BIKKI NEWS (JAN. 17) : గడచిన తొమ్మిదేళ్లలో భారత దేశంలో 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని సోమవారం వెల్లడైన నీతి ఆయోగ్ పేదరి నివేదిక (niti aayog poverty report 2023)తెలిపింది. అంటే ఏడాదికి సగటున 2.75 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు లెక్క అని నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ వివరించారు.
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లలో అత్యధిక స్థాయిలో పేదరికం తగ్గినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2013-14 నుంచి 2022-23 వరకు ఉత్తర్‌ప్రదేశ్ లో 5.94 కోట్ల మంది, బిహార్‌లో 3.77 కోట్ల మంది, మధ్యప్రదేశ్‌లో 2.30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశమంతటా పేదరికం నుంచి బయటపడిన వారిలో సగం మందికిపైగా ఈ 3 రాష్ట్రాల్లోనే ఉన్నారు.
ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలతోపాటు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 12 పరామితుల్లో వెనుకబాటును బహుముఖ పేదరికంగా పరిగణిస్తారు. ఈ పరామితుల్లో పోషకాహారం, మాతాశిశు ఆరోగ్యం, చదువుకున్న సంవత్సరాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, బ్యాంకు ఖాతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. 2030కల్లా బహుముఖ పేదరికం స్థాయిని సగానికి సగం తగ్గించాలన్న ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని భారత్ సాధించనుంది. బహుముఖ పేదరికంతో బాధపడేవారి సంఖ్య ఈ సంవత్సరంలోనే సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గుతుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం చెప్పారు.
పేదల సంఖ్యను దేశ జనాభాలో 1 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉందన్నారు. 2005-06 నుంచి 2015-16 దేశంలో పేదరికం రేటు ఏటా 7.69 శాతం చొప్పున తగ్గగా.. 2015-16 నుంచి 2019-21 మధ్య ఏటా 10.66 శాతం చొప్పున తగ్గింది. పేద రాష్ట్రాల్లో దారిద్య్రం వేగంగా తగ్గింది. ఆది ఆదాయ అసమానతల తొలగింపునకు దోహదం చేస్తోంది.
2005-06లో దేశ జనాభాలో 55.34 శాతం మంది బహుముఖ పేదరికంలో మగ్గగా, వారి సంఖ్య 2015-16లో 24.85 శాతానికీ, 2019-21లో 14.96 శాతానికీ తగ్గిపోయింది. గడచిన తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగంలో ఎక్కువ పురోగతి సాధించినట్లు రమేశ్ చంద్ తెలిపారు.
పోషణ్ అభియాన్, ఎనీమియా ముక్త్ భారత్ పథకాలు పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరచాయని, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.35 కోట్ల మందికి రేషన్ ధాన్యాలు అందాయని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.
రోజుకు 2.15 డాలర్లకన్నా తక్కువ సంపాదించే వారిని నిరుపేదలుగా 2017లో ప్రపంచ బ్యాంకు నిర్వచించింది. 2015లో భారత జనాభాలో ఈ వర్గంలోకి వచ్చేవారు 18.73 శాతం కాగా, 2021లో అది 11.9 శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది