ఆధునిక భారత మూల స్థంభం-అంబేద్కర్ (ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ) – అస్నాల శ్రీనివాస్

BIKKI NEWS : భారతదేశంలోని అత్యంత పురోగామి ఆలోచనాపరులలో అగ్రగణ్యుడు మానవతావాది, పండితుడు, న్యాయవాది, ఆర్థికవేత్త, విద్యావేత్త, పాలనాదక్షుడు, చరిత్రకారుడు, తాత్వికుడు, మానవతావాది ఐన అంబేద్కర్‌ జయంతిని (AMBEDKAR JAYANTI) ప్రపంచమంత ఘనంగా నిర్వహించుకోబోతున్నది.

బాబాసాహెబ్‌ అని దీనజనులు ప్రేమగా పిలుచుకునే ‌భీంరావ్ అంబేద్కర్‌ 1891, ఏఫ్రిల్‌ 14న మహారాష్ట్రలోని మౌ ప్రాంతంలో రాంజీ, భీమాబాయ్‌ దంపతులకు జన్మించాడు. సాధుసంతులు, తత్వవేత్తలు, సామాజిక ఆలోచనాపరులు, సంస్కర్తలకు పుట్టినిల్లు మరాఠ సీమలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహారాష్ట్ర ఖ్యాతిని ద్విగుణికృతం చేయడమే కాకుండా, దేశ ఉన్నతికి కూడా వారంతా కృషి చేసినారు. అటువంటి ధన్యజీవుల వారసత్వాన్ని చిరుప్రాయంలోనే స్వీకరించి, అత్యంత కష్టభూయిష్టమైన వివక్షతల, అవరోధాల మధ్య, ఏటికి ఎదురీదుతూ కఠినమైన శారీరక, మేధోపరిశ్రమతో, సంఘర్షణాత్మక దృక్ఫదంతో ,పీడిత ప్రజలకు విముక్తి మార్గాన్ని ప్రసాదించాడు. సమానత్వం తో కూడిన సామాజిక విప్లవాన్ని గొప్ప ముందడుగు వేయించాడు. ఆధునిక భారతంలో జరిగిన రాజకీయ సామాజిక, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు తేవడంలో ఆసాధారణమైన కృషి చేశాడు.

అంబేద్కర్‌ రాజ్యంగ నిర్మాతగా అణగారిన వర్గాలు, మహిళా విముక్తి ప్రధాతగా ప్రాచుర్యం పొందాడు. ఇదే సమయంలో భారత వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి లోతైన అధ్యయనంతో విలువైన సూచనలు చేసి, ఆర్థిక వ్యవస్థ కు బలమైన పునాదులను ఏర్పరిచారు. సామాజిక అభివృద్ధికి భూసంస్కరణల అమలు అవశ్యకమైనదిగా భావించాడు. పెట్టుబడిదారి వ్యవస్థ సృష్టించే అసమానతలు, మానవ మర్యాదకు రాజ్యాంగ ఔన్నత్యానికి ప్రమాదకరమని తెలియజేశాడు. 1915లో ప్రాచీన భారత వాణిజ్యం, బ్రిటిష్‌ ఇండియాలో ప్రాంతీయ ఆర్ధిక వికాసంలపై పరిశోధనలను చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం లో డాక్టరేట్‌ అందుకున్నాడు. 1921 లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ”ప్రొవిన్షియల్‌ ది సెంట్రలైజెషన్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా”, రూపాయి సమస్యల పై పరిశోధన పత్రాలను సమర్పించి, డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ పట్టాను పొందాడు. భారత కరెన్సీ, బ్యాంకింగ్‌ చరిత్ర పై వివరణాత్మక పుస్తకాలను వ్రాశాడు. వీటిలో బ్రిటిష్‌ సామాజ్రవాద ఆర్ధిక విధానాలను విమర్శిస్తూ వాటి వలన ఇండియాలో ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయని, భూమి శిస్తు అధికంగా ఉండి, రైతుల పై పెనుభారాన్ని కలిగిస్తుందని అన్నాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అధికారులు, వ్యాపారుల పై ఏలాంటి పన్నులు వసూలు చేయడం లేదని, ప్రభుత్వ రాబడులలో 80% రక్షణ, న్యాయ పాలన పై వ్యయం చేస్తున్నారని ప్రజల ప్రగతికి తొడ్పడే మౌళిక రంగాలైన విద్య, వైద్యం, నీటిపారుదల, రహదారులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అర్ధశాస్త్ర ఆచార్యుడిగా బోంబాయిలోని ఎల్ఫిన్ స్టన్ కళాశాలలో ,బెనారస్ హిందు కళాశాలలో పనిచేసాడు .

