BIKKI NEWS (JAN. 22) : తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే రైతులకు 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీకి నిధులను విడుదల చేయాలని (farmers loan wave of in telangana up to 2 lakhs guidelines) ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా బ్యాంకుల నుంచి జాబితాలను సేకరిస్తున్నది. ఆర్థిక శాఖ నిధుల సమన్వయంపై లోతుగా అధ్యయనం ప్రారంభించింది. రైతు రుణాలకు చెందిన అసలు. వడ్డీ కలిపి రూ. 2 లక్షల వరకు మాఫీ చేయాలని, ఇందుకు 39 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని గుర్తించారు. వీరి రుణమాఫీకి రూ.40వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ భావిస్తున్నది.
ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం నిధుల విడుదలకు వీలుగా ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకుంటున్నది. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలనుంచి రుణగ్రహీతల జాబితాను ప్రభుత్వం సేకరించింది. గతంలో రుణాలు తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని వేచిచూసిన రైతులు వేలాదిమంది రెన్యూవల్ చేసుకోకపోవడంతో డీఫాల్టర్లుగా మారారు. వీరు కూడా ఇప్పుడు రుణమాఫీ ప్రకటనపై ఆశక్తితో ఎదురు చూస్తున్నారు.
★ కుటుంబం యూనిట్ గా రుణమాఫీ.!
ఈ దఫా రుణమాఫీకి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. రూ. 40వేల కోట్లను కొంతమేర తగ్గించుకునేందుకు కుటుంబ యూనిట్ గా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు కాని నేపథ్యంలో ఆర్ధిక శాఖ ఎటువంటి అబ్దిదారుల వివరాలను వెల్లడించడంలేదు. అధికారికంగా ప్రభుత్వం ఫైనల్ చేసి ఇచ్చిన జాబితా మేరకు నిధులను విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది.
తాజాగా రానున్న బడ్జెట్ లోపే రుణమాఫీ ప్రకటన చేసి జాబితాలను వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బ్యాంకర్లతో సంప్రదించి ప్రభుత్వమే రుణం తీసుకొని రైతుల రుణాలను తన పేరుపై బదలాయించుకోవాలని యోచిస్తోంది. బడ్జెట్ లో ఈ మొత్తాన్ని చూపి లాంగ్ టర్మ్ రుణాలుగా చూపే వెసులుబాటుపై ఆరా తీస్తోంది. మార్గదర్శకాల రూపకల్పనలో జాప్యం, బ్యాంకర్ల సమ్మతిలేని పక్షంలో బడ్జెట్ లో రుణమాఫీ పద్దును ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.
★ రుణమాఫీ కటాఫ్ తేదీ పై త్వరలోనే స్పష్టత
ఈ మేరకు అన్ని మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. మరోవైపు రుణమాఫీకి కటాఫ్ తేదీపై కూడా భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తేదీని లేకపోతే హామీనిచ్చిన తేదీని కటాఫ్ తేదీగా తీసుకోవాలా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా వీలైనంత త్వరగా రైతు రుణమాఫీ అంశాన్ని ముగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేయాలని ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఇప్పటినుంచే నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది.
పెండింగ్ లో ఉన్న 4.78లక్షల బిల్లుల చెల్లింపు కూడా కష్టసాధ్యంగా మారింది. ఇందుకు రూ.40,154 కోట్లు అవసరం కానున్నాయి. వీటిని ఇప్పటికిప్పుడు చెల్లించొద్దని ఆర్ధిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో కొంత సమయం చిక్కనుంది. అప్పుల పరిమితి కూడా ప్రస్తుత ఆర్థిక ఏడాది ముగియడంతో కొత్త అప్పులకు వీలు లేకుండా పోయింది. అదేవిధంగా భూముల విక్రయాలు, ఓఆర్ఆర్ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 26 వేలకోట్లు గత ప్రభుత్వం ప్రభుత్వమే ఖర్చు చేసింది. మద్యం లైసెన్సుల జారీతో రూ.4వేల కోట్లు ఇప్పటికే వ్యయం చేశారు. దీంతో ఈ ఆర్ధిక ఏడాది ఆదాయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా కొత్త పథకాలు, రైతు బంధు చెల్లింపుల వంటివి ఆలస్యమవుతున్నాయి. దీంతో రుణమాఫీ నిధుల సమీకరణకు ఆర్ధిక శాఖ ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగుతోంది. నిధుల సాధనకు వీలున్న అన్ని మార్గాలను పరిశీలిస్తోంది.