BIKKI NEWS (JUNE 24) : హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాల కొరకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని (2500 acers defance lands for hyderabad roads) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు.
రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం రేవంత్ రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే, వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసిన కారణంగా వాటిని పునరుద్ధరించాలని లేదా కొత్తగా మంజూరు చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి గారి వెంట ఉన్న లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి ఉన్నారు.