మన దేశ వ్యవసాయ రంగంలో చిన్న కమతాల వలన వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంటుందని, దానికి పరిష్కారం కమతాల సమీకరణ అనే వాదాన్ని తోసిపుచ్చాడు. 1928లో అంబేద్కర్‌ ”ఇండియాలో చిన్న కమతాలు – పరిష్కారాలు” అనే రచనలో పెట్టుబడి, ఉత్పత్తి సాధనాలను సరైన పాళ్ళలో ఉపయోగిస్తే గరిష్ఠ ప్రతి upఫలం, రాబడి ఉంటాయన్నారు. పెట్టుబడులకు మించిన రాబడులు వస్తే, అది లాభాసాటి కమతం అవుతుందని చెప్పాడు. అక్టోబర్‌ 10, 1927లో బొంబాయి శాసనమండలిలో మాట్లాడుతూ భారతదేశంలో సాధారణ జీవన ప్రమాణాన్ని పెంచాలంటే వ్యవసాయంగా నుండి కొంత మంది శ్రామికులను పరిశ్రమల వైపు మళ్ళించాలని సూచించాడు. ఫలితంగా ఈ రెండు రంగాలలో అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. దీని కొరకు ”స్టేట్‌ సోషలిజం”ను ప్రతిపాదించాడు. భూమిని ప్రభుత్వ యజమాన్యంలో ఉంచి సమిష్టి, సహకార వ్యవసాయ పద్దతిని అనుసరించాలి. వ్యవసాయానికి పరిశ్రమలకు కావల్సిన మూలధనాన్ని ప్రభుత్వము సమకూర్చాలి. దీని వల్ల నిరుపేదలకు ఉపాధి భద్రత, కనీస ఆదాయాలు లభించి గ్రామీణ పేదరికం, సంపద మరియు ఆదాయాల పంపిణిలో అసమానతల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందన్నాడు.

కీలక, మౌళిక పరిశ్రమలన్ని ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలని ప్రతిపాదించాడు. భీమారంగం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండి ప్రతి పౌరునికి ఆదాయానికి తగిన జీవిత భీమా చేయించాలని, సూచించాడు.

జర్మన్‌ తత్వవేత్త పెర్డినాండ్‌ లాసెల్లే ప్రతిపాదించిన స్టేట్‌ సోషలిజం నమూనా బీదలు ఎక్కువగా ఉన్న మన దేశంలో సమానత్వం, సామాజిక భద్రతకు దోహదం చేస్తుందని భావించాడు. ఈ భావనను తనదైన శైలిలో విస్తరిస్తూ ”స్టేట్స్‌ అండ్‌ మైనారిటిస్‌” అనే రచనను 1947లో రాజ్యంగ పరిషత్తుకు మెమోరాండంగా సమర్పించాడు. కీలక, మౌళిక పరిశ్రమలన్ని ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలని ప్రతిపాదించాడు. భీమారంగం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండి ప్రతి పౌరునికి ఆదాయానికి తగిన జీవిత భీమా చేయించాలని, సూచించాడు. పరిశ్రమలను రాజ్యం నిర్వహించినప్పుడు వచ్చే మిగులును మళ్ళీ ప్రజల ప్రయొజనాలకు అనుగునంగా ఉపయోగిస్తుంది . పెట్టుబడిదారి తనానికి లాభం తప్ప మానవముఖం ఉండదని తెలియచేసాడు . తీవ్రమైన పేదరికాన్ని అంతమొందించాలని అప్పుడే సాంఘీక భద్రత చర్యలు అమలుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డాడు. వ్యవసాయం పైన ఆధారపడిన జనాభాకు భద్రత అత్యంత అవసరమని గుర్తిస్తూ, పంటల భీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి, తద్వారా మనదేశంలోని గ్రామీణ ప్రజల బ్రతుకులను మెరుగుపరచడంలో, కరువు కాటకాల భయానక పరిస్థితులను తగ్గించడంలో ప్రగతి సాధించవచ్చునని తెలియజేశాడు. భూసేకరణలో నష్టపరిహారాన్ని చాలా ఉదారంగా చెల్లించాలని ప్రతిపాదించాడు. ప్రవేట్‌ వ్యక్తుల ఆధీనంలో వున్న పరిశ్రమలు, భీమా సంస్థలు, మరియు వ్యవసాయ భూముల యాజమాన్య హక్కులను ప్రభుత్వం స్వీకరించి, వారికి నష్టపరిహారాన్ని డిబెంచర్ల రూపంగా చెల్లించాలని ప్రతిపాదించాడు. సమిష్టి వ్యవసాయం ద్వారానే అణగారిన, అస్పృశ్య వర్గాల శ్రామికులకు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నాడు. అప్పుడే ప్రతి వ్యక్తికి ఒకే విలువ అను ప్రజాస్వామ్య సూత్రం అర్థవంతమవుతుందని చెప్పినాడు.

