హైదరాబాద్ (జనవరి 18) : ప్రపంచంలోనే అత్య ధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకటించింది. 2022 చివరి నాటికి భారత జనాభా 141.7 కోట్లని, 2023 జనవరి 18 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకొన్నట్టు తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లని ఆ దేశం ప్రకటించింది. ప్రస్తుతం చైనా జనాభా పరంగా రెండో స్థానంలో నిలిచింది.
గత 60 ఏండ్లలో తొలిసారిగా చైనా జనాభా తగ్గినట్టు తాజా నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. . చైనా జనాభాను భారత్ 2023 చివరి నాటికి అధిగమిస్తుందని ఐక్య రాజ్యసమితి ఇదివరకు అంచనా వేసినప్పటికీ.. ఈ రికార్డును భారత్ ఇప్పటికే అధిగమించినట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడించింది.
ఇండియా జనాభా పెరుగుదల నెమ్మదించినా కూడా 2050 వరకు పెరుగుతూనే ఉంటుందని, అప్పటికి దేశ జనాభా 167 కోట్లకు చేరుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. కాగా, ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించే మన దేశంలో 2021లో కొవిడ్ కారణంగా జనగణన జరగలేదు. 2022 నుంచి 2050 వరకు పెరగనున్న ప్రపంచ జనాభాలో సగం భారత్ సహా మరో ఏడు దేశాల నుంచే ఉంటుందని ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా పేర్కొంది.