ఉద్యోగ నియామకాలలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లకై చర్యలు

BIKKI NEWS (FEB. 03) : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై నియామక ప్రక్రియలో అవలంబించాల్సిన విధివిధానాలపై ఉత్తర్వులు (GUIDELINES OF WOMEN HORIZONTAL RESERVATIONS IN RECRUITMENTS ) వెలువరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే రాతపరీక్షలు రాసిన నిరుద్యోగ అభ్యర్థులు ఫలితాలు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ఉత్తర్వులిచ్చే అవకాశాలున్నాయి.

ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలతో పాటు, భవిష్యత్తులో చేపట్టే పోటీపరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామక బోర్డు గతేడాది 20వేలకు పైగా పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించి, తుది కీ లను వెల్లడించింది. ఈ పోస్టులకు జారీచేసిన నోటిఫికేషన్లలో ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం మహిళలకు వర్టికల్‌ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు రిజర్వు అయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రోస్టర్‌పాయింట్‌ ఒకటి నుంచి లెక్కిస్తూ వీటిని అమలుచేశారు. దీంతో ఉద్యోగ ప్రకటనల్లో మహిళలకు ఎక్కువ పోస్టులు దక్కాయి.

గ్రూప్‌-1లోని 503 పోస్టుల్లో మహిళలకు దాదాపు 50 శాతం వరకు పోస్టులు రిజర్వు కావడంతో కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం ప్రకారం మహిళలకు ఆయా రిజర్వుడు వర్గాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని వెల్లడించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది. వీటిప్రకారం అప్పట్లో సాధారణ పరిపాలనశాఖ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.