NATIONAL CHILDREN’S DAY : జాతీయ బాలల దినోత్సవం

BIKKI NEWS (NOV – 14) : బాలల దినోత్సవంను ప్రతి సంవత్సరం నవంబరు 14 న (NATIONAL CHILDREN’S DAY) జరుపుకుంటాము. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.

NATIONAL CHILDREN’S DAY

అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు.

భారత దేశాన్ని దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్‌లాల్‌ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా. ఉండేవారు. స్వాతంత్యం సంపాధించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది.

అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు నాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే… నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు.

ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు