BIKKI NEWS (DEC.20) : నాసా లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అంతరిక్షం నుంచి, సుమారు 3.1 కోట్ల కిలో మీటర్ల దూరం నుంచి తొలి అల్ట్రా హెచ్డీ వీడియోను (VIDEO FROM 3.1 CRORE KILO METERS BY NASA) భూమికి పంపింది. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరం కంటే 80 రెట్లు ఎక్కువ. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో టాటర్స్ అనే పిల్లి లేజర్ లైట్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ప్రయోగంలో భాగంగా సోమవారం ఈ వీడియోను ప్రసారం చేసినట్లు నాసా ట్వీట్ చేసింది. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో అంతరిక్షం నుంచి భూమి మీదకు డేటా, ఫొటో/వీడియోలను పంపేందుకు, మానవుల అంగారక యాత్రకు ఉపయోగపడుతుందని తెలిపింది.
అంతరిక్షంలో అంగారక, గురు గ్రహాల మధ్య ఉంటూ.. సూర్యుని కక్ష్యలో తిరుగుతున్న గ్రహ శకలం పైకి ఈ ఏడాది అక్టోబరులో నాసా ‘సైకీ’ అనే వ్యోమనౌకను పంపింది. కొద్ది రోజుల క్రితం దీనిలో ‘ట్రాన్సీవర్’ భూమి మీదకు విజయవంతంగా లేజర్ సంకేతాన్ని పంపింది. సోమవారం వ్యోమనౌక నుంచి ఎన్ కోడెడ్ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్ను అమెరికాలోని శాన్‌డియాగో కౌంటీలో ఉన్న ‘కాల్టిక్ పలోమర్ అబ్జర్వేటరీ’ కేంద్రంలోని `హాలే టెలిస్కోప్’ అందుకుంది.
ఆ తర్వాత దానిని దక్షిణ కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ పరిశోధనాశాలకు పంపింది. అక్కడ వీడియోను డీకోడ్ చేశారు.