Home > TODAY IN HISTORY > ఆపరేషన్ పోలో నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు – కొల్లు శ్రీనివాస్ వ్యాసం

ఆపరేషన్ పోలో నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు – కొల్లు శ్రీనివాస్ వ్యాసం

  • జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కొల్లు శ్రీనివాస్ ప్రత్యేక వ్యాసం

వ్యాసకర్త : కొల్లు శ్రీనివాస్, అధ్యాపకులు, సూర్యాపేట – 8008944045

BIKKI NEWS : వందల ఏండ్ల పరాయి పాలనకు చరమగీతం పాడుతూ భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు 1947 ఆగస్టు 15. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో రెండు రాజకీయ విభాగాలు ఉండేవి. అవి 1. బ్రిటిష్ ప్రావిన్సులు (బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉన్నవి) 2. స్వదేశీ సంస్థానాలు (స్వదేశీ రాజుల పాలనలో ఉండి బ్రిటిష్ సర్వసమున్నతాధికారం, ఆధిక్యత కింద ఉన్నవి) భారత స్వాతంత్య్ర చట్టం 1947 ప్రకారం భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర మరియు ప్రత్యేక డొమినియన్లు ఏర్పడ్డాయి. ఈ సందర్భంలో బ్రిటీష్ ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ స్వదేశీ సంస్థానాల విషయంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున భారత స్వాతంత్య్ర చట్టం 1947 లో స్వదేశీ సంస్థానాలకు మూడు అభిమతాలు ఇవ్వడం జరిగింది. అవి 1. భారతదేశంలో చేరటం 2. పాకిస్తాన్ లో చేరటం లేదా 3. స్వతంత్రంగా ఉండటం. భారత భూభాగంలోని 563 స్వదేశీ సంస్థానాలలో 560 సంస్థానాలు భారత యూనియన్ లో చేరాయి మిగతా మూడు (జమ్మూకాశ్మీర్, జూనాఘర్, హైదరాబాద్) భారత యూనియన్ లో చేరడానికి నిరాకరించాయి. భారత దేశాన్ని ఐక్యం చేసేందుకు నాటి కేంద్ర హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ ఆయన కార్యదర్శి వి.పి. మీనన్, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ ల కృషి వలన దేశంలోని వివిధ సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేయబడ్డాయి. అయితే ఏ యూనియన్ లోనూ చేరని మూడు సంస్థానాలలో ఒకటైన జమ్మూకాశ్మీర్ “ విలీన ఒప్పందం” ద్వారా భారతదేశంలో చేరింది. ఇక జూనాఘర్ సంస్థానం “ ప్రజాభిప్రాయ సేకరణ ” ద్వారా భారత భూభాగంలో కలిసిపోయింది.

★ హైదరాబాద్ సంస్థానం – విలీన ప్రక్రియ.

