BIKKI NEWS (MARCH – 26) : ఇంటర్మీడియట్ లో ఒకేషనల్ కోర్సు చదివి ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన వారిని ఫార్మసిస్టులుగా (pharmacist registration for inter vocational mlt qualified students) రిజిస్టర్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2020 ఫిబ్రవరి కంటే ముందు ఆ కోర్సులు పూర్తి చేసిన వారిని ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చదివిన వారు డీ- ఫార్మసీ, బీ- ఫార్మసీ కోర్సులకు అనర్హులని పేర్కొంటూ రెండు తెలుగు రాష్ట్రాల ఫార్మసీ కౌన్సిళ్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) 2020 ఫిబ్రవరిలో లేఖ రాసింది.
దీంతో ఇంటర్‌లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్‌టీ) ఒకేషనల్ కోర్సు చేసి, ఇంటర్ బోర్డు నిర్వహించే బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఫార్మసీ కోర్సు చేసిన తమను ఫార్మసిస్టులుగా రిజిస్టర్ చేయడం లేదని హైకోర్టులో దాదాపు 18 పిటిషన్‌లు దాఖలయ్యాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఔ అంశంపై విచారణ చేపట్టింది. పిటిషర్‌ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సు, బ్రిడ్జి కోర్సు చేసిన తమ పిటిషనర్లకు ఫార్మసీ కోర్సులో ప్రవేశాలు కల్పించారని, ఫార్మసీ యాక్ట్- 1948 ప్రకారం వారికి ఫార్మసిస్టుగా రిజిస్టర్ అయ్యే హక్కు ఉందని తెలిపారు.
కేంద్ర తరఫు న్యాయవాది ఎడ్యుకేషన్ రెగ్యులేషన్- 1991లోని రెగ్యులేషన్ 5(5) ప్రకారం ఇంటర్ రెగ్యులర్ కోర్సులు చదివిన వారు మాత్రమే అందుకు అర్హులని పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ఫార్మసీ కోర్సులకు ఇంటర్ ఒకేషనల్ కోర్సులు కనీస విద్యార్హత కిందకు రావని స్పష్టం చేసింది.
అలాంటి వారికి ప్రవేశాలు కల్పించరాదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఫార్మసీ కౌన్సిళ్లకు పీసీఐ స్పష్టం చేసిందని తెలిపింది. అయితే పీసీఐ లేఖకు ముందు ఫార్మసీ కోర్సులు పూర్తిచేసిన వారిని వన్ టైం రిలాక్సేషన్(ఓటీఆర్) కింద ఫార్మసిస్టులుగా రిజిస్టర్ చేయాలని తుదితీర్పు ఇచ్చింది.