- నేడు బాలగోపాల్ వర్ధంతి సందర్భంగా అస్నాల శ్రీనివాస్ ప్రత్యేక వ్యాసం
BIKKI NES : అంతరాలు, అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి పాల్గొన్న, నిర్వహించిన ఉద్యమాలను, మేథోపర అలోచనలను బాలగోపాల్ గ్రంథస్తం చేసాడు. దాదాపు ఇవి పదిహేను సంపుటాలుగా పర్‌స్పెక్టివ్, ప్రజాతంత్ర ప్రచురణలుగా వెలువడ్డాయి. సామాజిక ప్రయోజనార్థము అంబేద్కర్ తరువాత అధికంగా రాసిన వ్యక్తిగా బాలగోపాల్ ప్రఖ్యాతి గాంచాడు. చరిత్రను గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే, అన్ని విషయాల గురించి శాస్త్రీయంగా ఆలోచించగలుగుతామని నమ్మి భారతదేశ చరిత్రపై అనేక వ్యాసాలు రాసారు. సంఘ్ పరివార్ శక్తులు, దేశానికి పట్టిన మహా విపత్తు అని వారి చరిత్ర వక్రీకరణ, మూకదాడులు, మోరల్ పోలీసింగ్, దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్న ఈ శక్తుల వలన భారతదేశాన్ని ఆనాగరిక దేశంగా భావించే ధోరణులు ప్రపంచదేశాలలో కలుగుతున్నాయని హెచ్చరించాడు. ఈ విధంగా పీడితుల పట్ల ప్రేమను, పీడకులు ఎవరైనా వారి పట్ల ఆగ్రహాన్ని ప్రకటించాడు.
“పాలకవర్గం కానప్పటికీ ఏ దేశంలోనైనా మేధావి వర్గం ప్రభావశీలంగా ఉంటుంది, భవిష్యతను చూడగలుగుతుంది. నాయకత్వం వహించి సలహాలను ఇస్తుంది.” – అస్నాల శ్రీనివాస్
“పాలకవర్గం కానప్పటికీ ఏ దేశంలోనైనా మేధావి వర్గం ప్రభావశీలంగా ఉంటుంది, భవిష్యతను చూడగలుగుతుంది. నాయకత్వం వహించి సలహాలను ఇస్తుంది. ‘సామాన్య జనము మేథోపరమైన ఆలోచనలు చెయ్యరు, వారు మేధావులను అనుకరించి అనుసరిస్తారు’ అని అంబేద్కర్ మేధావుల బాధ్యతను గుర్తు చేస్తూ చెప్పిన మాట. ఈ దృక్పథం వెలుగులో ‘అందరికి ఒకే విలువ’ అంబేద్కర్ కాగడాను స్వతంత్ర భారత్ హక్కుల ఉద్యమ చరిత్రలో మూడు దశాబ్ధాల పాటు కొనసాగించిన అసాధారణుడు, అద్వితీయుడు బాలగోపాల్. మేధావిగా, రచయితగా, నాయకుడిగా, కార్యకర్తగా ఉన్నత మానవ విలువల దిశగా సమాజాన్ని మార్చడం కోసం కార్ల్‌మార్క్స్ ,అంబేద్కర్ తాత్వికతల సమన్వయంతో తన పరిశీలన, అధ్యయన అనుభవాలతో రూపొందించుకున్న తాత్విక అవగాహనతో ప్రజాతంత్ర ఉద్యమాల విస్తరణ ,హక్కుల పరిరక్షణ ఉద్యమాల నిర్మాణంలో చిరస్మణీయ పాత్రను పోషించాడు.
