హైదరాబాద్ (జనవరి – 31) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్షలకు పీజీతో సంబంధం లేకుండా ఎంపీఈడీ అర్హత ఉన్న పిటిషనర్లను అనుమతించాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ను హైకోర్టు ఆదేశించింది. అయితే ఫలితాలను మాత్రం వెల్లడించరాదని పేర్కొంది.
టీఎస్పీఎస్సీ జారీ చేసిన పీ.డీ. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లోని అర్హతల నిబంధనను సవాలు చేస్తూ 192 మంది దాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరపు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ ఇంటర్ పీడీ పోస్టుల నిమిత్తం పీజీ విద్యార్హతతోపాటు ఎంపీఈడీ ఉండాలన్న షరతు విధించిందని, ఇది రాజ్యాంగంతోపాటు ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎంపీఈడీ పూర్తి చేయడానికి ఇంటర్ తరువాత ఏడేళ్ల సమయం పడుతుందన్నారు. పీజీతోపాటు ఎంపీఈడీ ఉండాలన్న నిబంధనల వల్ల అనేకమంది ఎంపిక ప్రక్రియలో పాల్గొనలేకపోతున్నారని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్లను రాత పరీక్షలకు అనుమతించాలని, అయితే ఫలితాలను మాత్రం వెల్లడించరాదని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.