SHIVAJI – మట్టి మనుషుల మారాజు – ఛత్రపతి శివాజీ : అస్నాల శ్రీనివాస్

  • శివాజీ 394వ జయంతి వ్యాసం (CHATRAPATHI SHIVAJI JAYANTHI)

BIKKI NEWS : భారతీయ చరిత్ర మధ్యయుగ కాలంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో తీవ్రమైన అసమానతలు దోపిడీ నిరంకుశ విధానాలు ప్రజలను పీల్చి పిప్పి చేశాయి. రాజులు ప్రజలే నిజమైన సంపద అనే తాత్వికతను వదిలేసారు. రాజు ఏ మతం వారైనా ప్రజలపై ప్రత్యక్ష పెత్తనం చేసే దేశముఖ్ లు, పాటిల్ లు, కులకర్ణి, వతన్ దారులు మొదలగు ఫ్యూడల్ ప్రభువులను దరికి చేర్చుకునేవారు. రాజ్యాలన్నీ రైతులను దోపిడి చేసే, వెట్టిచాకిరిని ప్రోత్సహించే అభివృద్ధి నిరోధక ఫ్యూడల్ చేతుల్లోనే ఉండేవి. చరిత్ర పురోగమనం కుంటూ పడుతున్న కాలమది. చిల్లర దేవుళ్ల కింద నలిగిపోతున్న రైతాంగానికి ఒక టార్చ్ లైట్ అందించాల్సిన కర్తవ్యం చరిత్ర మీద పడింది.

చిల్లర దేవుళ్ల కింద నలిగిపోతున్న రైతాంగానికి ఒక టార్చ్ లైట్ అందించాల్సిన కర్తవ్యం చరిత్ర మీద పడింది. ఆ టార్చ్ లైటే చత్రపతి శివాజీ – అస్నాల శ్రీనివాస్

13వ శతాబ్దం నుండే మరాఠా ప్రాంతంలో సామాజిక సంస్కరణల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. పోగైన జ్ఞానం సంస్కృత భాష లో ఉన్నప్పుడు దానిని ప్రజల భాష ప్రాకృతంలోకి అనువాదం చేశాడు జ్ఞానేశ్వరుడు. జ్ఞానం జన్మహక్కు అనే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి కడగొట్టు జాతి వాళ్లలో వికాసం కలిగించాడు. తుకారం సాధువు కూడా దైవ మోక్షం పొందడానికి అర్ధం లేని అనేక క్రతువులను ఖండించాడు. దైవ ప్రార్థనాలలో కుల, లింగ భేదం వద్దన్నాడు. వీరంతా జ్ఞానం సంపద అధికారం తమదే అన్న ఆధిపత్య వర్గాల నుండి వ్యతిరేకతను అణచివేతను ఎదుర్కొన్నారు.

జ్ఞానేశ్వరుడు, తుకారాంల చైతన్యాన్ని కొనసాగించడానికి కాలం కడుపుతో ఉండి 19 ఫిబ్రవరి 1630 లో పూణే లో షాహాజి, జిజియా భాయి దంపతులకు పుట్టిన బిడ్డ శివాజీ రావు భోంస్లే. – అస్నాల శ్రీనివాస్

జ్ఞానేశ్వరుడు, తుకారాంల చైతన్యాన్ని కొనసాగించడానికి కాలం కడుపుతో ఉండి 19 ఫిబ్రవరి 1630 లో పూణే లో షాహాజి, జిజియా భాయి దంపతులకు పుట్టిన బిడ్డ శివాజీ రావు భోంస్లే. ఆధునిక భారత దేశ చరిత్రలో శివాజీ పాలన సేవలను తొలిసారి పరిశోధించి “రైతు మకుటంలో మణి” కథగానం రూపకాన్ని జోతిబా పూలే రూపొందించారు. మరాఠా ఉన్నత పాలన వంశ వృక్ష జాబితాలో లేని సాధారణ శూద్ర కుటుంబంలో శివాజీ జన్మించాడు. శివాజీ రైతు జన సేవకుడిగా పని చేసిన అపూర్వ ఘట్టాలను మనకు అందించాడు.