దున్నేవారికి భూమి కావాలనే పోరాటకారులను ఎన్‌కౌంటర్లతో అంతం చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. నిజనిర్ధారణ జరిపి వీధుల్లో, న్యాయస్థానాలలో పోరాటాలు నిర్వహించాడు. – అస్నాల శ్రీనివాస్
స్వాతంత్రానంతరం వివక్షత లేని సమాజం, పాలనలో అందరికీ భాగస్వామ్యం, అభివృద్ధి ఫలాలు అందరికి పంపిణీ వంటి ప్రజల ఆకాంక్షలు అమెరికా, ఫ్రెంచ్, రష్యా విప్లవాలు అందించిన స్వేచ్ఛ, సమానత్వంల ప్రేరణతో అంబేద్కర్ మహోన్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. రాజ్య విధానాలు అత్యధిక ప్రజల ప్రయోజనాలను కలిగించాలని, బహుతత్వ స్పూర్తిని రక్షించాలని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర లక్ష్యాలను హృదయంగా రాజ్యాంగము ఏర్పడింది. ఇక నుండి స్వరాజ్యంలో పొరపాట్లు జరిగితే, పీడక విధానాలు అమలవుతే బ్రిటీష్ వారిని నిందించే అవకాశము మనకు లేదు. కావున రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలుగకుండా పాలన నిర్వహించాలని సూచించారు .ఈ నేపథ్యంలోనే పాలకుల విధానాలు రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనప్పుడు పాలకులను ప్రశ్నించడానికి, సరిచేయడానికి హక్కుల ఉద్యమాలు ఉద్భవించి క్రియాశీల పాత్ర పోషించాయి. 1970లో ప్రజా ఉద్యమాల అణిచివేత, భూకేంద్రంగా కొనసాగిన నక్సలైట్ ఉద్యమకారుల ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా కపిల్ భట్టాచార్య, జయప్రకాశ్‌నారాయణ, తార్కుండే, శ్రీశ్రీ, కన్నభిరాన్‌ల కృషితో హక్కుల ఉద్యమం కొనసాగింది. బాలగోపాల్ నేతృత్వంలో హక్కుల ఉద్యమ కార్యాచరణ విస్తృతి పెరిగి దళిత, స్త్రీవాద, ఆదివాసి, మైనారిటీవాద, సెజ్ వ్యతిరేక వంటి ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది.
1970లో ప్రజా ఉద్యమాల అణిచివేత, భూకేంద్రంగా కొనసాగిన నక్సలైట్ ఉద్యమకారుల ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా కపిల్ భట్టాచార్య, జయప్రకాశ్‌నారాయణ, తార్కుండే, శ్రీశ్రీ, కన్నభిరాన్‌ల కృషితో హక్కుల ఉద్యమం కొనసాగింది. – అస్నాల శ్రీనివాస్
10 జూన్ 1952లో పార్థనాధశర్మ, నాగమణి దంపతులకు బళ్ళారిలో జన్మించిన బాలగోపాల్ నెల్లూరు, తిరుపతిలో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల వరంగల్‌లో ఎంఎస్సీ అప్లయిడ్ మాథ్స్‌ను, అలాగే కేవలం ఆరునెలల వ్యవధిలో పిహెచ్‌డిని పూర్తిచేసిన అసాధారణ ప్రతిభావంతుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ఢిల్లీ నుండి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌ను సాధించాడు. ప్రజలందరూ సమానంగా ఉండే నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనకు ఆర్‌ఈసి వరంగల్ విప్లవ విద్యార్థి ఉద్యమ కేంద్రంగా ఉండేది. సూరపనేని జనార్థన్, రాజ్‌కుమార్, ఆనందరావు, మురళీమనోహర్‌రెడ్డి వంటి విద్యార్థి నాయకుల ప్రభావం బాలగోపాల్‌పై పడింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరు, నక్సల్బరీ పోరాటాలకు ఎపిసెంటర్‌గా ఎరుపెక్కిన వరంగల్ బాలగోపాల్‌లో తీవ్రమైన మేథోమధనాన్ని కలిగించింది. శివసాగర్, కాళోజీ, కొండపల్లి, వరవరరావు వంటి ఉద్యమ సారథులతో పరిచయాలు, సాన్నిహిత్యం, మార్క్స్ ,గ్రాంసీ, రస్సెల్ తత్వశాస్త్రాల అధ్యయనంతో నిబద్ధత, సామాజిక బాధ్యతతో పనిచేసే అధ్యాపకునిగా మారిపోయాడు. 1981-1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఇదే సమయంలో పౌరహక్కుల సంఘం కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించాడు. దున్నేవారికి భూమి కావాలనే పోరాటకారులను ఎన్‌కౌంటర్లతో అంతం చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. నిజనిర్ధారణ జరిపి వీధుల్లో, న్యాయస్థానాలలో పోరాటాలు నిర్వహించాడు. ప్రభుత్వమైనా, ఉద్యమ సంస్థలైనా జీవించే హక్కును కాలరాయడం అమానవీయమైన నేరంగా ప్రకటించాడు. 1984లో పౌరహక్కుల సంఘ ప్రధాన కార్యదర్శిగా మరింత క్రియాశీలంగా పనిచేశాడు. ప్రజల డాక్టర్ రామనాథం హత్య తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరు, నక్సల్బరీ పోరాటాలకు ఎపిసెంటర్‌గా ఎరుపెక్కిన వరంగల్ బాలగోపాల్‌లో తీవ్రమైన మేథోమధనాన్ని కలిగించింది. – అస్నాల శ్రీనివాస్
ఆధిపత్యము, అణచివేత, అసమానతలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను నివేదికగా రూపొందించి ప్రభుత్వ దృష్టికి తెచ్చేవాడు. పరిపాలన వ్యవస్థ వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించేవాడు. కనీస ప్రజాస్వామ్య సంస్కృతిని పాటించని సంఘ పరివారాన్ని సైద్ధాంతికంగా ఎండగట్టాడు. అనేక సార్లు ప్రభుత్వ, ముసుగు సంస్థల, సంఘ్‌పరివార్ వారి భౌతిక దాడులకు గురయ్యాడు. ఎన్ని దాడులకు లోనైనా, తన సహచరులు నర్రా ప్రభాకర్ రెడ్డి, అజం అలీ, లక్ష్మారెడ్డిలను కోల్పోయినా చెక్కుచెదరని స్థైర్యంతో హక్కుల ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాడు.
గత అరవై ఏండ్లుగా దోపిడీ, ఆక్రమణలకు గురవుతున్న దేశ భూమి పుత్రులు ఆదివాసీల హక్కులు, అటవి సంరక్షణ కోసము పాటుపడ్డారు. – అస్నాల శ్రీనివాస్
ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడే రాజ్యాంగంలోని 5,6 షెడ్యుళ్లను పటిష్టంగా అమలు చేయాలనికోరాడు. అమలు చేయమని కోరిన ప్రజలపై ‘అనుమానం ఉంటే చాలు ప్రజలను చంపే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ను ఉపసంహరించాలని కోరాడు. ఆ ప్రాంతాలను పర్యటించి ‘మణిపూర్‌లో ఏం జరుగుంది’ అనే నివేదికను రూపోందించి దీన స్థితిలో ఉన్న జనజీవనాన్ని, అణిచివేతను ప్రతిఘటిస్తూ మహిళల ధిక్కారాన్ని ప్రపంచానికి తెలియజేసాడు. స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించడం ప్రజాస్వామ్య సంస్కృతి ముఖ్యలక్షణంగా అభివర్ణించాడు. తన జీవితకాలంలో సందర్శించిన ఏకైక దేశము ‘జమ్మూకాశ్మీర్’ అని ప్రకటించాడు. భౌగోళికంగా, సంస్కృతి పరంగా విశిష్టతలను కల్గి ఉన్న కశ్మీర్ రాజ్యాన్ని ప్రత్యేక ప్రతిపత్తి కాపాడుకోవడం కోసము రాజా హరిసింగ్ షరతులతో భారత్‌లో విలీనం చేసాడు. ఈ షరతుల ఒప్పందాన్ని భారత్ పాలకులు ఉల్లంఘించడం వల్లనే కలలలోయ కల్లోల లోయగా మారిందని, 1995, 1996, 1997, 2001, 2003లలో ఐదుసార్లు పర్యటించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసాడు. కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత హిజ్బుల్, లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల దురాగతాలను ఖండించాడు.
గత అరవై ఏండ్లుగా దోపిడీ, ఆక్రమణలకు గురవుతున్న దేశ భూమి పుత్రులు ఆదివాసీల హక్కులు, అటవి సంరక్షణ కోసము పాటుపడ్డారు. బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి దాకా దేశం సాధించిన అభివృద్ధి పేరుతో విస్తాపన, విధ్వంసాలకు ఆత్యధికంగా నష్టపోతున్నది గిరిజనులే, ఎక్కువ తిరుగుబాట్లు చేసింది వారేనని చెప్పాడు. ఆదివాసీల ఆరోగ్య సంరక్షణ, 1/70 చట్టం సవ్యంగా అమలు జరిగేలా కృషి చేసాడు. ఉన్నవాళ్ళ అభివృద్ధి కోసము లేనివాళ్ళు పూర్తిగా పతనమయ్యే నమునా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వాదించాడు. ఇంద్రవెల్లి నుండి వాకపల్లి వరకు ఆదివాసీలపై జరిగే దాడులను ఖండిస్తూ వారి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తూ న్యాయసహాయాన్ని అందించాడు. మతాతీత ప్రత్యేక సంస్కృతితో జీవించే ఆదివాసీలను మత మార్పిడులకు లాగడం సరికాదని చెప్పాడు.
ఇంద్రవెల్లి నుండి వాకపల్లి వరకు ఆదివాసీలపై జరిగే దాడులను ఖండిస్తూ వారి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తూ న్యాయసహాయాన్ని అందించాడు. – అస్నాల శ్రీనివాస్
ప్రత్యేక ఆర్థిక మండలాల (సెజ్‌లు) పేరుతో వాన్‌పిక్, కాకినాడ, శ్రీసిటి, అపాచీ, పోలేపల్లిలలో వేలాది ఏకరాల భూమిని పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టడాన్ని వ్యతిరేకించి, ఆ ప్రాంత ప్రజలతో కలిసి ఉద్యమించాడు. వ్యవసాయ యోగ్యమైన సారవంతమైన పంటభూములను, సెజ్‌లకు ఇవ్వడం చట్టవిరుద్ధమని తీసుకున్న భూములకు అధిక నష్టపరిహారం ఇప్పించాడు. బాలగోపాల్ పోరాటాలు, ప్రాతినిధ్యాలతో అప్పుడు యూపీఏ ప్రభుత్వం మెరుగైన భూసేకరణ, పునరావాస, పరిహార చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని మోడీ నిర్వీర్యం చేసారు. నాగార్జున సాగర్ అణువిద్యుత్ కేంద్రం, సోంపేట థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపన రద్దు చేయించిన ఘనత బాలగోపాల్‌కు చెందుతుంది.
