KARGIL VIJAY DIWAS : కార్గిల్ విజయ దినోత్సవం

BIKKI NEWS (జూలై – 26) : కార్గిల్ విజయ దినోత్సవం (KARGIL VIJAY DIWAS) ప్రతి సంవత్సరం జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు.

◆ ఆపరేషన్ బదర్

1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలనే కుట్రతో పాకిస్తాన్ సైన్యం ‘ఆపరేషన్ బదర్’ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. అప్పటి భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండ ఉండేందుకు ప్రయత్నించింది. అయినా, పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదు.

◆ ఆపరేషన్ విజయ్

1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమయింది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ (operation Vijay) అనే కోడ్ నేమ్ ను పెట్టుకుంది. అంతటి చలిలో, మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజులపాటూ జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి, భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతిఏటా జూలై 26 కార్గిల్ విజయ దినోత్సవం జరుపబడుతుంది.