ప్రతి వ్యక్తి తనకు వచ్చిన పనిని చేసుకోవచ్చు.కానీ అదే సమయంలో ప్రైవేట్‌ వ్యక్తులకు ఇతరులను పాలించే, పెత్తనం చెలాయించే అధికారాలను కట్టబెట్టకూడదని చెప్పాడు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు ఉండే స్వేచ్ఛ , అమానవీయ, ఆధిపత్య దోపిడి హింసలకు దారి తీస్తుందని హెచ్చరించాడు అంబెడ్కర్

అంబేద్కర్‌ ”స్టేట్‌ సోషలిజం”ను రాజ్యాంగ చట్టంగా రూపొందించాలని, ప్రాథమిక హక్కులలో చేర్చాలని ప్రయత్నం చేసాడు. ఈ ప్రతిపాదనలను రాజ్యాంగపరిషత్‌ సంపూర్ణంగా అంగీకరించలేదు. దీనికి అంబేద్కర్‌ స్పందిస్తూ రాజ్యంగ బద్ద హక్కులతో ప్రతి వ్యక్తి తనకు వచ్చిన పనిని చేసుకోవచ్చు.కానీ అదే సమయంలో ప్రైవేట్‌ వ్యక్తులకు ఇతరులను పాలించే, పెత్తనం చెలాయించే అధికారాలను కట్టబెట్టకూడదని చెప్పాడు. భూస్వాములకు, పెట్టుబడిదారులకు ఉండే స్వేచ్ఛ , అమానవీయ, ఆధిపత్య దోపిడి హింసలకు దారి తీస్తుందని హెచ్చరించాడు. అంబేద్కర్‌ తన సమశీల వాదనలతో ఉపాధి హక్కు, విద్య, ఆరోగ్య హక్కు, ఆర్ధిక వనరులలో భాగానికి హక్కు, విద్య, ఆరోగ్య హక్కు, సంపద సమాన పంపిణి వంటి ఆంశాలు ఆదేశిక సూత్రాలలో చేర్చబడ్డాయి. అయితే యివి రాజ్య వ్యవస్థకు మార్గదర్శక సూత్రాలేగాని, తప్పనిసరిగా అమలు పరచవల్సినవి కావు. సామాజిక ఆర్ధికాభివృద్ధి అంశాలలో అంబేద్కర్‌ ఆలోచనలను సోషలిస్టు దృక్పథం ఉన్న నెహ్రూ తన హయాములో వీలైనంత వరకు అమలు పరిచాడు. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్యం నిర్వహణ, భూసంస్కరణలు అమలు, రవాణా, శక్తి, ఇంధనం, గనులు, రక్షణ రంగాలలో ప్రభుత్వ రంగంలోనే భారీగా పరిశ్రమలు స్థాపించడం చేసాడు. ప్రైవేట్‌ పరిశ్రమలు, వ్యాపార సంస్థల పై గుత్తాధిపత్యం నియంత్రించే చట్టాలను రూపొందించాడు.

