హైదరాబాద్ (ఫిబ్రవరి – 15 ): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 2008లో సర్వీస్ క్రమబద్ధీకరణ జరిగిన జూనియర్ లెక్చరర్లలో 2004కు ముందు కాంట్రాక్టు పద్ధతిలో అపాయింట్ అయిన వారికి సైతం పాత పింఛను విధానాన్నే అమలు చేయాలని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలు జారీ (Old pension Scheme for Regularized Contract lecturers) చేసింది.
2004కు ముందు కాంట్రాక్టు పద్దతిలో అపాయింట్ అయిన తమకు కొత్త పింఛను విధానం (సీపీఎస్) అమలు చేస్తామని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని.. దీన్ని కొట్టేసి తమకు పాత పింఛను విధానం అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని దాదాపు 120 మంది గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ జూనియర్ లెక్చరర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం 2008లో పిటిషనర్ల సర్వీసు రెగ్యులరైజ్ అయినా వారు కాంట్రాక్టు పద్ధతిలో 2004కు ముందు అపాయింట్ అయ్యారని పేర్కొన్నది.
సీపీఎస్ విధానం 2004 సెప్టెంబరు నుంచి అమలులోకి వచ్చిందని తెలిపింది. పిటిషనర్ల సర్వీసు సైతం రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో పింఛనుకు అర్హమైనదేనని స్పష్టం చేసింది. ఈమేరకు పిటిషనర్లకు సీపీఎస్ అమలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది.