BIKKI NEWS (FEB. 16) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కుల గణన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం (TELANGANA ASSEMBLY APPROVES CAST CENSUS) తెలిపింది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కులగణనతో పాటు సామాజిక, ఆర్థిక, విద్య అవకాశాల కోసం కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాస్త్రీయంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే ఉంటుందని తెలిపారు. సలహాలు, సూచనలు తీసుకోవడానికీ తమకు ఎలాంటి భేషజాలు లేవని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, మిగతా బలహీన వర్గాల కి చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తము వివిధ సామజిక, ఆర్థిక, విద్యా పరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాలు ప్రణాళికలు రూపోందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రి వర్గం 4 -2 – 2024 న తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ అంతటా సమాజిక, ఆర్థిక, రాజకీయ ఉపాధి సమగ్ర ఇంటింటి కుల గణన కుటుంబ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఇది జనాభా గణన కుల గణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయినప్పటికి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు దృష్ట్యా కుల గణన చేపడుతున్నామని, ఈ సర్వే ద్వారా రాష్ట్రం లో ఎస్సి ఎస్టీ బీసీ ఇతర బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
★ తీర్మానం కాదు చట్టం చేయాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని డిమాండ్ చేసిన నేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. చట్టబద్ధత లేకపోతే కులగణన సఫలం కాదన్న కేటీఆర్.. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉందన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కులగణనపై తీర్మానం కాకుండా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణనకు చట్టం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఎంబీసీలను మొదటి గుర్తించినదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని, బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహార్‌లో ఇప్పటికే కులగణన చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీల డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందని.. అప్పుడే కులగణన సఫలం అవుతుందన్నారు.