1990 నుండి పాలకులు అమలు జరుపుతున్న నవ్య ఉదారవాద పెట్టుబడిదారి సంస్కరణ విధానాలు రాజ్యాంగములో ఉన్న అనేక సామాజిక, ఆర్థిక హక్కులను, ప్రజాస్వామ్యవ్యవస్థలను నిర్వీర్యం చేసాయి. బి.జె.పి. ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి దీనిని సూపర్‌ సోనిక్‌ వేగంతో అమలు చేస్తున్నది. సంక్షేమ రాజ్య, సామాజిక భద్రతతో స్థాపించబడిన ప్రభుత్వ యాజమాన్య పరిశ్రమల నుండి పెట్టుబడులను ఉపసంహరణ కోసం రాజ్యంగా దార్శనికతకు విరుద్ధంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత బి.జె.పి. కే దక్కింది.ఇప్పుడు మొత్తం అమ్మకానికే పెట్టింది.కార్పొరేట్ సంస్థలకు లక్షలాది రూపాయల పన్ను రాయితీలను ఇస్తున్నది.ఈ సంస్థలు సామాజిక బాధ్యతలలో అధమంగా ఉంటున్నాయి.

ప్రస్తుతం కరోనా మాహమ్మారి సమయంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఉన్న దేశాలు నియంత్రణలో మెరుగ్గా ఉన్నాయి. మోడి అనుసరిస్తున్న తప్పుల తడకల రాజకీయ ఆర్థిక విధానాలు ఆర్ధిక నేరస్థులకు ఫలవంతమైన మార్గాన్ని ఏర్పాటు చేసింది. రిజర్వు బ్యాంకుతో సహా ఇతర జాతీయ బ్యాంకుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 10 శాతంగా ఉన్న ధనవంతుల ఆదాయాన్ని అనుహ్యంగా అనేక వేల రేట్లు పెంచింది. ఉద్యోగ కల్పనలో తీవ్ర వైఫల్యం చెందింది. 2017-18లో గత 45 సంవత్సరాలలో ఎన్నడు లేన్నంతగా అత్యధిక నిరుద్యోగ రేటు నమోదు అయ్యింది.

సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెషన్‌ 2020 నివేదిక ప్రకారం దేశంలో ఒక శాతం జనాభా అధీనంలో 50శాతం సంపద కేంద్రీకృతమైనదని, 10 శాతం జనాభా 3/4 వంతు సంపదను అనుభవిస్తునదని పేర్కొన్నది.

వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, సామాజిక భద్రత, విద్య, ఆరోగ్యం, ఆహారభద్రత రంగాలు తక్కువ కేటాయింపులతో నిర్లక్ష్యానికి గురైనాయి. అనేక పంటలకు కనీసం మద్దతు ధర ప్రకటించకపోవడం, ప్రకటించిన పంటలను సేకరణలో వైఫల్యంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూడుకపోయినది.ఇప్పుడు ప్రజా ,రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలతో చావు దెబ్బ తీయడానికి రంగం సిద్ధమైంది. నోట్ల రద్దు చర్యతో వ్యవసాయం పై ఆధారపడిన అనేక జీవితాలు, అసంఘటిత రంగంలోని శ్రామికుల జీవితాలు తీవ్ర కల్లోలానికి లోనైనాయి. ప్రవేటీకరణ, సరళీకరణ ప్రపంచీకరణ విధానాలతో రాజ్యం సంక్షేమ రంగాలను నిర్లక్ష్యం చేయడం, ప్రభుత్వ పరిశ్రమలను అమ్మడం, స్వదేశి, విదేశి పెట్టుబడుల పై నియంత్రణ ఎత్తివేయడం, అన్ని రకాల అనుమతులను, మినహాయింపులను సులువుగా ఇవ్వడంతో సాధారణ ప్రజల జీవనం వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెషన్‌ 2020 నివేదిక ప్రకారం దేశంలో ఒక శాతం జనాభా అధీనంలో 50శాతం సంపద కేంద్రీకృతమైనదని, 10 శాతం జనాభా 3/4 వంతు సంపదను అనుభవిస్తునదని పేర్కొన్నది. స్వయం ప్రతిపత్తి గల గణాంక సంస్థలను ప్రభావితం చేస్తూ తప్పుడు లెక్కలతో ఆర్థిక వృద్ధి రేటును ఎక్కువగా చేసి చూపెడుతుంది. కావున పెరుగుదల రేటు ఒక డొల్ల తనంగా నిరూపితమైనది. ఆర్థిక వ్యత్యాసాలు కని విని ఎరగని స్థాయిలో విస్తరిస్తున్నాయి.