ఆధునిక భారత దేశ చరిత్రలో శివాజీ పాలన సేవలను తొలిసారి పరిశోధించి “రైతు మకుటంలో మణి” కథగానం రూపకాన్ని జోతిబా పూలే రూపొందించారు. – అస్నాల శ్రీనివాస్

మొఘల్స్ ఆధీనంలో శివాజీ తండ్రి బెంగళూరు, పూణే పరిపాలకుడిగా కొనసాగాడు. పూణేలో తల్లి దగ్గర, గిరిజన జాతి గురువు దాదాజి కొండ దేవ్ ల సహచర్యంతో శివాజీ ఉదాత్త మానవవాద విలువలను నేర్చుకున్నాడు. మరాఠా గ్రామీణ, అరణ్య ప్రాంతాలను పర్యటించి ప్రజల బాగోగులను పరశీలించాడు. రైతు జీవితాలలో పెను మార్పులను తీసుకువచ్చాడు. వ్యవసాయానికి విత్తనాలు పనిముట్లను ఇచ్చి ప్రోత్సహించాడు. పశువులను కొనడానికి రుణాలు ఇచ్చాడు. కరువు కాటకాలలో పన్నులు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చాడు. పంట దిగుబడి కరువు కాటకాలతో నిమిత్తం లేకుండా గ్రామాలపై విరుచుకుపడి పన్నులు వసూలు చేసే కులకర్ణి, దేశ్ పాండేలు, పాటిల్ లను నియంత్రించి వసూళ్లకు అధికారులను నియమించారు. పొలాల్లో ఆరుగాలం చెమటోడ్చి పనిచేసే రైతులను కలుపుకుని శివాజీ మరాఠా సామ్రాజ్యం స్థాపించారు. సాగు నేలతో సంబంధం ఉండే రైతుల నుండి, కొండ జాతి ప్రజల నుండి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

శివాజీ తన సైన్యాధిపతిగా డౌలత్ ఖాన్ ను, విదేశాంగ కార్యదర్శి గా ముల్లా హైదర్ ను, ముఖ్య అంగరక్షకుడిగా మాదానిని, ఆయుధగార అధిపతిగా ఇబ్రహీం ను నియామించారు. తన కోట ఎదురుగానే ఉన్న జగదీశ్వర ఆలయం పక్కన మసీదును నిర్మించాడు. – అస్నాల శ్రీనివాస్

చరిత్రలో శివాజీ స్థానం మరింత సుస్థిరం కావడానికి ప్రధాన కారణం మహిళల పట్ల తాను అనుసరించిన గౌరవ భావం. కుల మత వర్గాలకి అతీతంగా ఆమె ఎవరైనా గాని కాపాడుకోవాలి. మాతృ, సోదర భావంతో చూడాలి అని తన అధికారులకు సామంతులకు స్పష్టం చేశాడు. పేద రైతుల అడబిడ్డలను హక్కుగా చెరుస్తున్న గ్రామ అధికార ఆధిపత్య వర్గాలను తీవ్రంగా శిక్షించాడు.1678లో చేలావది దుర్గ అధిపతి సావిత్రి దేశాయ్ యుద్ధంలో ఓడిపాయింది. ఈమె పై సైన్యాధిపతి శుకూజి అఘాయిత్యము చేస్తే వెంటనే అతని కండ్లు తీసేశాడు. యుద్ధములో బందీలుగా గా ఉన్న ముస్లిం మహిళలను తల్లిగా సంభోధించి హిమనగమంత ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. స్త్రీ, పురుషులను బానిసలుగా వర్తకంలో కొనడం అమ్మడం విధానాలను రద్దు చేశాడు.

