తెలంగాణోదయం – కాళేశ్వర ఫలాల పై కవితా మాలిక – అస్నాల శ్రీనివాస్BIKKI NEWS ::అరవై సంవత్సరాల అలసత్వమును
అంతులేని అరిగోసలను
నిరంకుశ సింహాసనాలను
ఋతువులన్ని ఆలపిస్తున్న శిశిర రాగాలను
అలలు అలలై ఎగిసిన జన యుద్ధ ఉప్పెనై ఊడ్చిపెట్టింది.

కాస్తా ఆలస్యమైనా వసంతం నిండుగానే వచ్చింది
కమ్ముకున్న విషాదాన్ని కమనీయంగా మార్చింది
యుగ యుగాల సమర స్పందనలు
అసమాన అమర నక్షత్ర రాశులన్నీ ప్రోది అయ్యి
పూల మేఘాలను వర్షింపచేసాయి

పూరెక్కల ఒంపులో పొగులుకున్న అశ్రుకణాలను
రక్తంతో తడిసిన మాగాణమంతా వెదజల్లాయి
అవి రమణీయ అమృత కొలనులుగా మారాయి
మొలకెత్తే విత్తులులేని దున్నిన దుక్కుల
తలరాత మారింది
నెర్రలుబారిన నేలలకు తనివితీరా నీల్లుతాపింది.

చీకటి వెలుగుల ప్రయాణంలో
రాళ్లు రప్పలు ముళ్ళపొదల గాయాల దారులను
ముద్దాడుతూ మాన్పుతున్నది
కారుణ్య కాళేశ్వరంగా మారి
తెలంగాణ కంఠాభరణం అయ్యింది

అమరుల ఆకాంక్షల విత్తులను పిడికిళ్లలో పట్టుకుని
మట్టి ఉన్న ప్రతి తావులో నాటుతున్నది
ఉపేక్షలేని చంద్ర వంకలతో కలుపు మొక్కలను ఏరివేస్తున్నది
ఇప్పుడది బంగారు గడ్డి వాసనలను దేశమంతా వెదజల్లుతున్నది

మేఘాలకు కూడా బంగారు రంగు పూస్తున్నది
విత్తన కోశాగారంగా విరాజిల్లుతున్నది
ఇంద్ర ధనస్సునే వస్త్రంగా చుట్టుకున్నది
కర్కశ కరోనా విలయంలో పునర్మిర్మాణం లో
బాగస్వాములైన తన బిడ్డలతో పాటు
రెక్కలు ఆగిన వలస పక్షులను
గుండెకు హత్తుకుంటున్నది
శ్రమే జాతికి సంపదంటూ
శ్రమే రాష్ట్రానికి భాగ్యమంటూ
కవి హాలిక హృదయ వారసత్వం నాదంటున్నది.

అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం