Home > 6 GUARANTEE SCHEMES > FREE CURRENT – ఉచిత విద్యుత్‌కు మార్గదర్శకాలు ఇవే

FREE CURRENT – ఉచిత విద్యుత్‌కు మార్గదర్శకాలు ఇవే

BIKKI NEWS (FEB. 28) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో గృహ కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేస్తామని ప్రకటించింది. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అర్హుల ఎంపికకు మార్గదర్శకాలతో (free current guidelines in telangana) కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. 200 యూనిట్ ల ఉచిత విద్యుత్ తో కనెక్షన్ కు 900/- వరకు గరిష్టంగా ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

★ FREE CURRENT GUIDELINES

దీని ప్రకారం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్‌కార్డు, ఆధార్‌, కరెంటు కనెక్షన్‌ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారు.

అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్‌ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీకల్లా ప్రభుత్వం రాయితీ పద్దు కింద డిస్కంలకు విడుదల చేస్తుంది.

ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందు వల్ల.. ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్‌ చట్టం కింద, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో విద్యుత్‌ శాఖ తెలిపింది.

★ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది

ఇప్పటివరకు దరఖాస్తు ఇవ్వనివారు తమ కరెంటు కనెక్షన్‌ ఉన్న ప్రాంతానికి చెందిన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) లేదా మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వవచ్చు. వారికి కార్యాలయాల్లో రసీదు ఇస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్‌ సిబ్బంది వెళ్లి.. రేషన్‌కార్డు, ఆధార్‌ వివరాలను తనిఖీ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు, రసీదులు అందజేయవచ్చు*

★ జీరో బిల్లుల జారీ తర్వాతే అర్హుల సంఖ్యపై స్పష్టత

ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం 81.54 లక్షల మంది దరఖాస్తులిచ్చారు. వీరిలో కొందరికి రేషన్‌కార్డులు లేకపోవడంతో వారి అర్జీలను పక్కనపెడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా.. వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తులిచ్చారు. వీటిలోనూ రేషన్‌కార్డుల వివరాలు లేనివి పెద్దసంఖ్యలో ఉన్నాయి. ఈ నెల(ఫిబ్రవరి)లో బిల్లు జారీ చేసినప్పటి నుంచి వచ్చే నెలలో బిల్లు జారీ చేసేనాటికి నెల రోజుల్లో 200 యూనిట్లలోపు వినియోగం ఉన్న అర్హుల ఇళ్లకు జీరో బిల్లు జారీ కానుంది. మార్చిలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇళ్లకు జీరో బిల్లులు రావచ్చని అనధికార అంచనా. వచ్చే నెల 1 నుంచి 20వ తేదీ వరకూ జీరో బిల్లులు జారీ అయిన తర్వాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి.