SUPREME COURT : అన్ని కులాల వారూ అర్చకులుకావొచ్చు

న్యూఢిల్లీ (ఆగస్టు – 23) : ఆగమశాస్త్ర నియమాల ప్రకారం
అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చని (All castes can become priests says Supreme Court) సుప్రీంకోర్టు సేలం సుగవనేశ్వరర్ స్వామి ఆలయం కేసులో స్పష్టం చేసింది. అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చన్న మద్రాసు హైకోర్టువఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది. ఆగమ నియమాల ప్రకారం ఉత్తీర్ణత సాధించి తగిన శిక్షణ, పూజ చేయడానికి అర్హత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తెలిపింది. సుబ్రమణియ గురుకల్ పిటిషన్ ను కొట్టివేసింది.

◆ కేసు పుర్వాపరాలు

అర్చకుల నియామకానికి ఆలయ నిర్వాహకులు దరఖాస్తులు కోరుతూ 2018 జనవరిలో ప్రకటన ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా లేదని అర్చకుడు ముత్తు సుబ్రమణియ గురుకల్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీన్ని విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఆలయ ఆగమ నియమాలు, పూజా విధానాల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పునే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది. దీనిపై సుబ్రమణియ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం సుబ్రమణియ గురుకల్ పిటిషన్ ను కొట్టివేసింది.