ప్రాంతాల మధ్య విద్వేషాలకు నదీ జలాల పంపకము ఒక ప్రధాన కారణమని చెప్పాడు. కృష్ణా, గోదావరి జలాల పంపకంలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదని, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అత్యంత ప్రజాస్వామికమని చెప్పాడు. మద్దతుగా అనేక సదస్సులను నిర్వహించాడు. సాగునీటితో తెలంగాణ దారిద్య్రం తగ్గుతుందని, అభివృద్ధికి విస్త్రృత ప్రాతిపదిక ఏర్పడుతుందని చెప్పాడు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగిస్తుందని అది తెలంగాణ వ్యవసాయ, వర్తక, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతుందని తెలియజేసాడు.
అంతరాలు, అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి పాల్గొన్న, నిర్వహించిన ఉద్యమాలను, మేథోపర అలోచనలను గ్రంథస్తం చేసాడు. దాదాపు ఇవి 15 సంపుటాలుగా పర్‌స్పెక్టివ్, ప్రజాతంత్ర ప్రచురణలుగా వెలువడ్డాయి. సామాజిక ప్రయోజనార్థము అంబేద్కర్ తరువాత అధికంగా రాసిన వ్యక్తిగా బాలగోపాల్ ప్రఖ్యాతిగాంచాడు. చరిత్రను గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే, అన్ని విషయాల గురించి శాస్త్రీయంగా ఆలోచించగలుగుతామని నమ్మి భారతదేశ చరిత్రపై అనేక వ్యాసాలు రాసారు. సంఘ్ పరివార్ శక్తులు, దేశానికి పట్టిన మహా విపత్తు అని చరిత్ర వక్రీకరణ, మూకదాడులు, మోరల్ పోలీసింగ్, దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్న ఈ శక్తుల వలన భారతదేశాన్ని ఆనాగరిక దేశంగా భావించే ధోరణులు ప్రపంచదేశాలలో కలుగుతున్నాయని హెచ్చరించాడు. ఈ విధంగా పీడితుల పట్ల ప్రేమను, పీడకులు ఎవరైనా వారి పట్ల ఆగ్రహాన్ని ప్రకటించాడు.
సాగునీటితో తెలంగాణ దారిద్య్రం తగ్గుతుందని, అభివృద్ధికి విస్త్రృత ప్రాతిపదిక ఏర్పడుతుందని చెప్పాడు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగిస్తుందని అది తెలంగాణ వ్యవసాయ, వర్తక, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతుందని తెలియజేసాడు. – అస్నాల శ్రీనివాస్
1980 నుండి అక్టోబర్ 8, 2009లో మరణించే వరకు అశేష త్యాగాల రాజ్యాంగ స్ఫూర్తిని, సంక్షేమ రాజ్య పరిరక్షణ కోసము పనిచేసాడు. తాత్విక రంగంలో, క్షేత్రస్థాయిలో కఠినమైన మేథోశ్రమ, శారీరక శ్రమ చేసాడు. తాను నమ్మిన విధానాలను నిజాయితి, నిర్భయత్వం, నిరాడంబరతతో ఆచరించిన అపురూపమైన నవ మానవుడిగా నిలిచిపోయి భావి తరాలకు మార్గదర్శకుడైనాడు .దు:ఖిత మానవాళిపై అనుకంపన, విసుగు ఎరగని, విరతిలేని జ్ఞానాన్వేషణతో సామాజిక కార్యకర్తలకు, శాస్త్రవేత్తలకు కరదీపికయ్యాడు. ‘‘తల్లి, తండ్రికి, గురువుకు, దేశానికి ప్రతి మనిషి రుణపడి ఉంటాడు. మేథావికి మరోరుణం కూడ ఉన్నది. తన తలను పొలంగా మార్చి, దున్ని, ఎరువులు వేసి పంటలను ప్రజలకు పంచటం. ఇది తీర్చవలసిన బాకీ, తలబీడు పడిపోయేదాక, ఆ తరువాత ప్రపంచం శాశ్వతంగా ఆ మేధావికి బాకీ పడి ఉంటుంది”. బాలగోపాల్‌ను ప్రేమిద్దాం. ఆయన ఆశయాలను కొనసాగిద్దాము.
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం