- కుమ్రం భీం జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
BIKKI NEWS : kumrumbheem jayanthii special essay by addagudi umadevi. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని పూర్వపు బస్తర్ సంస్థానమే గోండు గిరిజనులకు పుట్టినిల్లు. సంఖ్యా పరంగా గోండులు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతి. గిరిజన గోండు వీరుడైన కుమ్రం భీమ్ నాటి నిజాం హైదరాబాదు రాజ్యంలోని అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్ లోని జోడేఘాట్ అడవి ప్రాంతంలో సంకెనపల్లి అనే గిరిజన గూడెంలో 22 అక్టోబర్ 1901 సంవత్సరంలో కుమ్రం చిన్ను, సోమ్ బాయ్ దంపతులకు జన్మించాడు.
kumrumbheem jayanthii special essay by addagudi umadevi
ఆసిఫాబాద్ ప్రాంతమంతా హైదరాబాద్ రాజ్యంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధీనంలో ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవించే వీరు రాజ్యం యొక్క ప్రత్యక్ష నియంత్రణలో లేకపోవడం చేత “ఆదివాసీల భూముల పరిరక్షణ” పేరుతో నిజాం ప్రభుత్వం1917లో తెచ్చిన అటవి చట్టం గిరిజనుల్లో అల్లకల్లోలం సృష్టించింది. ఈ చట్టం ప్రకారం అనేక పరిమితులు, పన్నులు విధించింది. పశువులను అడవిలో మేపితే బండరాయి పన్ను, కలప తెచ్చుకుంటే దుంపపట్టి పన్ను ఇంకా ఘర్ పట్టి, నాగర్ పట్టి, ఫసల్ పట్టి ఇలా గిరిజనులు ప్రభుత్వానికి చెల్లించేవారు. ఇవేకాకుండా 1918లో ఉట్నూర్ మొదటి తహసీల్దార్ రెవెన్యూ పరమైన పన్నులు విధించేవారు. 1935లో సిర్పూర్ కాగజ్ నగర్ లో పేపర్ మిల్లు కొరకు అడవి ప్రాంతం స్వాధీనం చేసుకోగా చాలా మంది గోండులు ఫ్యాక్టరీ కార్మికులుగా మారారు.
దీనికి తోడు అధికారుల అండతో తెలుగు, మరాఠా, ముస్లీం వారు వడ్డీల పేరుతో వారి భూములను కబ్జా చేసుకోవడమే గాక వారిపై కేసులు నమోదు చేయగా ఇదంతా గమనిస్తున్న యువకుడైన కుమ్రం భీం పరిష్కార మార్గాలు వెదుకుతున్న తరుణంలో తన తండ్రి మరణంచేత సంకెన పల్లి నుండి సుర్దాపూర్ గ్రామానికి వలస వెళ్ళారు. ఈ సమయంలో కుమ్రం తన స్నేహితులైన మడారి మహదు, మోతీరాం ద్వారా దోపిడీని యెదిరించిన గోండు రాజు వీరులైన రామ్ జీ గోండు, అల్లూరి సితారామరాజుల తిరుగుబాటు, ధీరత్వం, అమరత్వాన్ని తెలుసుకొని తన జాతికి ఏదైనా చేయాలని నిర్ణయించుకొని “సుర్దాపూర్ ” అన్నలతో కలిసి పోడు భూమిని సిద్దంచేసుకొని వ్యవసాయం చేసాడు. పంట చేతికి వచ్చే సమయంలో పట్వారీ లక్ష్మణరావు, సిద్ధికీ అనే ముస్లీం పట్టాదారుడనీ ఆ భూములు సిద్ధికివి అన్నారు. తాము సాగుచేసుకున్న భూమిపై తమకే హక్కు ఉండాలని వాదించే ఘర్షణలో సిద్ధికీ మరణానికి కారణమైన కుమ్రం జీవితం అనేక పరిణామాలకు దారితీసింది. తర్వాత కుమ్రం తన స్నేహితుడు కొండల్ తో కలిసి మహారాష్ట్రలోని బళ్ళార్షాకు వెళ్ళి కొన్నాళ్ళ తర్వాత చంద్రాపూర్ లో సామాజిక స్పృహగల విఠోభా గారి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసాడు. అక్కడే కొంత రాయడం, చదవడం నేర్చుకున్నాడు.
