ఇంటర్ లోనూ ఆన్లైన్ అడ్మిషన్లు.! – బుర్రా వెంకటేశం

BIKKI NEWS (APRIL 25) : ఇంటర్మీడియట్ లోనూ ఆన్లైన్ అడ్మిషన్ల విధానం ప్రవేశపెట్టడానికి (online admissions in intermediate) కసరత్తు చేస్తున్నట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. డిగ్రీ లో విజయవంతమైన DOST తరహాలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.

అయితే పదో తరగతి విద్యార్థులకు మార్కులకు బదులుగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (GPA) వస్తుందనీ, దాని ఆధారంగా సీట్లు కేటాయించడం అంత సులువు కాదని చెప్పారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే గ్రేడ్ తెచ్చుకుంటారని వివరించారు.

ఈ అంశాన్ని ఎలా అధిగమించాలన్న దానిపై సమాలోచన చేస్తున్నామని అన్నారు. ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపట్టే అవకాశముండబోదని చెప్పారు.

ఆన్లైన్ ప్రవేశాలను కార్పొరేట్ కాలేజీలే అడ్డుకుంటున్నాయన్న ప్రశ్నకు అలాంటి సమస్య ఏమీ లేదని ఆయన సమాధానం ఇచ్చారు. ఆ కాలేజీలు అడ్డుకుంటే తాము ప్రయత్నం ఎందుకు మొదలు పెడతామని అన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.