Home > EMPLOYEES NEWS > PENSION NEWS – మహిళా ఉద్యోగి భర్తతో పాటు.. పిల్లలకూ పింఛను హక్కు

PENSION NEWS – మహిళా ఉద్యోగి భర్తతో పాటు.. పిల్లలకూ పింఛను హక్కు

BIKKI NEWS (JAN. 30) : ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛనుదారులు తమ మరణానంతరం కుటుంబ పింఛన్‌ను భర్తకు కాకుండా కుమారుడికో కుమార్తెకో చెందేట్లు నామినేట్‌ (Women employee pension nominee is son and daughter)చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకు మహిళా ఉద్యోగి లేదా పింఛనుదారు తన తదనంతరం కుటుంబ పింఛన్‌ను ఆమె భర్తకు, అతడి మరణానంతరం పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించేవారు.

ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్‌ చెల్లించడానికి వీలుగా 2021నాటి కేంద్ర పౌర సర్వీసుల (కుటుంబ పింఛన్‌) నిబంధనలను కేంద్ర పింఛన్‌, పింఛనుదారుల సంక్షేమ విభాగం సవరించింది.

భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాలతో పాటు గృహ హింస నిరోధ చట్టం, వరకట్న నిషేధ చట్టం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద కేసులు దాఖలైన సందర్భాలలోనూ పింఛను చెల్లింపులో తలెత్తే సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం సులభమవుతుందని మంత్రి తెలిపారు.

★ మార్గదర్శకాలు

ఉద్యోగిని మరణానంతరం భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛన్‌ను చెల్లించాలంటే, మహిళా ఉద్యోగి తన విభాగాధిపతికి లిఖితపూర్వక దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

పిల్లలు లేని సందర్భాలలో భర్తకే పింఛన్‌ అందుతుంది.

కుమార్తె లేక కుమారుడు మైనర్‌ అయినా, మానసిక వైకల్యంతో బాధపడుతున్నా వారి సంరక్షకుడైన తండ్రి (భర్త)కి పింఛన్‌ చెల్లిస్తారు.

కుమార్తె లేక కుమారుడు మేజర్‌ అయిన తరవాత వారికే పింఛన్‌ లభిస్తుంది.

మహిళా పింఛన్‌దారు మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్నా, పిల్లలు మేజర్‌ అయితే వారికే పింఛన్‌ అందుతుంది.