భారత చరిత్రలో తన విన్నూత్న పరిపాలన విధానాలతో మట్టి మనుషులను తన సహచరులగా, అనుచరులుగా మార్చుకుని జాజ్వలమానంగా ప్రకాశించే మహారాష్ట్రను నిర్మించాడు. – అస్నాల శ్రీనివాస్

పరిపాలనా భాష పర్షియన్ స్థానంలో మరాఠీ భాషను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. పరిపాలన భాషా పదకోశం రూపొందించాడు. స్థానిక చేతి వృత్తులను పరిశ్రమలను ప్రోత్సహించాడు. విదేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద భారీ పన్నులు విధించాడు. తన పరిపాలనకు ఫ్యూడల్ కామందులు శివాజీకి ఎలాంటి సహకారం అందించలేదు. అట్టడుగు కులాల నుండి, శ్రామిక వర్గాల నుండి, ముస్లిం కుటుంబాల నుండి సైన్యాధికారులను చేశాడు. శివాజీ నిబద్ధతతో రైతుల కోసం, మహిళల కోసం పని చేస్తున్నందున ఆ వర్గాల ప్రజలు రక్షక కవచంగా పని చేశారు. శివాజీ రాజ్యాన్ని ప్రజలు తమ ఆస్తిగా భావించడం వలన వాళ్ళు మహత్తర సైన్యంగా శివాజీ వెంట నడిచారు. చరిత్రలో రైతులు పాల్గొన్న ప్రతి పోరాటం విజయం సాధించింది. మోఘల్ ల పాలన నుండి స్వతంత్రం ప్రకటించుకొని మరాఠా సామ్రాజ్యం ఆవిర్భవించింది.
శివాజీ పరమత సహనం చరిత్రలో నిలిచిపోయే మాహా ఘట్టం. తన సైన్యాధిపతిగా డౌలత్ ఖాన్ ను, విదేశాంగ కార్యదర్శి గా ముల్లా హైదర్ ను, ముఖ్య అంగరక్షకుడిగా మాదానిని, ఆయుధగార అధిపతిగా ఇబ్రహీం ను నియామించారు. తన కోట ఎదురుగానే ఉన్న జగదీశ్వర ఆలయం పక్కన మసీదును నిర్మించాడు. శివాజీ ప్రధాన సలహాదారుగా యాకుత్ బాబా పని చేశారు. కొంత మంది మౌల్వీల ఒత్తిడితో జిజియా పన్నును విధించిన ఔరంగజేబుకు ఉత్తరం రాస్తూ అక్బర్, షాజహాన్ లు అనుసరించిన మత సమగ్రత సమైక్యత లను ప్రస్తావించాడు.


కొంత మంది మౌల్వీల ఒత్తిడితో జిజియా పన్నును విధించిన ఔరంగజేబుకు ఉత్తరం రాస్తూ అక్బర్, షాజహాన్ లు అనుసరించిన మత సమగ్రత సమైక్యత లను ప్రస్తావించాడు శివాజీ – అస్నాల శ్రీనివాస్


మధ్య యుగాల కాలంలో అధికారము, విధేయత అతి ముఖ్య కారకాలుగా పనిచేసాయి. మతం పాత్ర అతి స్వల్పం.
యుద్ధ సమయాలలో ఇతర రాజ్యాల పై దండెత్తినప్పుడు దేవాలయాలను కూల్చడం అక్కడి సంపదను చేజిక్కించుకోవడం సహజమైన అంశంగా ఉండేది. ఉద్దేశపూర్వకంగా హిందూ, ఇస్లాం రాజులు ప్రార్థనా స్థలాలను కూలగొట్టిన దాఖలాలు చరిత్రలో లేవు. అక్బర్ నుండి ఔరంగజేబు వరకు వారి ఆస్థానంలో హిందువులే ప్రధాన పరిపాలనా అధికారులు ఉన్నారు.

