Home > EDUCATION > OPEN SCHOOL > ఓపెన్‌ స్కూల్‌ చదివితే టెట్, డీఎస్సీలకు నో చాన్స్.!

ఓపెన్‌ స్కూల్‌ చదివితే టెట్, డీఎస్సీలకు నో చాన్స్.!

BIKKI NEWS (MARCH 28) : ఓపెన్‌ స్కూల్‌ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు (open BEd and DEdcandidates not eligible for TET and DSC) తెలిపాయి. వీళ్లు గతంలో టెట్‌ పాసయినా ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు.

దీనివల్ల దాదాపు 25 వేల మంది డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ గతంలో ఇంటర్‌ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహించింది. వీటిని రెగ్యులర్‌ డీఎడ్‌ కోర్సులతో సమానంగా భావించారు. ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌కు హాజరయ్యారు. టెట్‌ దరఖాస్తులో అర్హత కాలంలో డీఎడ్‌కు బదులు ‘ఇతరులు’అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేసేవాళ్లు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది.

రెగ్యులర్‌ డీఎడ్‌తో ఇది సమానం కాదని పేర్కొంది. నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ఇచ్చే సర్టిఫికెట్‌తో కేవలం ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగానే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది. టెట్‌కు, డీఎస్సీకి ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా, వెరిఫికేషన్‌లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.