BIKKI NEWS (FEB. 17) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న ఆరోగ్యానికి గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని గృహ జ్యోతి పేరుతో అందించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది
ఆధార్ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
విద్యుత్తు కనెక్షన్ నంబర్ ను, లబ్ధిదారుల ఆధార్ అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించింది.
అథెంటిఫికేషన్ చేసే సమయంలో ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
శాశ్వత ఆధార్ నంబర్ వచ్చే వరకు ఆధార్ ఎన్రోల్ మెంట్ నంబర్ తోపాటు ఫొటో ఉన్న బ్యాంక్ పాస్బుక్, పాన్, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
ఆథెంటిఫికేషన్ సమయంలో వేలిముద్రలు తీసుకుంటారని, బయోమెట్రిక్ పనిచేయకపోతే ఐరిస్ ద్వారా ప్రయత్నిస్తారని తెలిపింది. అదికూడా పనిచేయని పక్షంలో ఓటీపీ ద్వారా ఆథెంటిఫికేషన్ చేస్తారని, అదీ కాకపోతే ఆధార్ ధ్రువీకరణ పత్రం తీసుకుంటారని వివరించింది.