దక్షిణ భారతదేశంలోని మధ్యభాగంలో అనగా దక్కన్ పీఠభూమిలో సుమారు 8 వేల 300 చదరపు మైళ్ళ విస్థీర్ణం కలిగి రెండు శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిన హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజ్యం అంటారు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం మొత్తం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా నిజాం పాలన క్రింద ఉండేది. ఈ రాజ్య మూలపురుషుడు నిజాం-ఉల్-ముల్క్. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో మొగల్ సుబేదార్ అయిన నిజాం ఉల్ ముల్క్ 1724 సంవత్సరంలో దక్కన్ లో స్వతంత్రత ప్రకటించుకొని 1948 వరకు మొత్తం ఏడు మంది నిజాం లు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో ఉన్న అన్ని సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం అతిపెద్దది మరియు అత్యంత సంపన్నమైనది. సొంత పతాకం, సొంత కరెన్సీ, నాణేలు, తపాలా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ కలిగిన సంస్థానం ఈ హైదరాబాద్ సంస్థానం. 1947 ఆగస్టులో దేశానికి స్వతంత్రం రాగానే హైదరాబాద్ నిజాం హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకొనే ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఐక్యరాజ్యసమితికి కూడా ఒక బృందాన్ని పంపించి భారతదేశంపై ఫిర్యాదు చేశాడు. భారత ప్రభుత్వానికి నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారతదేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు అయితే వాస్తవ పరిస్థితిని నిజాముకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి 1947 నవంబర్ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్ గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. 1948 ఆగష్టు 9 న టైమ్స్ ఆఫ్ లండన్ లో వచ్చిన వార్తా కథనం ప్రకారం హైదరాబాదు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. హైదరాబాద్ ప్రధానమంత్రి లాయక్ అలీ ఇలా అన్నాడు “భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్షమందితో సైన్యం సిద్ధంగా ఉంది, బొంబాయి మీదకు బాంబులు వేయడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉంది”. అని… నిజాం చేపట్టిన చర్యలకు తోడు రజాకార్ల హింస హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి “ఆపరేషన్ పోలో” గా నామకరణం చేశారు. ఈ పోలీసు చర్యను “గోడ్డాన్ ప్లాన్” అని కూడా అంటారు. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ రాజ్యంపై భారత సైన్యాలు మేజర్ జనరల్ జయంత్ నాద్ చౌదరి (J.N. చౌదరీ) నాయకత్వంలో పోలీస్ చర్య ప్రారంభించాయి. షోలాపూర్ నుండి బయలుదేరిన సైన్యానికి జె.ఎన్.చౌదరి, బొంబాయి నుండి బయలుదేరిన విభాగానికి ఏ.వి. రుద్ర, బేరార్ దళానికి బ్రిగేడియర్ శివతత్వ సింగ్ నాయకత్వం వహించారు. 1948 సెప్టెంబర్ 17న భారత సేనలు పురోగమిస్తున్నాయనే వార్త వినగానే “మరుదు” లో మకాం వేసిన నిజాం సేనలు లాతూరు, ఔరంగాబాద్, షోలాపూర్ వైపు చెల్లాచెదురై పారిపోయాయి. 1948 సెప్టెంబర్ 16వ తేదీన రోడ్డు రైలు కూడలి అయిన జహీరాబాద్ పట్టణం భారత సైన్యం వశమైంది. అదేరోజు పర్భిని జిల్లాలోని హింగోలి కి భారత సైన్యాలు చేరుకున్నాయి. దీంతో నిజాం సేనలు పారిపోగా ప్రజలు హర్షధ్వానాలతో భారత సైన్యాలకు ఆహ్వానం పలికాయి. 1948 సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పథకాలను నిజాముకు అప్పగించింది. నిజాం సేనలకు కమాండర్ మేజర్ జనరల్ అహ్మద్ ఆల్ ఇద్రుస్ లాంచన పూర్వకంగా అసఫ్ జాహీ పతాకాన్ని అవనతం చేసి తమ లొంగుబాటును ప్రకటించాడు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం దక్కన్ రేడియో ద్వారా భారత సైన్యాలకు నిజాం లొంగిపోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేశాడు. దాంతో హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ ప్రాంతం) భారత యూనియన్ లో విలీనం అయిన చివరి సంస్థానంగా గుర్తించబడింది.

★ సైనిక పాలన :

హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో కలిసిన అనంతరం హైదరాబాదులో జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో మిలటరీ పాలన మొదలైంది. 1949 ఫిబ్రవరి 6న J. N చౌదరి జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం నిజాం సొంత ఆస్తి “ సర్ఫ్ ఎ ఖాస్ ” ను వాడుకోవాల్సి వచ్చింది. నిజాం కరెన్సీ హోలీ సిక్క కుడా రద్దు అయింది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం శుక్రవారం స్థానంలో ఆదివారం అయింది. J. N చౌదరి మిలటరీ గవర్నర్ గా నియమితులైనా కూడా న్యాయ సూత్రాల రీత్యా చట్టరీత్యా నిజాం నవాబు అధినేతగా కొనసాగుతాడు. మిలటరీ గవర్నర్ తీసుకునే నిర్ణయాలపై ఫార్మాన రాజముద్ర వేయాల్సింది నిజాం నవాబే. ఆ తరువాత 1949 డిసెంబర్ 1న జె. ఎన్. చౌదరి మిలటరీ పాలన రద్దయింది.

★ పౌర ప్రభుత్వం ఏర్పాటు.

1950 జనవరి 26న మిలటరీ పాలన స్థానంలో ఎం.కె. వెల్లోడి అనే సీనియర్ ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిజామును రాజ్ ప్రముఖ్ గా ప్రకటించారు. ఈ పదవిలో నిజాం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడేంత వరకు కొనసాగి ఆ తరువాత పదవీ విరమణ చేశాడు. అంతకు ముందు నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ కు భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మధ్య జరిగిన చర్చలు ఫలితంగా 1950 జనవరి 25 న నిజాంకు భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్ భారత యూనియన్ లో ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలకు కలవు (తెలంగాణ 8, మరాఠా 5, కన్నడ 3). హైదరాబాద్ శాసనసభలో 175 స్థానాలకు 1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా మొదటి మరియు చివరి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడగా తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు.

