Home > JOBS > HIGH COURT : గ్రూప్ – 1, 2 పరీక్షలకు దివ్యాంగులకు అదనపు సమయం

HIGH COURT : గ్రూప్ – 1, 2 పరీక్షలకు దివ్యాంగులకు అదనపు సమయం

హైదరాబాద్ (నవంబర్ – 17) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల కింద నిర్వహించే పరీక్షల్లో దివ్యాంగులకు అదనపు సమయం (extra time for physically challenged tspsc exams) కేటాయించకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28లోగా కౌంటరు దాఖలు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 2(ఆర్) ప్రకారం 40 శాతం వైకల్యం ఉన్నట్లయితే, గంటకు అదనంగా 20 నిమిషాల సమయం ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ పెద్దపల్లికి చెందిన ఎన్. సాయిరాం, మరో ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి. మాధవీ దేవి విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది గౌరారం రాజశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కేంద్రం జారీచేసిన మెమోను అమలు చేయడం లేదన్నారు. గతంలో దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించినా ఎలాంటి కౌంటరు దాఖలు చేయలేదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది ఎం. రాంగోపాల్రావు వాదనలు వినిపిస్తూ ఇది ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖ తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తుందని, ఇందులో తాము నామమాత్రపు ప్రతివాది మాత్రమేనన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 28కి వాయిదా వేశారు.