పడాలి. ఒక జాతి కీర్తి, నిస్వార్థం, త్యాగపరంపరలను తర్వాతి తరానికి బోధిస్తేనే చైతన్యమవుతుంది. నిరంతరం చరిత్ర బోధన వారిని ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా ఒక జాతి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. దేశ ఘనమైన చరిత్ర మరియు ఒక చైతన్యవంతమైన సాంస్కృతిక వారసత్వం తీసుకోవడానికి విద్యార్థులు, యువత ముందుంటారు. అందువల్ల 75 సంవత్సరాల స్వాతంత్య్రం వచ్చిన శుభ సందర్భం ప్రస్తుత తరానికి ఉత్సవాల కంటే చరిత్ర బోధన ద్వారానే స్వతంత్ర పోరాట స్ఫూర్తిని అందించాలి.


కాబట్టి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వలె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ నర్సరీ నుండి పీజీ వరకు విద్యాబోధనలో భారత దేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రను(దేశ భక్తి కర్రీకులం) తప్పనిసరి పాఠ్యంశంగా ప్రవేశ పెట్టి బోధించాలి. అలాగే సమర యోధుల త్యాగాలను పాఠ్యంశాలుగా తేవాలి. అపుడే స్వతంత్ర పోరాట ఘట్టాలు, సమర యోధుల త్యాగాలు పాఠాల రూపంలో పిల్లలకు హృదయాంతరంగంలో చేరి, దేశ భక్తి పెంపోందుతుంది. వారిలో జాతీయ స్ఫూర్తి, జాతీయ భావం వంటి మొదలగు ఆలోచనలు రేకేత్తుతాయి. ఫలితంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ, ప్రాధాన్యతలను నేటి యువత, విద్యార్థి లోకం అర్ధ చేసుకొని ఛిద్రమైపోతున్న మానవ విలువలను, పతనమైపోతున్న ప్రజాస్వామిక విలువలను కొంతమేరకైనా కాపాడుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

వ్యాస కర్త🖊️

డా.తిరుపతి పోతరవేణి
రాష్ట్ర అధ్యక్షులు
చరిత్ర పరిరక్షణ సమితి, తెలంగాణ*
9963117456*