EARTH DAY : ధరిత్రి దినోత్సవం ఎప్రిల్‌ 22

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 22) : ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని (world earth day ) 1970 ఎప్రిల్‌ 22 నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ధరిత్రి దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన కల్పించడం.

పర్యావరణ ఉద్యమంలో సాదించిన ప్రగతిని మననం చేసుకోవడానికి ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. భూమి యొక్క సహజ వనరులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందమైన, ఆహ్లదకరమైన భూమిని అందించడమే ధరిత్రి దినోత్సవం యొక్క లక్ష్యం.

మొదట ఐక్యరాజ్యసమితి 1969, మార్చిలో జాన్‌మెక్కల్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయవేత్త గేలార్డ్‌ నెల్సన్‌ ప్రారంభించాడు. 1962లో సెనెటర్‌ నెల్సన్‌కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ధరిత్రీ దినోత్సవం. తన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమవడం గమనించి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు నెల్సన్‌ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ప్రెసిడెంట్‌ కెన్నెడిని కలసి తన ఆలోచనను వివరించాడు.దీని ప్రకారం ప్రెసిడెంట్‌ కెన్నెడి అందరికీ ధరిత్రి సంరక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు దేశమంతటా పర్యటించాల్సి ఉంటుంది. ఈ ఆలోచన నచ్చి కెన్నెడి పర్యటించేందుకు ఒప్పుకున్నాడు.కాని ప్రెసిడెంట్‌ కెన్నెడి పర్యటన సఫలీకృతం కాలేదు. ఎవ్వరూ ఈ సమస్యపై అప్పటి సమాజం పెద్దగా పట్టించుకోలేదు.

1969లో సెనెటర్‌ నెల్సన్‌కి మరొక ఆలోచన వచ్చింది. మన వాతావరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే తన ఆలోచనకు రూపకల్పన చేస్తూ, ఒక వార్తాపత్రిక ద్వారా ప్రజలకూ ఈ ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించారు. 1970 ఏప్రిల్‌ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం జరిగింది. ఆరోజు ఆ దేశంలోని ప్రజలంతా ధరిత్రిని రక్షించుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేసారు. ఇలా తొలుత అమెరికాలో ప్రారంభమైన ఈ ఉత్సవం ఆ తర్వాత ప్రపంచవ్యాపితమైంది. ప్రజలలో మరింత అవగాహన కలిగించేందుకు ఎర్త్‌ డే నెట్‌వర్క్‌ ఏర్పడింది.