డా|| అంబేద్కర్‌ ప్రతి చోట పిడుగులు కురిపించాడు, తన ప్రజల ఉద్దారకుడిగా కీర్తించబడ్డాడు. భూగర్భం నుంచి పైకెగిసి భూమినే అంటిపెట్టుకున్న మనిషి, అసాధారణ శక్తి, అద్భుత వివేకం, కార్యదీక్ష, ధైర్యం ఆయన్ను భారత దేశానికి నిజమైన నాయకుడిగా నిలిపాయి.

ఈ నేపధ్యంలో అంబేద్కర్‌ ప్రవచించిన విద్య వైద్యం వనరులు ఆధీనంలోకి ఉంచుకునే స్టేట్‌ సోషలిజం, ఆర్థికాభివృద్ధి భావనలకు మరింత ప్రాసంగికత ఏర్పడింది. రోజు రోజుకు పెరుగుతున్న సాంఘీక రాజకీయ ఆర్థిక అసమానతలను తొలగించడానికి ప్రజలను దారిద్య్రం నుండి ఆర్థిక దోపిడి నుండి అంబేద్కర్‌ సూచించిన సంక్షేమ రాజ్య విధానాలు దీపస్థంభంగా ఉపయోగించడానికి ప్రజా ఉద్యమాల నిర్మాణం వైపు పౌర సమాజం కదలాలి. 26 జనవరి, 1950న అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో ”సామాజిక ఆర్థిక జీవనంలో సమానత్వాన్ని నిరాకరించడాన్ని మనం ఎక్కువ కాలం కొనసాగించినట్లైతే మన రాజకీయ ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుంది. ఈ పరస్పర వైరుద్దాన్ని మనం వీలైనంత త్వరగా తొలగించాలి. లేకున్నట్లైతే ఈ రాజ్యాంగ సభ ఎంతగానో శ్రమించి, నిర్మించినటువంటి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానత్వం వల్ల బాధపడే వారు తుత్తునియలు చేస్తారాని నొక్కి చెప్పారు”. జోకింఅల్వా అను జర్నలిస్టు బాబా సాహెబ్‌ గురించి ”డా|| అంబేద్కర్‌ ప్రతి చోట పిడుగులు కురిపించాడు, తన ప్రజల ఉద్దారకుడిగా కీర్తించబడ్డాడు. భూగర్భం నుంచి పైకెగిసి భూమినే అంటిపెట్టుకున్న మనిషి, అసాధారణ శక్తి, అద్భుత వివేకం, కార్యదీక్ష, ధైర్యం ఆయన్ను భారత దేశానికి నిజమైన నాయకుడిగా నిలిపాయి” అని పేర్కొన్నాడు. స్వాతంత్య్రోదమ ప్రజల, నాయకుల అకాంక్షలు, సాంఘీక ఆర్థిక విప్లవకారుడు అంబేద్కర్‌ పోరాట ఫలితాలను అనుభవిస్తున్న బహుజన సమాజం, మహిళలు ఆయన ఆరంభించిన, అనేక వేల అడుగులను ముందంజ వేయించిన సామాజిక విప్లవాన్ని కొనసాగించడానికి, ప్రతిన పూని బాధ్యతతో పని చేయాలి. ”సమాజానికి తిరిగి చెల్లించు”అనే భావన ను ఆచరించడంలో అగ్రగామిగా పనిచేయటమే భారతదేశం లో పుష్పించిన సుందర మానవతా మందారం ఐన మన అంబేద్కర్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి.

వ్యాసకర్త :: అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
9652275560