BIKKI NEWS (DEC.29) : తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక – 2023 (TELANGANA CRIME REPORT 2023) ప్రకారం 2022తో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు.
రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక శాతం తగ్గాయని చెప్పారు. కోర్డు శిక్షలు 41 శాతం, జీవిత ఖైదు 39 శాతం పెరిగాయని వెల్లడించారు. రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. నేరాలకు పాల్పడుతున్న 175 మందిపై పీడీయాక్ట్ నమోదుచేశామన్నారు. సమాజానికి డ్రగ్స్, సైబర్‌క్రైమ్ సవాలుగా మారాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు.
ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదుచేశామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 17.59 శాతం సైబర్‌క్రైమ్ నేరాలు పెరిగాయని చెప్పారు. ఈ ఏడాదిలో జీరో ఎఫ్‌ఐఆర్‌లు 1,108 నమోదు చేశామన్నారు. 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే డ్రగ్స్ కేసులు 15.6 శాతం పెరిగాయన్నారు. 2023లో 25,260 కిలోల గంజాయి పట్టుబడిందని, 1240 గంజాయి మొక్కలు సీజ్ చేశామన్నారు. 2583 మందిని అరెస్టు చేశామని తెలిపారు. డ్రగ్స్‌పై పటిష్ఠ నిఘా కొనసాగుతున్నదని వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేశామన్నారు. 59 కేసుల్లో 182 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్స్ పెడ్లర్స్‌పై పీడీయాక్ట్ నమోదు చేశామన్నారు. 12 మంది విదేశీ అఫెండర్స్‌ను అరెస్టు చేశామని, డ్రగ్స్ తీసుకుంటున్న 536 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1877 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.