BIKKI NEWS (MARCH 10) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు గ్యారెంటీలను అమలు చేయటానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో నిర్వహించనున్న భారీ సదస్సులో.. మహిళలకు నెలకు ₹ 2,500/- ఆర్థికసాయం పథకం మరియు వడ్డీ లేని రుణాలపై సీఎం కీలక ప్రకటన (MAHA LAXMI SCHEME WITH 2500 FOR WOMEN) చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న క్యాబినెట్ మీటింగ్ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున భృతిని అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేయాల్సిన ఈ పథకంపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం ఎంత మంది మహిళలు అర్హులవుతారు, రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది, ఎప్పటి నుంచి అమలు చేయాలి అన్న వివరాలపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు పరేడ్ గ్రౌండ్స్ సభలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు. లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ప్రభుత్వం నిర్వహించనున్న ఈ సదస్సులోనే.. మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చే అంశంపైనా సీఎం ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. దీనిపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
క్యాబినెట్‌లో చర్చకు రానున్న మరో ప్రధానాంశం.. ఎమ్మెల్సీల నియామకం. హైకోర్టు తీర్పు అనంతరం ఈ అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. మరోవైపు, గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానుంది. ఈ మేరకు పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా కొండలు, గుట్టలున్న భూములకు, రోడ్ల నిర్మాణం కింద పోయిన భూములకు రైతు భరోసాను వర్తింపజేయవద్దన్న ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్గ ప్రకటించారు. దీనిపైనా క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
ధరణి పోర్టల్‌లో సమస్యలు, లే-అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) తదితర అంశాలూ క్యాబినెట్ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఉద్యోగుల సమస్యలు, పీఆర్‌సీ, పెండింగ్ డీఎ లు వంటి వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది.
2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పై కూడా చర్చించి విధివిధానాలు రూపొందించే అవకాశం ఉంది.