ఉద్దేశపూర్వకంగా హిందూ, ఇస్లాం రాజులు ప్రార్థనా స్థలాలను కూలగొట్టిన దాఖలాలు చరిత్రలో లేవు. అక్బర్ నుండి ఔరంగజేబు వరకు వారి ఆస్థానంలో హిందువులే ప్రధాన పరిపాలనా అధికారులు ఉన్నారు. – అస్నాల శ్రీనివాస్

ఒక శూద్ర వర్గానికి చెందిన శివాజీ మరాఠా సంస్కృతిక శిఖరంగా ఎదగడం ఓర్వలేక పురోహిత వర్గం అనేకమైన కుట్రలకు పాల్పడింది. ఔరంగజేబు శివాజీ పైకి దండెత్తడానికి పంపించిన హిందూ మీర్జా రాజు జై సింగ్ గెలవాలని బ్రాహ్మణులు చండీ యాగం చేశారు. శివాజీకి పట్టాభిషేకం నిర్వహించడానికి కూడా ఇష్టపడలేదు. భారతదేశంలో క్షత్రియులే లేరని ఉన్న వారందరినీ పరశురాముడు వధించాడని చెప్పుకొచ్చారు. శివాజీకి రాజు అయ్యే అర్హత లేదని తేల్చి చెప్పారు. ప్రజల హృదయాల్లో తన పరిపాలనతో కొలువైన శివాజీని ఎట్టకేలకు చత్రపతిగా ప్రకటించి మహోత్సవం జరపాలని కోరారు. ముస్లిం అధికారులే చొరవ చూపించి వారణాసికి చెందిన గాగ భట్టు అనే బ్రాహ్మణుని పిలిపించి అతని చేత రాజపుట్ గా ప్రకటించి పట్టాభిషికం జరిపారు.

హిందూ, ఇస్లాంలోని మానవీయ విలువలను మరాఠా ప్రజల ఆచార వ్యవహారాలతో మేళవించి ప్రత్యేక సంస్కృతిని సృష్టించిన శివాజీని ఒక వర్గపు మనిషిగా కీర్తిస్తున్నారు. – అస్నాల శ్రీనివాస్

భారత చరిత్రలో తన విన్నూత్న పరిపాలన విధానాలతో మట్టి మనుషులను తన సహచరులగా, అనుచరులుగా మార్చుకుని జాజ్వలమానంగా ప్రకాశించే మహారాష్ట్రను నిర్మించాడు. ఇంతటి ఘన చరిత్రను సంఘ్ సంస్థలు ఈ వర్గ పాలకులు వక్రీకరించి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు.. హిందూ, ఇస్లాంలోని మానవీయ విలువలను మరాఠా ప్రజల ఆచార వ్యవహారాలతో మేళవించి ప్రత్యేక సంస్కృతిని సృష్టించిన శివాజీని ఒక వర్గపు మనిషిగా కీర్తిస్తున్నారు. అన్య మత విద్వేషకుడిగా ప్రచారం చేస్తున్నారు. శివాజీ ప్రదర్శించిన రైతు అనుకూల, ఉత్తమోత్తమ పరిపాలనలో అంశాలకు సంఘ్ పరివార్ పాలకుల నిఘంటువులో చోటే లేదు. శివాజీ స్ఫూర్తి వ్యతిరేక ప్రయత్నాలను నిలువరించి దేశ బహుళత్వం సంస్కృతిని కాపాడుకోవడమే మన ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి.

వ్యాసకర్త :
అస్నాల శ్రీనివాస్
(అసలు పేరు అస్నాల రిత్విక్ జీ) తల్లిదండ్రులు. కృష్ణాజి,రాధ భాయి.
ప్రిన్సిపాల్ – ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మ సాగర్. రాజకీయ సాహిత్య విద్యా పాఠశాలగా నడపబడే దొడ్డి కొమరయ్య పౌండేషన్ కు అధ్యక్షులు గా ఉన్నారు. పలు ప్రధాన దినపత్రికలలో కాలమిస్ట్ గా ఉన్నారు. టీజీవో ఇంటర్ విద్యా విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ మరియు సామాజిక పురస్కార గ్రహీత, టీజీవో న్యూస్ ఉద్యోగుల కిరణం పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.