Mission Divyastra – AGNI – 5 – ఒకేసారి పది లక్ష్యాల చేధన

BIKKI NEWS (MARCH 12) : Mission Divyastra – AGNI – 5 – అగ్ని – 5 క్షిపణిని 5 వేల కిలోమీటర్ల ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల రేంజ్, బహుళ సామర్థ్యం. అత్యాధునిక పరిజ్ఞానం. వీటన్నింటి మేలు కలయికగా DRDO రూపొందించింది. దీనిని దివ్యాస్త్రంగా పేర్కొన్నారు.

5,000 కిలోమీటర్ల పై చిలుకు రేంజ్‌తో కూడిన అగ్ని-5 క్షిపణి రాకతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతంగా మారింది. అగ్ని-5లో వాడిన మల్టీపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ ఎంట్రీ వెహికిల్‌ MIRV) సాంకేతికత దీన్ని మరింత విధ్వంసకంగా, ప్రమాదకారిగా మారుస్తోంది. ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కలి్పంచడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ 1960ల్లో తొలుత తెరపైకి వచి్చంది. 1968లో అమెరికా దీన్ని అభివృద్ధి చేసింది. మైన్యూట్‌మ్యాన్‌-3 క్షిపణి వ్యవస్థలో దీన్ని వాడింది. 1970ల నుంచి ఎంఐఆర్‌వీ సాంకేతికత ఖండాంతర క్షిపణుల్లో పూర్తిస్థాయిలో వాడకంలోకి వచ్చింది. ఖండాంతర క్షిపణుల తయారీ, పేలోడ్‌ వ్యవస్థ తదితరాల్లో విప్లవాత్మక మార్పులకు ఎంఐఆర్‌వీ శ్రీకారం చుట్టింది.

చైనా వద్ద ఉన్న డాంగ్‌ఫెంగ్‌ తదితర క్షిపణుల రేంజ్‌ 10 వేల నుంచి 15 వేల కి.మీ. దాకా ఉంది! వాటిని దృష్టిలో ఉంచుకుని, లక్ష్యఛేదనలో కచ్చితత్వానికి పెద్దపీట వేస్తూ అగ్ని-5ని అభివృద్ధి చేశారు.

దీని తయారీకి అవసరమైన వైమానిక వ్యవస్థలను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. అంతేగాక అత్యంత కచ్చితత్వంతో కూడిన సెన్సర్లను కూడా ఈ వ్యవస్థలో అమర్చారు. వీటి సాయంతో అణు వార్‌హెడ్లు లక్ష్యాన్ని అణుమాత్రమైనా తేడా లేకుండా ఛేదించగలవు.

ఈ పరిజ్ఞానం సాయంతో ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన సంఖ్యలో సంప్రదాయ, అణు వార్‌హెడ్లను ప్రయోగించవచ్చు. ఇందుకోసం ఒకే పెద్ద వార్‌హెడ్‌ బదులుగా పలు చిన్న చిన్న వార్‌హెడ్లను క్షిపణికి సంధిస్తారు. వీటిలో ప్రతి వార్‌హెడ్‌ స్వతంత్రంగా భిన్న లక్ష్యంపై దాడి చేయగలదు. తద్వారా ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించవచ్చు. ఒకటికి మించిన వార్‌హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్‌ డిఫెన్‌ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఛేదించే సంభావ్యత ఎంతగానో పెరుగుతుంది.

అంతేగాక లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఎంఐఆర్‌వీ ప్రత్యేకత. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉంది. పాకిస్తాన్‌ కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల అబాబీల్‌ మధ్య శ్రేణి క్షిపణి ప్రయోగంలో దీన్ని ప్రయత్నించి చూశారు.