సివిక్స్ డిజిటల్ రథసారథులు అనిల్ రెడ్డి, శంకర్ రెడ్డిలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 30) : కరోనా కాలంలో భౌతిక తరగతులకు దూరమైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులలో పౌరశాస్త్రం తరగతులను కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అనిల్ రెడ్డి, మారేడుపల్లి జూనియర్ కళాశాలకు చెందిన శంకర్ రెడ్డిలు తమ భుజస్కందాలపై వేసుకొని పూర్తి పాఠాలను డిజిటల్ విధానంలో బోధించి శభాష్ అనిపించుకున్నారు.

ఈ సందర్భంగా గురువారం ఎస్సీఆర్టీలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్‌ హైదరాబాద్ డిఐఓ వడ్డెన్న ల సమక్షంలో అభినందనలు ప్రశంసా పత్రాలను అందుకున్నారు.

డిజిటల్ బోధన అనుభవం లేకపోయినా తమదైన శైలిలో నూతన వరవడితో నూతన పద్ధతులతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ బోధన చేపట్టి ఇంటర్ బోర్డు పెద్దల మన్ననలు అందుకున్నారు. ప్రతిరోజు లక్షలాదిమంది విద్యార్థులను టీవీల ముందు కూర్చోబెట్టేలా అర్థవంతమైన, ఆకర్షణీయంగా విద్య బోధన గావించారు.

ఈ సందర్భంగా కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల పౌర శాస్త్ర అధ్యాపకుడు అనిల్ రెడ్డి మాట్లాడుతూ… అంధత్వము ఉన్నప్పటికీ డిజిటల్ బోధనలో తనదైన మార్కును వేసుకోవాలని, విద్యార్థులకు కరోనా కాలంలో ఉపయోగపడాలనే తపనతో వచ్చిన అవకాశాన్ని సంతోషంగా నిర్వహించనాని పేర్కొంటు.. ఈ అవకాశం కల్పించిన ఇంటర్మీడియట్ కమిషనర్, కళాశాల ప్రిన్సిపాల్ లకు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పౌరశాస్త్రం అధ్యాపకుడు శంకర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ బోధన కొత్త అయినప్పటికీ చాలెంజింగ్ గా తీసుకొని పాఠాలను సులభరీతిలో బోధించడానికి ప్రయత్నించి సఫలీకృతమయ్యానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, కళాశాల ప్రిన్సిపాల్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.