ప్రభుత్వ వ్యతిరేకియని ప్రభుత్వం వారు విఠోబాని అరెస్టు చేయగా కుమ్రం చాయ్ పత్తా దేశమైన అస్సాంలో 5 సంవత్సరాలు పనిచేసాడు. అక్కడ టీ తోటల యజమానులూ, బ్రిటీష్ అధికారులు సాగించే అణచివేతకు బుద్ధిచెప్పాలని కూలీలందరికీ నాయకత్వం వహించాడు. ఆ సమయంలో నిరంకుశుడైన ఒక మేస్త్రీ కూలీలను చంపుతుంటే అడ్డగించి మళ్ళీ తన స్వంత ప్రాంతానికి వచ్చి తన జాతి ప్రజలకై ఏదైనా చేయాలనే దృఢ సంకల్పానికి వచ్చాడు. తెలుగు,మరాఠీ,ఉర్దూ నేర్చిన భీం కాకన్ ఘాట్ గూడెం పెద్ద లచ్చు పటేల్ కి దగ్గరై పాత సమస్యలు పరిష్కరించగా గూడెంలో భీం పలుకుబడి పెరిగింది. అప్పుడే అంబతిరావు కూతురు సోమ్ బాయితో కుమ్రం వివాహం జరిగింది. ఆరోజుల్లో సుర్దాపూర్ ప్రాంతం వారితో “జల్ – జంగల్ – జమీన్” అనే నినాదంతో ఇవి తరతరాలుగా మనవేనంటూ పోడు భూములను సిద్ధం చేసుకొని “బాబేఝరి, జోడెఘాట్” వంటి 12 గూడెములను ఏర్పాటు చేసాడు. పన్నెండు గూడెముల పరిధిలో దాదాపు 300ఎకరాలు ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారని అటవీ, రెవెన్యూ అధికారులు ప్రకటించారు. అప్పుడు అధికారులతో ఘర్షణకు తలపడగా గాయపడ్డ భీంకు వ్యక్తిగత ఆశజూపి పోరాటం ఆపమన్నారు. కానీ భీం 12 గూడెములకు స్వతంత్ర అధికారం (మావేనాట్ – మావేరాజ్) కావాలని డిమాండ్ చేయగా నిజాం నుండి ఎలాంటి జవాబు రాలేదు. అప్పుడు యుద్దమే శరణ్యమని నమ్మగా 1940 సెప్టెంబర్ న జోడెఘాట్ గుడి దగ్గర పన్నెండు గూడెములు సమావేశమౌతున్నారని తెలిసి 300 వందల మంది పోలీసులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడి జరుపగా కుమ్రంతో పాటు 140 మందికి పైగా గోండులు మరణించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని ఆంధ్ర మహాసభల నాయకులు, మందుముల నరసింహారావు, సురవరం మొదలగు వాళ్ళు కోరగా లండన్ యూనివర్సిటీ మానవ శాస్త్రవేత్త క్రిస్టాఫ్ వాన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ ని నియమించగా ఆయన సలహాల ప్రకారం 1940లో దస్తుర్ -ఉల్ -అమర్ చట్టం వచ్చింది .భీం పోరాటం ఫలితంగా రాజ్యాంగంలో 5వ, 6వ షెడ్యూల్ నిబంధనలు 1/70 చట్టం కూడా వచ్చింది. దానితో కుమ్రం గోండుల ఆరాధ్య దైవంగా నిలిచాడు. అక్టోబర్ ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమినాడు భీం వర్ధంతి కాగా తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది.
వ్యాసకర్త :
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
9908057980