◆ 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత క్రమక్రమంగా తెలంగాణ ప్రజలలో ఆంధ్రుల పరిపాలన పట్ల అసంతృప్తి మొదలైంది. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలు తుంగలో తొక్కి సీమాంధ్రులు తమ విద్యా ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్నారని విమర్శించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 1956 లో సీమాంధ్ర నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి ఆంధ్ర విద్యార్థులకు ఉద్యోగులకు తమ 12 సంవత్సరాల స్థానికత అనేది 1968లో ముగియడంతో వారికి ముల్కి అనగా స్థానికత హోదా లభించినట్లయింది దీంతో కలవర పడిన తెలంగాణ ఉద్యోగులు విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇలాంటి ఒక సంఘటన తొలిగా ఖమ్మం జిల్లాలోని పాల్వంచ లో వెలుగు చూసింది. 1969 జనవరి 5న కేటీపీఎస్ లోని ముల్కీ ఉద్యోగులందరినీ తొలగించి వారి స్థానంలో స్థానికులను నియమించాలని ఉద్యమం జరిగింది. అదేరోజు కార్మిక నాయకుడైన కృష్ణ నిరాహార దీక్ష చేశాడు. ఆ తర్వాత విద్యార్థి నాయకుడు అయినటువంటి రవీంద్రనాథ్ 1969 జనవరి 8న తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చర్యల ఫలితంగా జనవరి 22న ఈ దీక్షను విరమింప చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 1969 జనవరి 12న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి.

నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని 1969 జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి జనవరి 21న జీవో 36 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే నాన్ ముల్కీ, బోగస్ ముల్కీ ఉద్యోగులను తమ సొంత ప్రాంతమైన ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొంత మంది ఆంధ్ర ఉద్యోగులు జీవో 36 రాజ్యాంగ బద్ధతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేయడంతో ఆ జీవో చెల్లదని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి అయిన చిన్నపరెడ్డి 1969 ఫిబ్రవరి 3న తీర్పు చెప్పారు. తర్వాత ఈ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాలు చేయగా న్యాయమూర్తులు జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావు ఆ జీవో రాజ్యాంగబద్ధమే అని తీర్పు చెప్పారు. ఈ తీర్పు అమలు అయ్యేలోపు కొంత మంది ఆంధ్ర ఉద్యోగులు జీవో 36 ను సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఫిబ్రవరి 15న ఆ జీవో అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ఉద్యోగులు ఎవరినీ బదిలీ చేయవద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో జీవ 36 విఫలమైంది.

◆ ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2001 ఏప్రిల్ 27న నిజామాబాద్ జిల్లాలోని మోతే గ్రామం లో తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించాడు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. విద్యార్థి ఉద్యోగ సంఘాలు అనేక ఇతర సంస్థలు ఆందోళన లో పాల్గొన్నాయి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని నడి కేంద్ర హోం శాఖ మంత్రి పీ చిదంబరం 2009 డిసెంబర్ 9న ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఆంధ్ర రాయలసీమ లో పెద్ద మొత్తంలో ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 23న తన ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తే తప్ప ప్రత్యేక తెలంగాణపై ముందుకు కదిలేది లేదని ప్రకటించింది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కోదండరాం కన్వీనర్గా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం రాజకీయ రాజకీయేతర పార్టీలతో సంయుక్త కార్యాచరణ కమిటీ (టి.జే.ఏ.సీ) ఏర్పడి ప్రత్యేక తెలంగాణ కోసం వివిధ రూపాలలో పలు కార్యక్రమాలను అమలు చేసింది.దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 3 2010న ప్రత్యేక తెలంగాణ అంశం పరిశీలించడానికి జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. 2011 జనవరి 6న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి 505 పేజీల నివేదికను విడుదల చేసింది. ఈ కమిటీ తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆరు మార్గాలను సూచించింది.

అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టడంతో తెలంగాణలోని సబ్బండ వర్గాలు వివిధ రకాల జే.ఏ.సీ లు గా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా పలు ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా 2011 ఫిబ్రవరి 17న సహాయనిరాకరణ 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ అలాగే 2011 సెప్టెంబరు 12న సకల జనుల సమ్మె లాంటి మెరుపు ఉద్యమాలతో ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది. చివరికి దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం 2013 అక్టోబరు లో కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపి వివిధ వర్గాలతో ఏర్పాటు చేసింది.

◆ సాకారమైన తెలంగాణ కల

ఈ పరిణామాల అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014 ను పార్లమెంటులో ప్రవేశ పెట్టగా 2014 ఫిబ్రవరి 18న లోక్ సభ, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించిన తర్వాత 2014 మార్చి 1న భారత రాష్ట్రపతి ఆమోదం అనంతరం మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటు విడుదల చేసింది. దీని ప్రకారము 2014 జూన్ 2 న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది.