BIKKI NEWS (OCT. 11) : Young india integrated residential schools. తండాలు, మారుమూల పల్లెలు, బస్తీల్లో నివసించే నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.
Young india integrated residential schools
నిరుపేదలను విద్యకు దూరం చేయకూడదన్న ఆలోచనతో చాలా మంది మేధావులు, సామాజిక తత్వవేత్తలతో చర్చించిన మీదట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.
దసరా పండుగ శుభ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గ్‌లో ఇంటిగ్రేటెడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదిక నుంచి మాట్లాడుతూ ఆ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు చోట్ల విద్యా బోధన వల్ల ఈ వ్యవస్థ మమ్మల్ని దూరం పెడుతుందన్న భావన విద్యార్థుల్లో కలిగే ప్రమాదం ఉంది. అలాంటి భావన సమాజానికి, దేశానికి మంచిది కాదు. అందుకే పాతిక ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అందరూ కలిసిమెలిసి ఒక సోదర భావంతో చదువుకుని రాణించాలన్న సంకల్పంతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం.
నిరుపేదలకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక్కోచోట 120 నుంచి 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ క్యాంపస్‌లకు శంకుస్థాపన చేస్తున్నాం.
ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్‌లో దాదాపు 2500 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుని, భవిష్యత్తులో వారంతా ఉన్నతస్థాయికి ఎదగాలని, తద్వారా వారు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
నిరుపేదలను విద్యకు దూరం చేస్తే ఈ దేశ సంపదకే తీవ్ర నష్టం చేసిన వారమవుతాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో దాదాపు 5 వేల పాఠశాలలు మూసివేయబడ్డాయి. తద్వారా ముఖ్యంగా దళితులు, గిరిజనులు విద్యకు దూరమయ్యే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
పేదల కోసం పనిచేసే అధికారులను తప్పనిసరిగా ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడూ అభినందిస్తారు. విద్యా ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతోనే సుదీర్ఘ కాలంగా ప్రమోషన్లు లేక ఆందోళనకు గురవుతున్న సందర్భంలో రాష్ట్రంలో 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించడమే కాకుండా ఎక్కడా వివాదాలకు తావులేకుండా 34 వేల మంది టీచర్లను బదిలీలు చేశాం.
ఈ శంకుస్థాపన కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
“భగవంతుడు ప్రజలకు సుఖశాంతులు కలిగించాలి. పాడిపంటలు ఇవ్వాలని, పిల్లలకు మంచి చదువులు, ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.